ఎడారి అనగానే.. ఎటు చూసినా ఇసుక తెన్నెలు, అక్కడక్కడా బ్రహ్మజెముడు, నాగజెముడు పొదలు అనే తలపే వస్తుంది కదా! కానీ, అమెరికాలోని ఫ్రీపోర్ట్ పట్టణానికి సమీపంలో ఉన్న ‘మైనె డెజర్ట్’లో మాత్రం ఇసుక, నీరు, చెట్లు.. అన్నీ పుష్కలంగా ఉంటాయి. పైగా నిత్యం వందలాది పర్యాటకులతో కిటకిటలాడుతుంటుంది. ఎందుకంటే, ఇది నిజమైన ఎడారి కాదు. మనిషి నిర్మించిన కృత్రిమ ఎడారి.
నిజానికి శతాబ్దం కిందట ఇదొక వ్యవసాయ భూమి. గోధుమ, వరి పండించే పంటపొలం. పర్యావరణ మార్పుల కారణంగా భూసారం కోల్పోయి, ఇసుక మేట వేసింది. దీంతో చాలామంది భూమిని అమ్ముకుని ఊరు విడిచి వెళ్లిపోయారు. ఇందులో ఎక్కువ భాగాన్ని అంటే 40 ఎకరాలను కొన్న టటిల్ అనే వ్యక్తి , కొంతకాలం గొర్రెలు మేపడంతో అక్కడ అసలు గడ్డి అనేదే లేకుండా పోయింది.
తర్వాత ఆ నలభై ఎకరాలను 1919లో హెన్రీ గోల్డ్‌రప్ కొనుగోలు చేసి, నిజంగానే ఆ ప్రాంతాన్ని ఓ ఎడారిలా మార్చాలని నిర్ణయించుకున్నాడు. మరికొంత ఇసుకను తెప్పించి 2.5 మీటర్ల ఎత్తుమేర మొత్తం చల్లించి, అందమైన ఎడారిలా మార్చాడు. సందర్శకుల కోసం అక్కడక్కడ చెట్లు కూడా పెంచాడు. పిల్లలు ఆడుకోవడానికి ఓ ప్రత్యేక ఆటస్థలం, మ్యూజియం కూడా ఉన్నాయి. బాగుంది కదా ఈ కృత్రిమ ఎడారి!
Comments
Please login to add a commentAdd a comment