ప్రపంచంలోని ప్రతి వ్యక్తి తన ఆలోచనలను ఇతరులకు తెలియజేయాలన్నా.. ఇతరులు చెప్పేవి అర్థం చేసుకోవాలన్నా ‘భాష’ ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా 6,500కు పైగా భాషలు వాడుకలో ఉండగా.. అందులో 840 భాషలు పపువా న్యూ గినియా అనే చిన్న దేశంలో వాడుకలో ఉన్నట్లు వెల్లడయ్యింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక భాషలు వాడుకలో ఉన్న దేశంగా పపువా న్యూ గినియా రికార్డులకెక్కింది.
ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల మధ్యలో 4,62,840 కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ దేశ జనాభా 94 లక్షలే. కానీ ఇప్పటికీ అక్కడి ప్రజలు 840 భాషల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఇంగ్లిష్ అధికార భాష కాగా.. హిరిమోటు, పీఎన్‌జీ సింగ్, టోక్ పిసిన్ తదితర భాషలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక ఇండోనేసియా 710 భాషలతో రెండో స్థానంలో నిలిచింది. నైజీరియా 524 భాషలతో మూడో స్థానంలో, భారత్ 453 భాషలతో 4వ స్థానంలో నిలిచాయి. ఇక, 337 భాషలతో అమెరికా ఐదో స్థానంలో, 317 భాషలతో ఆస్ట్రేలియా ఆరో స్థానం ఉండగా, 307 భాషలతో చైనా ఏడో స్థానంలో కొనసాగుతోంది.
ఉత్తర కొరియా ప్రజలు.. కొరియన్ తప్ప ఇతర భాషలను ఉపయోగించరు.ఆ తర్వాత వాటికన్ సిటీలో రెండు, ఐస్‌ల్యాండ్‌లో రెండు, దక్షిణ కొరియాలో 5 భాషలే వాడకలో ఉన్నాయి. అలాగే అత్యధిక దేశాల్లో ఇంగ్లిష్ భాషను ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. 67 దేశాల్లో ఇంగ్లిష్, 29 దేశాల్లో ఫ్రెంచ్, 27 దేశాల్లో అరబిక్, 21 దేశాల్లో స్పానిష్, 10 దేశాల్లో పోర్చుగీస్, ఆరు దేశాల్లో జర్మన్, నాలుగు దేశాల్లో రష్యన్ భాష వాడుకలో ఉంది.
ఇది కూడా చదవండి: హలో.. ఆస్ట్రోనాట్..!
Comments
Please login to add a commentAdd a comment