ప్యాంగాంగ్: ఉత్తర కొరియాలోని అధికార వర్కర్స్ పార్టీ పరేడ్‌లో మునుపెన్నడూ చూడని సంఘటన జరిగింది. పరమ క్రూరుడు, నియంతగా పేరుపడ్డ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రసంగం మధ్యలో కన్నీరు పెట్టుకున్నారు. అధికార వర్కర్స్ పార్టీ 75వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పరేడ్ నిర్వహించారు. దేశ ప్రజల కష్టాలు, సైనికులకు కృతజ్ఞతలు చెప్పే సమయంలో ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తొలిసారిగా దేశ ప్రజలకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అంతర్జాతీయంగా ఆంక్షలు, తుపానులు, కరోనా మహమ్మారి ఆర్థిక ప్రగతికి అవరోధాలుగా మారాయని అన్నారు. ఆ విషయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయానని చెప్పారు.
తనపై ఉంచిన అపార నమ్మకానికి తగ్గట్టుగా ఏమీ చేయలేకపోయిందుకు సిగ్గు పడుతున్నానని కిమ్ అన్నారు. దేశ ప్రజలను కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తన ప్రయత్నాలు, అంకితభావం సరిపోలేదని వెల్లడించారు. అయితే, దేశంలో ఒక్కరు కూడా కరోనాబారిన పడకపోవడం సంతోషం కలిగిస్తోందని కిమ్ పేర్కొన్నారు. అదే సమయంలో దాయాది దేశం దక్షిణ కొరియాతో త్వరలో చేతులు కలుపుతామనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కరోనా నుంచి దక్షిణ కొరియా కోలుకోవాలని ఆకాక్షించారు.
(చదవండి: భారీ క్షిపణిని ప్రదర్శించిన ఉ.కొరియా)
స్వీయ రక్షణ కోసమే
దేశ రక్షణ శక్తిని, స్వీయ రక్షణను బలోపేతం చేయడాన్ని కొనసాగిస్తామని అధ్యక్షుడు కిమ్ పునరుద్ఘాటించారు. స్వీయ రక్షణ కోసమే ఆయుధాలను సిద్ధం చేస్తున్నామని, ఇతరులపై దాడి ఆలోచన తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. తమ దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తానని ఈ సందర్భంగా కిమ్ ప్రజలకు వాగ్దానం చేశారు. కాగా, తాము తయారు చేసిన అతి భారీ నూతన ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ (ఐసీబీఎం)ని ఉత్తర కొరియా ప్రదర్శించింది. మిలటరీ పరేడ్‌లో భాగంగా భారీ వాహనంపై రాజధాని ప్యాంగ్‌గ్యాంగ్‌లో ఈ ఖండాంతర క్షిపణి ప్రదర్శన నిర్వహించారు. ఇది పనిచేసినట్టయితే.. ప్రపంచంలోనే అతిపెద్ద ఐసీబీఎంలలో ఒకటిగా నిలుస్తుందని నిపుణులు చెప్తున్నారు.
అమెరికాలోని ఏ ప్రాంతంపైన అయినా అణుదాడి చేసేందుకు అనుగుణంగా దీనిని రూపిందించినట్టు తెలుస్తోంది. ఇక ప్రసంగంలో ఎక్కడా కూడా కిమ్ అమెరికా గురించి ప్రస్తావించకపోవడం విశేషం. క్రూరుడుగా తనపై ఉన్న చెడ్డపేరును మార్చుకునేందుకు, తన పాలనతో విసిగిపోయిన ప్రజలను కాస్త మంచి చేసుకునేందుకు కిమ్ కొత్త పంథాను ఎంచుకున్నారని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అల్లకల్లోంగా మారిన ఆర్థిక పరిస్థితి, పరిపాలన విషయంలో కిమ్‌పై నెలకొన్న ఒత్తిడికి ఆ కన్నీరు సూచిక కావొచ్చన్నది మరికొందరు విశ్లేషకుల అంచనా.
(చదవండి: ట్రంప్ దంపతులు కోలుకోవాలని ప్రార్థించిన కిమ్)
Comments
Please login to add a commentAdd a comment