Joe Biden, NASA: కాలపు తొలి క్షణాల్లోకి తొంగిచూసిన వేళ...  | James Webb Space Telescope: Joe Biden, NASA share first full colour images of distant galaxies | Sakshi
Sakshi News home page

Joe Biden, NASA: కాలపు తొలి క్షణాల్లోకి తొంగిచూసిన వేళ... 

Published Wed, Jul 13 2022 2:56 AM | Last Updated on Wed, Jul 13 2022 10:11 AM

James Webb Space Telescope: Joe Biden, NASA share first full colour images of distant galaxies - Sakshi

కరీనా నెబ్యులాలో కనువిందు చేస్తున్న విశ్వ శిఖరాలు

వాషింగ్టన్‌:  కళ్లు మిరుమిట్లు గొలుపుతున్న ఈ దృశ్యాలు ఎప్పటివో తెలుసా? ఈ అనంత విశ్వం దాదాపుగా పొత్తిళ్ల పాపాయిగా ఉన్నప్పటివి! ఖగోళ శాస్త్రవేత్తల అంచనాలే గనుక నిజమయ్యే పక్షంలో ఏకంగా ఈ విశ్వం పురుడు పోసుకున్నప్పటివి!! ఇంతటి అద్భుతమైన ఈ దృశ్యాలను నాసాకు చెందిన అత్యాధునిక జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ మన కళ్ల ముందుంచింది. ఇందుకోసం కాలంతో పాటు దూరంలోనూ ఏకంగా 1,300 కోట్ల సంవత్సరాలు వెనక్కు వెళ్లి, అత్యంత సుదూర గతంలోకి తొంగి చూసి మరీ ఈ అద్భుతమైన ఫొటోలను క్లిక్‌మనిపించింది. లెక్కలేనన్ని తారలు, తారా సమూహాలు, అత్యంత సుదూరాల్లో నింపాదిగా, భారంగా పలు ఆకృతుల్లో ఊపిరి పోసుకుంటున్న భారీ, అతి భారీ పాలపుంతలు తదితరాలతో నమ్మశక్యం కానంత రమణీయంగా సాగిన విశ్వరూప విన్యాసాన్ని కళ్లకు కట్టింది. అంతరిక్షంలో అటు కాలంలోనూ, ఇటు దూరంలోనూ ఇంతటి గతంలోకి దృష్టి సారించడం మానవ చరిత్రలో ఇదే తొలిసారి. విశ్వావిర్భావానికి కారణంగా విశ్వసిస్తున్న బిగ్‌బ్యాంగ్‌ (మహావిస్ఫోటం) 1,380 కోట్ల ఏళ్ల క్రితం జరిగిందని చెబుతుంటారు. 


వెలుగుజిలుగుల మధ్య నక్షత్ర మండలాల సమూహం

విశ్వాంతరాళానికి సంబంధించి నాసా సరికొత్త జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ క్లిక్‌మనిపించిన తొలి ఫొటోలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా వైట్‌హౌస్‌లో విడుదల చేశారు. ఇవి ఏకంగా 1,300 కోట్ల ఏళ్ల నాటి విశ్వాన్ని కళ్లకు కడుతున్నాయన్నది నమ్మశక్యం కాని వాస్తవమంటూ ఈ సందర్భంగా కాసేపు అబ్బురపాటుకు లోనయ్యారు. మానవాళి శాస్త్ర సాంకేతికతలో ఇది చరిత్రాత్మక క్షణమన్నారు. ఆయనే కాదు, అంతరిక్ష పరిశోధనల్లో తలపండిన నాసా శాస్త్రవేత్తలే ఈ ఫొటోలను చూసిన తొలి క్షణాల్లో చెప్పలేనంత భావోద్వేగానికి లోనయ్యారట. దీన్ని ప్రస్తుతానికి స్మాక్స్‌ 0723గా పిలుస్తున్నారు.


శక్తి నశించి క్రమంగా అంతర్ధానమవుతున్న నెబ్యులా తాలూకు భిన్న దశలు 

వీటిలో తెలుపు, పసుపు, ఎరుపు తదితర రంగుల్లో కనువిందు చేస్తున్న అపార తారా సమూహపు భారీ విన్యాస పరంపర నిజానికి అనంత విశ్వానికి సంబంధించిన అతి చిన్న భాగం మాత్రమేనని నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ అన్నారు. దీనికి కొనసాగింపుగా జేమ్స్‌ వెబ్‌ తీసిన మరో నాలుగు ఆసక్తికరమైన ఫొటోలను నేడు విడుదల చేయనున్నట్టు నాటో ప్రకటించింది. మన సౌరవ్యవస్థకు కొద్దిగా ఆవల ఉన్న ఓ భారీ వాయుగ్రహం, పుడుతూ, గిడుతూన్న నక్షత్రాలతో కూడిన అతి మనోహరమైన నెబ్యులాలు, ఒకదాని చుట్టూ ఒకటి నాట్యం చేస్తున్నట్టుగా కన్పిస్తున్న ఐదు నక్షత్ర మండలాలు తదితరాలు వాటిలో ఉన్నాయట. ఇంతకూ జేమ్స్‌ వెబ్‌ తీసిన తొలి ఫొటోలోని విశ్వం వయసు ఎంత అయ్యుండొచ్చు? అంతరిక్ష పరిశోధకులు కొన్నాళ్ల పాటు రకరకాల లెక్కలతో కుస్తీ పడితే గానీ ఇది తేలదట! జేమ్స్‌ వెబ్‌ త్వరలోనే విశ్వంలో ఇంతకంటే ఇంకా లోలోతులకు దృష్టి సారించి ఫొటోలు తీస్తుందని నాసా చెబుతోంది.       

జేమ్స్‌... హబుల్‌ వారసుడు 
జేమ్స్‌ వెబ్‌ ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత శక్తిమంతమైన స్పేస్‌ టెలిస్కోప్‌. దీన్ని వయసు మళ్లిన హబుల్‌ టెలిస్కోప్‌కు వారసునిగా 10 బిలియన్‌ డాలర్ల భారీ ఖర్చుతో నాసా నిర్మించింది. ఇందుకు ఏకంగా 30 ఏళ్లు పట్టింది. 2021 డిసెంబర్‌లో దీన్ని అంతరిక్షంలోకి పంపింది. తర్వాత సుదీర్ఘ ప్రక్రియ ద్వారా దాని అద్దాలు, పరారుణ డిటెక్టర్లు తదితరాలను సరైన కోణాల్లో బిగించి సిద్ధం చేశారు. దీని చల్లదనాన్ని నిరంతరం పరిరక్షించేందుకు దానిపైన టెన్నిస్‌ కోర్టు సైజులో సన్‌షేడ్‌ ఏర్పాటు చేశారు. దీని సాయంతో మన సౌరకుటుంబంతో పాటు విశ్వంలోని సుదూరాలకు, విశ్వం పుట్టినప్పటి కాలంలోకి దృష్టి సారించి అనేకానేక రహస్యాలను శోధించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement