అధికారంలో ఉన్నా.. అది పోయాక కూడా అంతే విలాసాలతో, హంగులతో బతికే నాయకులను చూస్తున్నాం. కానీ, అధికారం దూరం అయ్యాక.. సాదాసీదా జీవితం గడిపేవాళ్లు లేకపోలేరు. అయితే పరిస్థితుల మూలంగా అధికారానికి దూరమైన ఓ మంత్రి.. కుటుంబం కోసం రోడ్లపై క్యాబ్‌లు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనే.. ఆప్ఘానిస్థాన్ మాజీ ఆర్థిక మంత్రి ఖలీద్ పయేంద Khalid Payenda.
తాలిబన్లు కిందటి ఏడాది అప్ఘనిస్థాన్ ఆక్రమణ కొనసాగిస్తున్న టైంలో.. ఖలీద్ పయేంద అమెరికాకు వెళ్లి తలదాచుకున్నారు. ప్రస్తుతం ఆయన వాషింగ్టన్‌లో ఉబెర్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. అంతేకాదు.. జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గానూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అయితే ఆ వచ్చే జీతం చాలకనే.. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇలా రాత్రిళ్లు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారట ఆయన. తాజాగా.. ఆయన దుస్థితిపై వాషింగ్టన్ పోస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ప్రపంచానికి తెలిసొచ్చింది.
అష్రఫ్ ఘనీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు ఖలీద్ పయేంద. లెబనీస్ కంపెనీకి చెల్లింపుల విషయంలో ఆరోపణలు రావడంతో తనను అరెస్ట్ చేయిస్తారేమోనని ఆయన భయపడ్డాడట. అందుకే తాలిబన్లు ఆక్రమణ మొదలుపెట్టాక.. అమెరికాకు ఆయన పారిపోయారు. ‘‘నాకంటూ ఓ చోటు లేదు. నేను ఇక్కడి వాడిని కాదు. అక్కడి వాడిని కూడా కాదు. జీవితం శూన్యంగా కనిపిస్తోంది. అలాగని ఎవరిని నిందించాలని అనుకోవడం లేదు’’ అని అంటున్నారాయన.
అఫ్గన్లను అమెరికా అనాధలుగా వదిలేసిందని, అలాగని ఇప్పుడు మళ్లీ సమిష్టిగా నిర్మించుకుందామనే సంకల్పం కూడా లేదన్నారు. ‘‘మేమంతా అవినీతిపై పేక ముక్కలతో ఇంటిని నిర్మించుకున్నాం. అందుకే అంత వేగంగా కుప్పకూలింది. బక్క పలుచగా ఉన్నా జనాల్ని.. ప్రభుత్వం దోచుకోవాలనే చూసింది. మా ప్రజలకు మేమే ద్రోహం చేశాం. చేసిన పాపం ఇవాళ మాకు ఈ బతుకుల్ని ఇచ్చింది’’ అని పయేంద్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.
విశేషం ఏంటంటే.. ఖలీద్ పయేంద కుటుంబం ఆర్థికంగా బాగున్న కుటుంబమే ఒకప్పుడు. అఫ్గనిస్థాన్‌లో మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ నెలకొల్పిన భాగస్వాముల్లో ఈయన కూడా ఉన్నారు. ఆయనకు ఈ పరిస్థితీ కొత్తేం కాదు. ఎందుకంటే.. అఫ్గనిస్థాన్‌లో అంతర్యుద్ధంతో తన 11 ఏళ్ల వయసు లో కుటుంబంతోపాటు పాక్‌కు వలస వెళ్లాడు ఆయన. తిరిగి అమెరికా దళాల ఎంట్రీతో.. సొంత గడ్డపై అడుగుపెట్టి, సంపాదించిన దాంతో యూనివర్సిటీలో పెట్టుబడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment