ప్రధాని మోదీపై వ్యాఖ్యలు సిగ్గుచేటు.. కానీ.. | Maldives Foreign Minister Slams Remarks Against India | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీపై వ్యాఖ్యలు సిగ్గుచేటు.. కానీ..

Published Mon, Jan 8 2024 2:07 PM | Last Updated on Mon, Jan 8 2024 2:17 PM

Maldives Foreign Minister Slams Remarks Against India - Sakshi

మాలే: ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇరుదేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలు సిగ్గుచేటు.. జాత్యాహంకారం అని ఆ దేశ మాజీ డిప్యూటీ స్పీకర్ ఇవా అబ్దుల్లా అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల ఆమె భారతదేశానికి క్షమాపణలు చెప్పారు. బైకాట్ మాల్దీవులు నిర్ణయాన్ని వదిలివేయాలని భారతీయులను అభ్యర్థించారు. 

"మా దేశ మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం అర్థం చేసుకోవచ్చు. భారతీయులు న్యాయబద్ధంగా కోపంగా ఉన్నారు. ఆ వ్యాఖ్యలు దారుణమైనవి. కానీ ఇవి మాల్దీవుల ప్రజల అభిప్రాయాన్ని ఏ విధంగానూ ప్రతిబింబించవు. ఈ వ్యాఖ్యలకు భారతదేశ ప్రజలకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా" అని ఆమె అన్నారు. 

ప్రధాని మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్‌ కూడా స్పందించారు. విదేశీ నాయకులపై ఈ వ్యాఖ్యలు ఆమోదించలేనివని అన్నారు. మాల్దీవుల ప్రభుత్వ అధికారిక అభిప్రాయాన్ని ప్రతిబింబించవని  చెప్పారు. భారత్‌తో మాల్దీవులు నిర్మాణాత్మక, సానుకూల సంభాషణను పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్‌ చేశారు. అవి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి:  Lakshadweep Islands History: లక్షద్వీప్‌పై పాక్‌ కన్ను.. భారత్‌ ఎత్తుగడతో చిత్తు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement