సౌదీ స్మార్ట్‌ సిటీ ‘నియోమ్‌’ ప్రపంచాన్ని ఎందుకు ఆకర్షిస్తోంది? | NEOM: Saudi Arabia's New Mega Smart City Project | Sakshi
Sakshi News home page

Saudi Smart City Project: సౌదీ మెగా స్మార్ట్‌ సిటీ ‘నియోమ్‌’ ప్రత్యేకతలేమిటి?

Published Mon, Oct 16 2023 10:21 AM | Last Updated on Mon, Oct 16 2023 10:29 AM

Neom Saudi Arabias Mega Smart City Project - Sakshi

ఆధునిక నిర్మాణాలకు సౌదీ అరేబియా పెట్టిందిపేరు. ప్రపంచంలోని ఏ పెద్ద కట్టడానికి సంబంధించిన ప్రస్తావన వచ్చినా ముందుగా సౌదీ అరేబియా పేరే వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం సౌదీ అరేబియా భారీ స్మార్ట్‌ సిటీ నిర్మాణంలో తలమునకలై ఉంది. ఇది ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలవనుంది. 

నియోమ్‌.. ఇది అనేది వాయువ్య సౌదీ అరేబియాలోని టబుక్ ప్రావిన్స్‌లో నిర్మాణంలో ఉన్న అద్భుత స్మార్ట్ సిటీ. ఈ ప్రదేశం ఎర్ర సముద్రానికి ఉత్తరంగా, ఈజిప్టుకు తూర్పున అకాబా గల్ఫ్‌ సమీపంలో, జోర్డాన్‌కు దక్షిణంగా ఉంది. 500 బిలియన్ అమెరికన్‌ డాలర్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ భవిష్యత్ నగరం సంపూర్ణంగా ‘స్వచ్ఛమైన శక్తి’తో మనుగడ సాగించనుంది. ఈ అధునాతన సిటీలో కార్లు ఉండవు. రోడ్లు కూడా ఉండవు. జీరో కార్బన్ ఉద్గారాలతో స్మార్ట్‌ సిటీ కాలుష్య రహితంగా ఉండనుంది. కాగా ఈ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనలో 20 శాతం పనులు పూర్తయ్యాయని నియోమ్‌ సీఈఓ నద్మీ అల్ నాస్ర్ మీడియాకు తెలిపారు. మానవాళి ఎదుర్కొంటున్న అనేక కీలక సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నామన్నారు.

నియోమ్ అనేది గ్రీకు పదం. నియో అంటే కొత్తది. ఎం అనేదానిని అరబిక్ పదం ముస్తాక్బాల్ నుంచి తీసుకున్నారు. దీని అర్థం భవిష్యత్తు. నియోమ్‌ అనే పదాన్ని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పేరు నుంచి కూడా తీసుకున్నారని చెబుతారు. ఎర్ర సముద్ర తీరంలో 26,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మెగాసిటీ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నట్లు 2017 అక్టోబరులో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్‌) ప్రకటించారు. రియాద్‌లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ కాన్ఫరెన్స్‌లో ఎంబీఎస్‌ ఈ ప్రకటన చేశారు. ఇది సౌదీ అరేబియా- 2030 విజన్‌లలో ఒకటి. దీనిని సౌదీ ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి చేసే లక్ష్యంలో నిర్మిస్తున్నారు. 

నియోమ్‌ అనేది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నిర్మాణాలకు భిన్నంగా స్వతంత్రంగా పనిచేస్తుందని, దానికంటూ సొంత పన్ను, కార్మిక చట్టాలు, ‘స్వయంప్రతిపత్త న్యాయ వ్యవస్థ’ ఉంటుందని ఎంబీఎస్‌ తెలిపారు. నియోమ్‌లో పోర్ట్‌లు, ఎంటర్‌ప్రైజ్ జోన్‌లు, పరిశోధనా కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, క్రీడా కేంద్రాలు, వినోద వేదికలు ఉంటాయని ఎంబీఎస్‌ తెలిపారు.

నియోమ్‌ పునరుత్పాదక ఇంధన వనరుల నుండి వంద శాతం శక్తిని అందుకుంటుంది. సూర్యరశ్మి, గాలి, హైడ్రోజన్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని మాత్రమే నియోమ్‌ వినియోగిస్తుంది. ఫలితంగా ఈ సిటీలో కర్బన ఉద్గారాల విడుదల ప్రస్తావనే ఉండదు. ఈ నగరానికున్న మరొక ప్రత్యేకత ఏమిటంటే కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలతో కూడిన నీటిని సముద్రంలోకి తరలించరు. దానిని తిరిగి పారిశ్రామిక ముడి పదార్థంగా వినియోగిస్తారు. 

వ్యవసాయం విషయంలో కూడా నియోమ్‌ ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలవనుంది.  గ్రీన్‌హౌస్‌ల ఏర్పాటుతో ప్రపంచంలోనే ఆహార స్వయం సమృద్ధిగల నగరాన్ని సృష్టించనున్నారు. సౌదీ అరేబియా ప్రస్తుతం 80 శాతం మేరకు ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్నది. 
ఇది కూడా చదవండి: అమెరికా అంతరిక్ష ‍ప్రయోగాలలో హిట్లర్‌ సన్నిహితుడు? 1969లో ఏం జరిగింది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement