వైద్యం అందని దైన్యం
ఉన్న ఊర్లో పనుల్లేక పొట్ట చేతబట్టుకుని పోయిన బడుగు జీవి అక్కడ పనికోసం ఎన్నో అవస్థలు పడ్డాడు. ఏదో ఒక పనిలో కుదిరిన ఆయనను విధి వెంటాడింది. నిచ్చెన జారి కిందపడిపోయాడు. ఆ ప్రమాదంలో కాలు విరిగితే పనిలో పెట్టుకున్న కంపెనీ కనీసం వైద్యం కూడా చేయించలేదు. దూర దేశంలో పడిన కష్టాలు ఆయన మాటల్లోనే..
సిరిసిల్లటౌన్: నా పేరు చిలుముల చంద్రశేఖర్. మాది సిరిసిల్ల పట్టణం బీవైనగర్. స్వర్ణకారుడిగా పనిచేస్తూ నా భార్య అరుణ, కొడుకులు సాయికుమార్, తేజలను పోషించుకునే వాడిని. పదేళ్ల క్రితం కులవృత్తికి పనులు తక్కువయ్యాయి. పిల్లల భవిష్యత్తు కోసం దుబాయ్ పోయి సంపాదించాలనుకున్న. కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన ఓ ఏజెంటు రూ.1.30లక్షలను తీసుకుని దుబాయ్‌కి పంపిండు. అక్కడ ఆంధ్రాకు చెందిన అన్లైసెన్స్డ్ ఏజెంటు నన్ను మూడు నెలలు ఏ పనీ లేకుండా తిప్పిండు. చేతిల డబ్బుల్లేకుండా అక్కడ చాలా రోజులు పస్తులుంటూ.. తెలుగు వారి వద్ద తలదాచుకునేటోన్ని. ఆ తర్వాత ఏమైందో గానీ అతని ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఎక్కడికో పారిపోయిండు.
అక్కడ మనవాళ్లకు నా పరిస్థితి తెలుసుకుని ఎక్కడైనా పని ఉంటే చెప్పేటోళ్లు. లేకుంటే రూములోనే ఉండేటోన్ని. కొద్ది రోజులకు మన తెలుగోళ్ల సాయంతో ఓ కంపెనీలో చేరాను. మూడున్నర సంవత్సరాలు కార్పెంటర్ పనిచేసిన. యజమానులు జీతం సరిగా ఇవ్వక పోయేటోళ్లు. కంపెనీలో చేరేటప్పుడు నెలకు రూ.1200 దర్హమ్లు ఇస్తానన్నరు. కానీ నాలుగు నెల్లకోసారి కూడా జీతం ఇచ్చేటోళ్లు కాదు. తర్వాత ఖల్లవెళ్లి వీసాతో కార్పెంటర్ పనులే చేసేటోన్ని. నన్ను అక్కడ పనిలో పెట్టిన ఏజెంటు నాకు డబ్బులు సరిగా ఇచ్చేటోడు కాదు. కచ్చితంగా జీతం ఇవ్వాలని నిలదీస్తే.. జైలుకు పంపుతాని బెదిరించిండు.
ఇట్లా నేను అక్కడ ఏజెంట్ల వద్ద రూ.23వేల దర్హమ్స్ మునిగాను. డిసెంబర్ 5న ఓ భవనంలో సీలింగ్ పనులు చేస్తూ నిచ్చెన జారీ కిందపడిపోయాను. ఏజెంటు ఆసుపత్రికి తీసుకుపోయిండు. కేవలం మందులు మాత్రమే ఇప్పించిండు. కాలి ఎముక మూడుముక్కలైందని అక్కడి డాక్టర్లు చెప్పగా..రూ.10 వేల దర్హమ్స్ ఖర్చయితాయన్నరు. చేసేది లేక నా పరిస్థితిని ఇంటివాళ్లకు చెప్పుకున్నా. పొత్తూరుకు చెందిన రవీందర్‌రెడ్డికి మావాళ్లు చెబితే.. ఆయన గల్ఫ్ బాధితుల సెల్ కోఆర్డినేటర్లు అడవి పదిరకు చెందిన మహేందర్‌రెడ్డి, ముస్తాబాద్‌కు చెందిన జనగామ శ్రీనివాస్, గిరీష్పంథ్కు సమాచారం ఇచ్చారు.
వారి సాయంతో ఎంబసీకి పోయి నా పరిస్థిని వివరించగా.. నాకు రూ.1400 దర్హమ్స్ జరిమానా వేశారు. సిరిసిల్ల నుంచి నా భార్య రూ.40వేలు అప్పుచేసి పంపగా.. వాటితో ఇంటికి తిరిగి వచ్చాను. కాలికి ఆపరేషన్ చేయించుకోవాలంటే చేతిలో చిల్లిగవ్వలేదు. మంచం పట్టిన నాకు భార్య, పిల్లలు సేవలు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎట్లా నడిచి వారిని సాదుకోవాలి. కరీంనగర్ ఆసుపత్రికి పోతే ఆరోగ్యశ్రీ ఈ ఆపరేషన్‌కు వర్తించదన్నారు. రూ.80వేలు ఖర్చవుతుందట. ప్రభుత్వం ఆదుకోవాలి.
గల్ఫ్‌లో 87,64,829 మంది భారతీయులు
గల్ఫ్ దేశాల సహకారమండలిలోని(గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల –జీసీసీ) ఆరు దేశాలలో ప్రవాస భారతీయుల జనాభా 87 లక్షల 64 వేల 829కు చేరిందని లోక్ సభలో జితేంద్ర చౌదరి అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ డిసెంబరు 27న లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సౌదీ అరేబియాలో 32,53,901 మంది, యుఏఈలో 28 లక్షలు, కువైట్‌లో 9,17,970, ఒమన్‌లో 7,83,040, ఖతార్‌లో 6.97 లక్షలు, బహరేన్లో 3,12,918 మంది ప్రవాస భారతీయులు ఉన్నారని తెలిపారు. ఆరు గల్ఫ్ దేశాలలో 11,774 మంది భారత సంతతి ప్రజలు ఉన్నట్టు చెప్పారు. ప్రపంచంలోని 208 దేశాలలో ఎన్నారైలు, పీఐఓలు కలిపి 3 కోట్ల 12 లక్షల 33 వేల 234 మంది భారత ప్రవాసులున్నారని ప్రకటించారు. ఇందులో కోటి 33 లక్షల 27 వేల 438 మంది ప్రవాస భారతీయులు, కోటి 79లక్షల 5వేల 796 మంది భారత సంతతి ప్రజలు ఉన్నారని వివరించారు.
ప్రవాసీ భారతీయ దివస్‌కు భారతి సంతతి పార్లమెంటేరియన్లు
జనవరి 9న ఢిల్లీలో నిర్వహించనున్న ప్రవాసీ భారతీయ దివస్‌కు ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న భారత సంతతికి చెందిన 285 మంది పార్లమెంటేరియన్లను భారత ప్రభుత్వం ఆహ్వానించింది. ఇప్పటివరకు 125 మంది పార్లమెంటేరియన్లు తమ సమ్మతిని తెలియజేశారని విదేశాంగ శాఖలోని ప్రవాసీ భారతీయ వ్యవహారాల శాఖ కార్యదర్శి జ్ఞానేశ్వర్ మూలే తెలిపారు. భారత ప్రభుత్వం దౌత్యాన్ని ప్రజాపక్షం చేసిందని, భారత సంతతితో పరస్పరం అభిప్రాయాలను పంచుకోవడం, మాతృభూమితో వారి బంధాన్ని దృఢపరచడం తమ లక్ష్యమని అయన అన్నారు. విదేశాల్లోని భారతీయుల కొరకు తక్షణం స్పందించే ఆన్లైన్ వ్యవస్థ ’మదద్’ (కాన్సులర్ సర్వీసెస్ మేనేజ్మెంట్ సిస్టం) ద్వారా 26 వేల ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 21 వేలు పరిష్కరించామని వివరించారు.
ఖతార్‌లో ఎన్నారైలకు దౌత్య సేవలు
ఖతార్ దేశ రాజధాని దోహాలోని ఇండియన్ ఎంబసీ (భారత దౌత్య కార్యాలయం) అధికారులు ఈనెల 12న శుక్రవారం అల్ బనూష్ క్లబ్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాన్సులర్ క్యాంపు (దౌత్య సేవల శిబిరం) నిర్వహిస్తారు. ఎన్నారైలు వారి పాస్‌పోర్ట్, దౌత్య సంబంధ సేవలు గురించి, వేతనాలు తదితర సమస్యల గురించి అధికారులకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మరిన్ని వివరాలకు ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్ +974 5580 8254 ఇ–మెయిల్: labour.doha@mea.gov.inకు సంప్రదించవచ్చు.
సౌదీలో ‘ప్రవాసీ ప్రజావాణి’
సౌదీ అరేబియాలోని జిద్దా ఇండియన్ కాన్సులేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈనెల 12న శుక్రవారం ’కాన్సులేట్ ఎట్ యువర్ డోర్’ (మీ ముంగిట్లోకి దౌత్య కార్యాలయం) కార్యక్రమాన్ని భారత దౌత్య అధికారులు నిర్వహిస్తున్నారు. అభాలోని ఖమీస్ ముషాయిత్‌లో 054 6722909, మక్కాలోని ఇండియన్ హజ్ మిషన్‌లో 012 5603580, నజరాన్లో 017 5221949 నంబర్లలో సంప్రదించవచ్చు.
సేకరణ: మంద భీంరెడ్డి, అధ్యక్షులు, ప్రవాసీ మిత్ర