వాషింగ్టన్: నాసా అంటే అదెక్కడో అంతరిక్షంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అమెరికాలోనే ఉంది. అయితే అమెరికానే నాసాలో ఉన్నంతగా ప్రసిద్ధి చెందింది 63 ఏళ్ల వయసు కలిగిన ఈ ‘నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్’ (నాసా) సంస్థ. యూఎస్ వారి స్పేస్ ఏజెన్సీనే నాసా. పాలనకు వైట్ హౌస్ ఎలాగో అంతరిక్ష పరిశోధనలకు నాసా అలాగ. అంతటి నాసాకు ఇప్పుడు భారత సంతతి మహిళ భవ్యాలాల్ ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’గా అపాయింట్ అయ్యారు. పెద్ద విషయమే. వాడుకగా చెప్పాలంటే... మహిళావనికి భవ్య నియామకం ఒక ‘విశ్వ’ విజయం. ‘ఆ.. చీఫ్ ఆఫ్ స్టాఫ్ పోస్ట్ ఏముందీ’ అని ఎవరైనా నోరు చప్పరించవచ్చు! నాసా స్టాఫ్ అంతా సైంటిస్టులు, ఖగోళ శాస్త్ర నిపుణులు, ఇంకా ప్రత్యేకమైన ప్రతిభా ప్రావీణ్యాలు కలిగిన వారు. అక్కడి చిన్న ఉద్యోగికైనా పెద్ద చదువే ఉండి ఉంటుంది. వాళ్లందరి చీఫ్ ఇప్పుడు భవ్య. ప్రమోషన్ పై వచ్చారు. ఆమె కొత్త డిజిగ్నేషన్‌ను సరిగ్గా చెప్పాలంటే ‘యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్’! నాసా సిబ్బంది వ్యవహారాలలో ఇకపై కీలకమైన నిర్ణయాలన్నీ ఆమెవే.
ఈ హోదాతోపాటు భవ్యకు ఇంకొక ముఖ్యమైన బాధ్యతను కూడా అదనంగా అప్పగించింది బైడన్ ప్రభుత్వం. అవును. ప్రభుత్వమే. నాసా అమెరికన్ ఏజెన్సీ కనుక అందులోని ముఖ్యమైన నియామకాలన్నీ స్వయంగా అమెరికా అధ్యక్షుడే చూస్తారు. సరే, భవ్య అదనంగా చూడవలసింది.. నాసా ‘బడ్జెట్ అండ్ ఫైనాన్స్’ విభాగానికి సలహాలు ఇవ్వడం.. ‘సీనియర్ అడ్వైజర్’ పోస్ట్! చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా, సీనియర్ అడ్వైజర్‌గా రెండు బాధ్యతల్ని ఆమె నిర్వహించగలరన్న నమ్మకంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది.
((చదవండి: నాసాకు తొలి మహిళా చీఫ్?))
ఇంజినీరింగ్, స్పేస్ టెక్నాలజీలో భవ్యకు ఉన్న అనుభవం ముందు ఆమె వయసు ఎంతైనా అది చిన్నబోతుంది. వాషింగ్టన్‌లోని ప్రతిష్టాత్మక ఎస్టీపీఐ (సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఇన్‌స్టిట్యూట్)లో 2005 నుంచి 2020 వరకు పరిశోధనలు చేశారు భవ్య. ఎస్టీపీఐ నాసాతో సమన్వయమై పని చేస్తుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్, ఇంటెలిజెన్స్ కమ్యూనిటికీ ఎప్పటికప్పుడు అవసరమైన సాంకేతికను వృద్ధి చేయడంలోనూ ఆమె ఏనాడో సీనియర్ స్థాయికి చేరుకున్నారు. భవ్య న్యూక్లియర్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. టెక్నాలజీ అండ్ పాలసీలో ఇంకో మాస్టర్ డిగ్రీ! జార్జి వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టరేట్ చే శారు. ఎస్టీపీఐలో చేరక ముందు ఎస్టీపీఎస్ అనే మరొక టెక్నాలజీ సంస్థలో ప్రత్యేక విభాగానికి ప్రెసిడెంట్‌గా, అంతకన్నా ముందు ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ స్టడీస్’ కి (మాసచుసెట్స్‌లోని కేంబ్రిడ్జి ప్రాంతంలో ఉంటుంది) డైరెక్టర్‌గా ఉన్నారు. ఇవన్నీ చెప్పకుంటూ వెళితే భవ్య ఒక చదువుకున్న రోబో అనిపిస్తారు. ఈ మాట నెగటివ్‌గా అంటున్నది కాదు. ఇలాంటి టెక్నికల్ విషయాలే ఆమె ప్రొఫైల్ నిండా మనకు కనిపించేవి. ఖగోళ పరిజ్ఞానం ఉన్న విధాన నిర్ణేత.. భవ్య.
స్పేస్ సైన్స్ పాలసీ మేకర్!
నాసాలో ఉండేవాళ్ల వ్యక్తిగత వివరాలేవీ భూగోళం మీద కనిపించనంత గోప్యంగా ఉంటాయి. భవ్య కూడా అంతే. ఒక నాసా తార. అంతమాత్రమే లోకానికి. ఈమె గురించి మనం ఒక పది విషయాలను అదనంగా తెలుసుకోగలిగినా అవి ఆమె వ్యక్తిగతమైనవి కాక, వృత్తి పరమైనవి మాత్రమే అయి ఉంటాయి. అంతరిక్ష శాస్త్రం, ఉపగ్రహాలు, అంతరిక్ష అణుశక్తి, ఖోగోళ శోధన ఆమెకు కలలోనైనా ఇష్టమైన అంశాలు. ఆ అంశాలలో తన అధ్యయన, పరిశోధనల సారాంశాన్ని తరచు ఆమె ది ఎకనమిస్ట్, నేషనల్ జియోగ్రఫిక్, స్పేస్ వంటి ప్రఖ్యాత పత్రికలకు వ్యాసాలుగా రాస్తుంటారు. ఇంటర్నేషనల్ ఆకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాట్స్‌లో ఆమెకు సభ్యత్వాన్ని సంపాదించి పెట్టింది ఆమె శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలే.
Comments
Please login to add a commentAdd a comment