అల్‌ఉలా: సంవత్సరాల తరబడి సాగుతున్న కయ్యానికి తెరదించుతూ ఖతార్, సౌదీ అరేబియా స్నేహం దిశగా అడుగులు వేశాయి. మంగళవారం ఖతార్ రాజు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని సౌదీ అరేబియా పర్యటనకు వచ్చారు. ఆయనకు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు. ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దు నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. యూఎస్‌కు నమ్మకమైన మిత్రులుగా ఉన్న ఈ రెండు దేశాలకు మధ్య చాలా సంవత్సరాలుగా పొసగడం లేదు. ఈ వివాదానికి తెరదించుతూ రెండు దేశాలు తమ సరిహద్దులు తెరుస్తున్నట్లు ప్రకటించాయి. గల్ఫ్ అరబ్ నేతల వార్షిక సమావేశం అల్‌ఉలాలో జరగనుంది. ఇరాన్‌తో సంబంధాలు, ఇస్లామిస్టు గ్రూపులకు ఖతార్ సాయాన్ని నిరసిస్తూ నాలుగు అరబ్ దేశాలు (ఈజిప్టు, యూఏఈ, సౌదీ, బహ్రైన్) 2017 నుంచి ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్నాయి. వీటిని గాడిన పెట్టేందుకు షేక్ తమిమ్ యత్నించనున్నారు. అమెరికా, కువైట్‌లు ఖతార్‌కు ఇతర అరబ్ దేశాలకు మధ్య సత్సంబంధాల కోసం మధ్యవర్తిత్వం నెరిపాయి.
రాజీకి ఖతార్ ఎలాంటి ప్రతిపాదనలు ఒప్పుకున్నది ఇంకా తెలియరాలేదు. గల్ఫ్ ఐక్యత తిరిగి సాధించేందుకు తాము కృషి చేస్తామని ఖతార్ మంత్రి అన్వర్ గారాఘ్‌ష్ చెప్పారు. తాజా సమావేశాల్లో సౌదీతో ఖతార్ రాజు ఒప్పందాలపై సంతకాలు చేయవచ్చని ఓ అంచనా. ఖతార్‌తో సత్సంబంధాలు సాధించడం ద్వారా బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వంతో బంధం బలోపేతం చేసుకోవాలని సౌదీ యోచిస్తోంది. యెమెన్‌తో యుద్ధం, ఇరాన్, అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం నేపథ్యంలో సౌదీకి యూఎస్ సాయం ఎంతో అవసరం ఉంది. అయితే ఇప్పటికీ టర్కీ, ఇరాన్‌తో ఖతార్‌కు మంచి సంబంధాలుండడం, టర్కీ మరియు ఖతార్‌లు ముస్లిం బ్రదర్‌హుడ్‌కు మద్దతు ఇవ్వడం వంటివి అరబ్ దేశాలను ఆందోళనపరుస్తూనే ఉన్నాయి. అరబ్‌దేశాల బహిష్కరణతో ఖతార్ ఎకానమీ బాగా దెబ్బతిన్నది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇకపై ఖతార్ అడుగులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment