లాస్‌ఏంజెల్స్: మేఘన్ మార్కెల్.. సాధారణ కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ నటిగా తనను తాను నిరూపించుకున్నారు. సెలబ్రిటీ హోదాను అనుభవించారు. ప్రిన్స్ హ్యారీని ప్రేమించి, పెళ్లాడి బ్రిటన్ రాజవంశ కోడలిగా ప్యాలెస్‌లో అడుగుపెట్టిన తర్వాత ఆమె ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమయ్యారు. అయితే రాచ కుటుంబ సభ్యురాలైనంత మాత్రాన ఎన్నడూ తనకున్న ప్రత్యేక గుర్తింపును, అస్థిత్వాన్ని మేఘన్ కోల్పోలేదు. ప్రాణంగా ప్రేమించే భర్త హ్యారీ, ముద్దులొలికే తమ చిన్నారి కుమారుడు ఆర్చీ మాత్రమే లోకంగా బతకాలనుకున్నారు.
అందుకోసం రాజ కుటుంబం నుంచి విడిపోయేందుకు కూడా ఆమె వెనుకాడలేదు. భర్తతో కలిసి ధైర్యంగా ముందడుగు వేసి రాజప్రాసాదాన్ని వీడి అమెరికాలో సెటిలయ్యారు. రాచ మర్యాదలు, కట్టుదిట్టమైన భద్రత వంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదా జీవితం గడుపుతున్నారు. తన ఉనికిని చాటుకుంటూ ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న మేఘన్ మార్కెల్ ఒక విషయంలో మాత్రం తీవ్రంగా వేదన చెందారట. గర్భవతిగా ఉన్న సమయంలో సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ ఆమెపై తీవ్ర ప్రభావం చూపిందట. (చదవండి: జోకొట్టే పాపాయి)
అక్టోబరు 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ‘టీనేజ్ థెరపీ’ పోడ్‌కాస్ట్‌లో భాగంగా మేఘన్ మార్కెల్ తన మనసులోని భావాలు పంచుకున్నారు. కాలిఫోర్నియా హై స్కూలుకు చెందిన సీనియర్ విద్యార్థులతో మాట్లాడుతూ.. ‘‘ఒకరితో ఒకరు పరిచయం పెంచుకోవడానికి, ప్రపంచంతో అనుసంధానం కావడానికి సోషల్ మీడియా ఎంతగా ఉపయోగపడుతుందో, అదే స్థాయిలో వ్యతిరేక ప్రభావం కూడా చూపుతుంది. నాకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడతాను. మీకు తెలుసా! 2019లో ప్రపంచం మొత్తం మీద విపరీతంగా ట్రోలింగ్ బారిన పడిన వ్యక్తిని నేనే. అప్పుడు ఆర్చీ నా పొట్టలో ఉన్నాడు. ఆ సమయంలో ఆన్‌లైన్ ద్వారా నా మీద తీవ్ర స్థాయిలో విద్వేషపూరిత కథనాలు వెలువడ్డాయి.
అలాంటి అనుభవాలు ఎదుర్కోవడం కాస్త కష్టం. కానీ నేను వాటిని అధిమించాను. అయితే మన గురించి అసత్యాలు ప్రచారమవుతున్నాయని తెలిసినప్పుడు భావోద్వేగానికి లోనవుతాం. అంతిమంగా ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పదిహేనేళ్ల టీనేజర్లు అయినా, 25 ఏళ్ల యువత అయినా.. ఎవరైనా సరే అలాంటి సమయంలో ఒకే రకమైన ఉద్వేగానికి గురవుతారు. ప్రపంచం తమను వేరుచేసినట్లు భావిస్తారు’’అని చెప్పుకొచ్చారు. అయితే వీలైనంత తొందరగా ఇలాంటి ప్రతికూల భావనల నుంచి బయటపడి, మానసిక స్థైర్యంతో ముందుకు సాగితే జీవితాన్ని మళ్లీ సంతోషమయం చేసుకోవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment