లండన్: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని తిరిగి దేశానికి తీసుకువచ్చే విషయంలో భారత్‌కు నిర్ణయాత్మక విజయం లభించింది. మోదీని పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కేసులో భారత్‌లోని కోర్టులో విచారించాల్సిన అవసరం ఉందని బ్రిటన్‌లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ జడ్జి శామ్యూల్ గూజీ గురువారం తీర్పునిచ్చారు. భారత్‌లోని కోర్టులో తనకు న్యాయమైన విచారణ జరగదన్న నీరవ్ మోదీ వాదనను తోసిపుచ్చారు. భారత్‌లో నిష్పక్షపాత విచారణ జరగదన్న వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను సుమారు 200 కోట్ల డాలర్ల(రూ. 14.5 వేల కోట్లు) మేరకు మోసం చేసిన ఆరోపణలపై, నగదు అక్రమ చెలామణి ఆరోపణలపై మోదీపై భారత్‌లో సీబీఐ, ఈడీ పలు కేసులు నమోదు చేసి, విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. నీరవ్ మోదీ వాదిస్తున్నట్లు ఈ కేసులో ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘన కూడా లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. వైద్యపరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భారత ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేశారు. వాండ్స్‌వర్త్ జైలు నుంచి నీరవ్ మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. ‘పీఎన్‌బీ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ పేర్కొన్న నగదు అక్రమ చెలామణి, సాక్ష్యులను బెదిరించడం, సాక్ష్యాధారాలను నాశనం చేయడం వంటి ఆరోపణలకు సంబంధించి నీరవ్ దీపక్ మోదీని దోషిగా నిర్ధారించేందుకు అవసరమైన సాక్ష్యాధారాలున్నాయ’ని ఈ సందర్భంగా జడ్జి శ్యామ్యూల్ గూజీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ చీఫ్ విజయ్ మాల్యా కేసును న్యాయమూర్తి ఉదహరించారు. దీర్ఘకాలం జైలులో ఉండడంతో నీరవ్ మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదన్న విషయాన్ని అంగీకరిస్తూనే.. అది భారత్‌కు ఆయనను అప్పగించేందుకు అడ్డంకిగా భావించడం లేదని జడ్జి స్పష్టం చేశారు. ఈ కేసులో 16 బండిళ్ల సాక్ష్యాధారాలను, మరో 16 బండిళ్ల నిపుణుల నివేదికలను భారత ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, వాటిని పరిగణనలోకి తీసుకున్నానన్నారు. అయితే, భారత అధికారులు వాటి డాక్యుమెంటేషన్‌ను సరిగ్గా చేయలేదని వ్యాఖ్యానించారు. యూకేలోని నేరస్తుల అప్పగింత చట్టం–2003 ప్రకారం .. తన తీర్పు కాపీని న్యాయమూర్తి హోం మినిస్టర్ ప్రీతి పటేల్ పరిశీలనకు పంపిస్తారు. అనంతరం, రెండు నెలల లోపు భారత్, యూకేల మధ్యనున్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం, ఆమె నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే విషయమై నిర్ణయం తీసుకుంటారు. సాధారణంగా కోర్టు తీర్పు మేరకే మంత్రి నిర్ణయం ఉంటుంది. అయితే, నీరవ్ మోదీకి హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు అనంతరం రెండు వారాల్లోగా ఆయన హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది.
నీరవ్‌పై కేసు ఎప్పుడు, ఎలా..?
జనవరి 29, 2018: నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులు కలిసి 2.81 బిలియన్ రూపాయల మోసానికి పాల్పడ్డారంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నీరవ్ మోదీపై ఫిర్యాదు చేసింది.
ఫిబ్రవరి 5, 2018: ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.
ఫిబ్రవరి 16, 2018: నీరవ్ మోదీ ఇంటి నుంచి రూ.56,74 బిలియన్ల విలువైన డైమండ్లు, బంగారం, నగలను ఈడీ స్వాధీనం చేసుకుంది.
ఫిబ్రవరి 17, 2018: సీబీఐ ఈ కుంభకోణంలో తొలి అరెస్టులు చేసింది. ఇద్దరు పీఎన్‌బీ ఉద్యోగులు, నీరవ్ మోదీ గ్రూప్‌కి చెందిన ఓ ఎగ్జిక్యూటివ్‌ని సీబీఐ అరెస్టు చేసింది.
ఫిబ్రవరి 17, 2018: ఈకుంభకోణంలో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల పాస్‌పోర్టులను నాలుగు వారాల పాటు ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఫిబ్రవరి 21, 2018: నీరవ్ మోదీ సీఎఫ్‌ఓ, మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను సీబీఐ అరెస్టు చేసింది. నీరవ్ ఫాంహౌస్‌ని కూడా సీల్ చేసింది.
ఫిబ్రవరి 22, 2018: నీరవ్‌కి సంబంధించిన
9 ఖరీదైన కార్లను ఈడీ సీజ్ చేసింది.
ఫిబ్రవరి 27, 2018: నీరవ్‌కి మెజిస్ట్రేట్ కోర్టు బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది.
ఆగస్టు 3, 2018: నీరవ్‌ను అప్పగించాల్సిందిగా యూకే అధికారులకు భారత్ అభ్యర్థన
డిసెంబర్ 27, 2018: నీరవ్ తమ దేశంలో ఉన్నట్టు భారత్‌కి తెలిపిన యూకే.
మార్చి 9, 2019: బ్రిటిష్ పత్రిక ‘ద టెలిగ్రాఫ్’ లండన్ వీధుల్లో నీరవ్ ఉన్నట్లు ధృవీకరించింది.
మార్చి 18, 2019: భారత్ కోరిన మేరకు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు నీరవ్ అరెస్టు వారెంట్.
మార్చి 20, 2019: లండన్‌లో నీరవ్‌ని అరెస్టు చేసి, వెస్ట్‌మినిస్టర్ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు నీరవ్ కి బెయిలు నిరాకరించింది.
మార్చి 20, 2019: నీరవ్‌ని మార్చి 29 వరకు హర్ మెజెస్టీస్ ప్రిసన్(హెచ్‌ఎంపి)కి పంపారు.
ఏప్రిల్9: 2వసారి నీరవ్ బెయిల్ తిరస్కరణ.
మే 8, 2019: మూడోసారి నీరవ్ బెయిల్ తిరస్కరణ. తిరిగి యూకే జైల్లోనే నీరవ్.
జూన్ 12, 2019: నీరవ్ పారిపోయే ప్రమాదం ఉందని నాలుగోసారి కోర్టు బెయిలు నిరాకరణ.
ఆగస్టు 22, 2019: నీరవ్ రిమాండ్ సెప్టెంబర్ 19 వరకు పొడిగించిన యూకే కోర్టు.
నవంబర్ 6, 2019: నీరవ్ కొత్త బెయిలు పిటిషన్‌ను తిరస్కరించిన యూకే కోర్టు.
మే 11, 2020: పీఎన్‌బీ కేసులో నీరవ్‌పై యూకేలో ప్రారంభమైన ఐదు రోజుల విచారణ.
మే 13: మనీలాండరింగ్ కేసులో నీరవ్‌కి వ్యతిరేకంగా భారత్ మరిన్ని ఆధారాలు సమర్పణ.
డిసెంబర్ 1, 2020: నీరవ్ రిమాండ్ పొడిగింపు.
జనవరి 8, 2021: ఫిబ్రవరి 25, 2021న నీరవ్ అప్పగింత కేసులో తీర్పు ప్రకటించాలని నిర్ణయించిన యూకే కోర్టు.
Comments
Please login to add a commentAdd a comment