దక్షిణ కొరియాలో వైద్యులు- ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెకు దిగిన వైద్యుల లైసెన్స్‌లు సస్పెండ్ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గింది.
సమ్మె చేస్తున్న వైద్యుల లైసెన్సులను సస్పెండ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోగ్య మంత్రి చౌ క్యో హాంగ్ తెలిపారు. వారు తిరిగి విధుల్లో చేరాలని ఆయన కోరారు. అయితే ప్రభుత్వ ప్రకటన తర్వాత ఎన్ని వేల మంది వైద్యులు విధుల్లోకి వస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
అత్యవసర చికిత్సలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు చికిత్స అందించే వైద్యుల కొరతను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని చౌ క్యో హాంగ్ పేర్కొన్నారు. కాగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచాలన్న ప్రభుత్వ యోచనకు నిరసనగా ఫిబ్రవరి నుంచి మెడికల్ ట్రైనీలుగా పనిచేస్తున్న 13వేల మంది జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్స్ సమ్మెకు దిగారు. ఇది ఆసుపత్రుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపింది.
ప్రభుత్వ ప్రణాళికకు మద్దతుగా మేలో సియోల్ కోర్టు తీర్పు ఇవ్వడంతో సమ్మెకు దిగిన వైద్యులకు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఆ దరిమిలా ఆసుపత్రుల్లో విధుల నిర్వహణకు తిరిగివచ్చే వైద్యుల లైసెన్సులను సస్పెండ్ చేయబోమని ప్రభుత్వం ప్రకటించింది. కాగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను అధిగమించేందుకు 2035 నాటికి 10 వేల మంది వైద్యులను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నదని అధికారులు తెలిపారు.
అయితే దేశంలో వైద్య విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో, ఇది అంతిమంగా దేశంలోని వైద్య సేవలపై ప్రభావం చూపుతుందని వైద్యులు ఆరోపిస్తున్నారు. కాగా దక్షిణ కొరియాలో అత్యధిక వేతనం పొందే వృత్తులలో వైద్య వృత్తి ఒకటి. వైద్యుల సంఖ్య పెరిగితే తమ ఆదాయాలు తగ్గిపోతాయని పలువురు వైద్యులు ఆందోళన చెందున్నారు.
Comments
Please login to add a commentAdd a comment