రెస్టారెంట్ యజమాన్యానికి, ప్రాంక్ చేసిన వ్యక్తికి మధ్య చాటింగ్ స్ర్కీన్ షాట్
మెల్‌బోర్న్ : మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు.. అసలే అంతంత మాత్రం వ్యాపారం జరుగుతున్న ఓ రెస్టారెంట్‌పై ఫ్రాంక్ చేశాడో రాక్షసుడు. పెద్ద మొత్తంలో ఆహారం ఆర్డర్ చేసి తప్పుడు అడ్రస్ ఇచ్చి మోసం చేయటమే కాకుండా ఏంటని ప్రశ్నించినందుకు తిట్ల పురాణం మొదలెట్టాడు. వివరాలు.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఓ రెస్టారెంట్‌కు కొద్దిరోజుల క్రితం 21 ఆహార పొట్లాలకు ఆర్డర్ వచ్చింది. డెలివరీ తర్వాత డబ్బులు చెల్లిస్తానని సదరు వినియోగదారుడు చెప్పాడు. డెలివరీ బాయ్ ఆహార పొట్లాలను వినియోగదారుడు చెప్పిన అడ్రస్‌కు తీసుకెళ్లాడు. అది తప్పుడు అడ్రస్ అని తేలింది. దీంతో డెలివరీ బాయ్ అతడికి దీనిపై ‘‘మీరిచ్చిన అడ్రస్ తప్పుగా ఉంది’’ అని మెసేజ్ చేయగా.. ‘‘నాకు తెలుసు, .....’’ అంటూ వినియోగదారుడు బూతు మాట అన్నాడు. ఇక చేసేదేమీ లేక డెలివరీ బాయ్ ఆహార పొట్లాలను వెనక్కు తీసుకెళ్లాడు. ( ఓ అజ్ఞాత వాసి నీ వివరాలు పంపు!)
రెస్టారెంట్ యజమాన్యం దీనిపై భావోద్వేగంగా స్పందిస్తూ.. ‘‘ మానవత్వం లేకుండా జోక్ వేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ స్థానిక చిరు వ్యాపారాన్ని దెబ్బ తీసినందుకు కృతజ్ఞతలు’’ అని మెసేజ్ చేసింది. ఫ్రాంక్ చేసిన వ్యక్తి తిరిగి స్పందిస్తూ.. ‘‘ మూర్ఖుడా.... మీ హోటల్ ఆహారాన్ని ఎవరూ కొనరు. నాకు ఇంటిపనులు చేసిపెట్టే భార్య ఉంది. మీ..... ఆహారం అవసరం లేదు’’ అంటూ రెచ్చిపోయాడు. చివరగా రెస్టారెంట్ యజమాన్యం ‘‘ నీ భార్యను ఆ దేవుడే కాపాడాలి’’ అన్న ఉద్ధేశం వచ్చేలా లాస్ట్ పంచ్ వేసింది. ఈ సంభాషణలకు సంబంధించిన స్ర్కీన్ షాట్లను తీసి రెడ్డిట్‌లో షేర్ చేయగా.. నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి క్రూరత్వానికి కూడా పెనాల్టీ వేయాలని అంటున్నారు. లాస్ట్ పంచ్ విషయంలో రెస్టారెంట్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment