వినూత్న ఆలోచనలతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొని భారతీయులు అమెరికాలో సత్తా చాటుతున్నారు. యూనికార్న్ స్టార్టప్స్ స్థాపించడంలో ప్రవాస భారతీయులు మొదటి స్థానంలో నిలిచారు. 2022 వరకు అమెరికాలో 582 యూనికార్న్ స్టార్టప్స్ ఏర్పాటు కాగా, అందులో 66 ప్రవాస భారతీయులు ఏర్పాటు చేశారు. అమెరికాలో మొత్తం యూనికార్న్ స్టార్టప్స్‌లో ఇండియా, ఇజ్రాయెల్‌కు చెందిన ప్రవాసులు స్థాపించిన కంపెనీలు 20 శాతం ఉన్నాయి.
సాక్షి, అమరావతి: ‘ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’.. ఇదే కోవలో వినూత్న ఆలోచనలతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొని భారతీయులు అమెరికాలో సత్తా చాటుతున్నారు. భారతీయ విజయపతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తున్నారు. యూనికార్న్ స్టార్టప్స్ స్థాపించడంలో అమెరికాలోని భారతీయులు మొదటి స్థానంలో నిలిచారు.
2022 వరకు యూఎస్‌లో 582 యూనికార్న్ స్టార్టప్స్ ఏర్పాటు కాగా, అందులో 319 స్టార్టప్స్ విదేశీయులు/విదేశీ మూలాలున్న వ్యక్తులు స్థాపించినవే. వీటిలో 66 యూనికార్న్ స్టార్టప్స్‌ను ప్రవాస భారతీయులు ఏర్పాటు చేయడం విశేషం. వీరిలో ఎక్కువ మంది ఉన్నత చదువుల కోసం యూఎస్‌కు వెళ్లిన వారే కావడం గమనార్హం. అలాగే కొంత మంది బాల్యంలోనే తల్లిదండ్రులతో కలిసి యూఎస్‌కు వచ్చిన వారూ ఉన్నారు. ఈ వివరాలను నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్‌ఎఫ్‌ఏపీ) తాజాగా వెల్లడించింది.
బిలియన్ డాలర్ల కంపెనీలుగా..
ఒక స్టార్టప్ కంపెనీ విలువ ఒక బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.8 వేల కోట్లు మించి) దాటితే దాన్ని ‘యూనికార్న్ స్టార్టప్’గా వ్యవహరిస్తారు. ప్రవాస భారతీయులు స్థాపించిన యూనికార్న్ స్టార్టప్స్‌లో భారీగా ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చాయి. సరాసరి ఒక్కో కంపెనీ 859 ఉద్యోగాలు సృష్టించినట్లు ఎన్‌ఎఫ్‌ఏపీ అధ్యయనంలో తేలింది. అమెరికాలో నంబర్ 1 గ్రోసరీ డెలివరీ కంపెనీగా ఉన్న ‘ఇన్‌స్టాకార్ట్’ను అపూర్వ మెహతా ఏర్పాటు చేశారు. ఆయన తల్లిదండ్రులు అపూర్వ చిన్నతనంలోనే అమెరికా వెళ్లారు. అక్కడే చదువుకున్న ఆయన తర్వాత విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు.
31 శాతం ఇండియా, ఇజ్రాయెల్ నుంచే..
కాగా అమెరికాలో మొత్తం యూనికార్న్ స్టార్టప్స్‌లో ఇండియా, ఇజ్రాయెల్‌కు చెందిన ప్రవాసులు స్థాపించిన కంపెనీలు 20 శాతం ఉన్నాయి. ఒక్కో యూనికార్న్ స్టార్టప్‌కి ఒకరి కంటే ఎక్కువ మంది వ్యవస్థాపకులు ఉన్నారు. వీరిలో ఇండియా, ఇజ్రాయెల్‌కు చెందిన ప్రవాసులు 31 శాతం మంది ఉండటం విశేషం. అలాగే దాదాపు సగం మంది ఇండియా, ఇజ్రాయెల్, యూకే, కెనడా, చైనా దేశాల నుంచే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment