వణికించే చలిలో.. రోడ్డుమీదే ప్రసవం...
కల్లోల గాజాలో విషాద గాథ
గాజా నగరం. జనవరి మాసం. రాత్రి 10 గంటలు. ఎముకలు కొరికే చలి. ఇజ్రాయేల్ దాడులతో బాంబుల మోత మోగిపోతోంది. 34 ఏళ్ల ఆలా అల్ నిమర్. అప్పటికే నిండు గర్భిణి. నడిరోడ్డు మీద పురిటినొప్పులు పడుతోంది. నేపథ్యంలో దూరంగా బాంబుల మోతలు. అంబులెన్స్‌కు కాల్ చేయడానికి నెట్‌వర్క్ లేదు. ట్యాక్సీ కోసం వెళ్లిన భర్త అబ్దుల్లా ఇంకా తిరిగి రాలేదు.
‘ఎలాగైనా నేను ఆస్పత్రికి చేరుకున్నాకే ప్రసవించేలా చూడు తండ్రీ’ అన్న ఆలా వేడుకోళ్లు ఫలించలేదు. దాంతో నిస్సహాయురాలిగా రోడ్డు మీదే ప్రసవించింది. ట్యాక్సీ దొరక్క వెనక్కి పరుగెత్తుకొచ్చిన భర్త నెత్తుటి కూనను చేతుల్లోకి తీసుకున్నాడు. బొడ్డుతాడు కత్తిరించేందుకు కూడా ఏమీ లేదు. సోదరుడు తెచి్చన మెడికల్ కిట్‌లో ఉన్న కత్తెరతో బొడ్డుతాడు కత్తిరించారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ఎట్టకేలకు ఓ కారు దొరికినా పెట్రోల్ అయిపోవడంతో అదీ ఆగిపోయింది.
భర్త, సోదరుడు మొబైల్ ఫ్లాష్ లైట్‌తో దారి చూపుతుంటే పసికందును స్వెటర్‌లో చుట్టుకుని రక్తమోడుతూ గంటసేపు నడిచిందా పచ్చి బాలింత. దారంతా ‘హెల్ప్ హెల్ప్’ అని అరుస్తూనే ఉన్నారంతా. ఎట్టకేలకు ఓ మినీ బస్సు వారిని ఆస్పత్రి చేర్చింది. అప్పటికీ విపరీతమైన ని్రస్తాణతో ఆలా కళ్లు మూతలు పడ్డాయి. తెల్లవారి గానీ స్పృహలోకి రాలేదు. వెంటనే బిడ్డ కోసం తడుముకుంది. పాపాయి ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు చెప్పాక గానీ కుదుట పడలేదు. యుద్ధం మొదలయ్యాక అదే ఆమెకు అత్యంత సంతోషాన్నిచి్చన ఉదయం.
పది నెలలు.. పదకొండు దాడులు...
ఇది ఒక ఘటన మాత్రమే. గత అక్టోబర్‌లో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టిన నాటినుంచి ఇలాంటి ఘటనలు కోకొల్లలు. బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు. తల్లిదండ్రులను పోగొట్టు్టకుని అనాథలైన పిల్లలు. కళ్లముందే పిల్లలు మరణిస్తుంటే నిస్సహాయంగా చూసిన వృద్ధులు. తను ప్రసవించే నాటికన్నా యుద్ధం ఆగిపోవాలనిదేవుడుని వేడుకుంది ఆలా. అలా జరగకపోయినా నడి రోడ్డుపైనే ఈ లోకంలోకి వచి్చన తన చిన్నారి నిమాకు మాత్రం ఇప్పుడు ఆర్నెల్లు నిండాయి.
నిమా ఆమెకు మూడో సంతానం. ముగ్గురు పిల్లలకు సరైన ఆహారాన్ని ఇవ్వలేకపోతున్నాననే బాధ ఆలాను వెంటాడుతోంది. పిల్లలకు రోజుకు కనీసం ఒక్క రొట్టె దొరకడమే గగనంగా ఉంది. పూటకు పావు రొట్టెతో సరిపుచ్చుకుని అర్ధాకలితోనే పడుకుంటున్నారు. యుద్ధం మొదలవగానే గాజాలోని జైటౌన్‌లో ఉన్న ఆలా ఇంటిపై తొలి దాడి జరిగింది. దాంతో బంధువుల ఇంటికి వెళ్లారు.
అదీ బాంబు దాడులకు బలవడంతో పొరుగు వాళ్ల ఇళ్లకు. అలా ఈ పది నెలల్లో ఆలా కుటుంబం ఏకంగా పదకొండు బాంబుదాడులు తప్పించుకుంది. కాకపోతే అన్నిసార్లూ నిరాశ్రయమవుతూ వచి్చంది. ఆలా ఎనిమిది నెలల గర్భవతిగా ఉండగా ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు వారుంటున్న ఇంటిని చుట్టుముట్టాయి. అప్పుడు ఆలా కుటుంబంతో పాటు 25 మంది దాకా ఇంట్లో ఉన్నారు.
కేవలం దైవకృప వల్లే ఆ దాడి నుంచి బతికి బట్ట కట్టామని గుర్తు చేసుకున్నారామె. నెలకే మరో బాంబుదాడి ఆమె 26 ఏళ్ల సోదరుడిని పొట్టన పెట్టుకుంది. ‘చీకటి రోజుల్లో మాత్రం ఆశల గానాలు ఉండవా!? ఉంటాయి. కాకపోతే చీకటిరోజుల గురించే ఉంటాయి’ అన్నారో ఫ్రెంచ్ నాటకకర్త. ఇంతటి యుద్ధ మధ్యంలో, అంతులేని విషాదాల పరంపరలో ఆలా కుటుంబాన్ని నడిపిస్తున్నది ఒకే ఒక్కటి.. చిన్నారి నిమా బోసినవ్వులు...
39,324 మంది మృతి...
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటివరకు 39,324 మంది మరణించారు. 90,830 మంది గాయపడ్డారు. గత 24 గంటల్లో ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో 66 మంది మృతి చెందారు. 241 మంది గాయపడ్డారు. అక్టోబ రు 7న హమాస్ నేతృత్వంలోని దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,139 మంది మరణించడం, అది యుద్ధానికి దారితీయడం తెలిసిందే.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment