
ప్రతీకాత్మక చిత్రం
యాంగూన్/న్యూఢిల్లీ: మయన్మార్‌లో సైనిక పాలన భారత్‌పై ప్రభావం చూపుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గద్దె దించి ఫిబ్రవరిలో సైన్యం అధికారం హస్తగతం చేసుకున్నప్పటి నుంచి అక్కడి నిర్బంధాలకు భయపడి ప్రజలు భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. తాజాగా, 116 మంది సరిహద్దుల్లో భారత బలగాల గస్తీ ఎక్కువగా కనిపించని తియు నదిని దాటి మిజోరంలోకి ప్రవేశించారు. సరిహద్దులకు సమీపంలోని ఫర్కాన్ గ్రామంలో వీరంతా తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది మయన్మార్ పోలీసు, అగ్ని మాపక సిబ్బంది అని సమాచారం. మానవతాసాయం కోరుతూ వచ్చే వారినే అనుమతించాలంటూ సరిహద్దుల్లోని మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలను కేంద్రం ఇటీవల కోరింది. భారత్–బర్మాలకు సుమారు 1,643 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. మయన్మార్‌లో అల్లకల్లోల పరిస్థితులతో వలస వచ్చిన వేలాది మంది భారత్‌లో తలదాచుకుంటున్నారు.
కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి
ప్రజలు సాగిస్తున్న పోరాటాన్ని మయన్మార్ సైనిక పాలకులు కఠినంగా అణచివేస్తున్నారు. ఆదివారం నిరసనకారులపై సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక మహిళ సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. యాంగూన్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతోపాటు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు.సైనిక పాలనను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టిన వారిపై సైన్యం జరిపిన కాల్పుల్లోదేశ వ్యాప్తంగా శనివారం కూడా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని మీడియా పేర్కొంది. ఆస్పత్రులను కూడా సైన్యం స్వాధీనం చేసుకోవడంతో వైద్యులు సేవలను నిరాకరిస్తున్నారు. సైన్యం పగ్గాలు చేపట్టాక ఇప్పటి వరకు కనీసం 70 మంది ప్రజలు కాల్పుల్లో మరణించినట్లు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సంఖ్య 90 వరకు ఉంటుందని అనధికార వర్గాల సమాచారం.
చదవండి: సారా ఎవెరార్డ్ హత్య ప్రకంపనలు