పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దాదాపు రూ. 14,000 కోట్ల మేర కుచ్చు టోపీ పెట్టి హఠాత్తుగా 2018 ఫిబ్రవరిలో మాయమై చివరకు ఆ మరుసటి ఏడాది లండన్‌లో పట్టుబడిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించవచ్చంటూ బ్రిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు కీలక మైనది. భారత్‌కు పంపితే తన మానవ హక్కులు హరించుకుపోతాయని నీరవ్ చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. తనను నిర్బంధించే జైలు సౌకర్యవంతంగా వుండదన్న వాదనను కూడా కొట్టిపారేసింది. బ్యాంకు సిబ్బంది తోడ్పాటుతో మోసపూరితంగా లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్(ఎల్‌ఓయూ)లను అపహరించి, వాటి ఆధారంగా భారీ మొత్తంలో డబ్బు కైంకర్యం చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తుండగా... ఆ నిధులు సరిహద్దులు దాటిన వైనాన్ని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరా తీస్తోంది. సాక్ష్యాధారాలు మాయం చేయటం, సాక్షుల్ని బెదిరించటం, వేధించి ఒకరి మరణానికి కారకుడు కావటం వంటి ఆరోపణలు కూడా ఆయనగారిపై వున్నాయి.
కేవలం బ్యాంకు సొమ్ము కొట్టేయాలన్న ఏకైక ఉద్దేశంతో వ్యాపారం పేరు చెప్పి నీరవ్ మోదీ ఏడేళ్ల వ్యవధిలో వేల కోట్లు కొట్టేశారు. అయినా సులభంగా దేశం విడిచి పారిపోగలిగాడు. అతనికి రెండేళ్ల ముందు మరో ఎగవేతదారు విజయ్ మాల్యా సైతం ఈ మాదిరే పరారయ్యాడు. మాల్యాను దేశం తీసుకు రావటానికి చేసిన ప్రయత్నాలు ఇంకా కొలిక్కిరాలేదు. రకరకాల సాకులు చెబుతూ, ఏవేవో అభ్యంతరాలు లేవనెత్తుతూ మాల్యా అక్కడే కాలక్షేపం చేస్తున్నాడు. నీరవ్ మోదీ ఎప్పటికి వస్తాడన్నది ఎవరూ చెప్పలేరు. అయితే మాల్యా బెయిల్ తీసుకోగా, ప్రస్తుతానికైతే నీరవ్ మోదీ జైల్లో వున్నాడు. ఆయన బెయిల్ పిటిషన్‌లను న్యాయస్థానం ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూనే వుంది.
మన బ్యాంకుల చేతగానితనానికి, వాటిలో ఉన్నత స్థాయిలో పనిచేసేవారి చేతివాటుతనానికి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ తదితరులు నిదర్శనం. ఒక సాధారణ వ్యక్తి రుణం తీసుకోవటానికి ప్రయత్నిస్తే సవాలక్ష య„ý ప్రశ్నలేసే బ్యాంకులు ఇలాంటి మోసగాళ్లముందు ఎంత సులభంగా మోకరిల్లుతాయో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2011లో నీరవ్ మోసపూరిత పనులకు పాల్పడటం మొదలుపెడితే 2018 వరకూ... అంటే ఏడేళ్లపాటు అవి యధేచ్ఛగా సాగిపోయాయి. రికార్డుల్లో ఎక్కడా చూపకుండా నీరవ్ మోదీ, ఆయన సంబంధీకులు ఎల్‌వోయూలను ఉపయోగించుకుని విదేశీ ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. తమ ఖాతాదారు చెల్లించాల్సిన మొత్తానికి పూచీపడుతూ బ్యాంకులు ఈ ఎల్‌ఓయూలు జారీ చేస్తాయి. వీటి ఆధారంగానే విదేశాల్లోని బ్యాంకులు రుణాలిస్తాయి.
అలా ఇచ్చేముందు ఎల్‌ఓయూ జారీ చేసిన బ్యాంకును సంప్రదిస్తాయి. ఇవన్నీ ‘సజావుగానే’ పూర్తయ్యాయి! వేల కోట్లు నీరవ్ మోదీ చేతుల్లో వాలిపోయాయి. ఈ మొత్తం వ్యవహారమంతా మన బ్యాంకింగ్ వ్యవస్థ డొల్లతనాన్ని బయటపెట్టింది. పకడ్బందీ తనిఖీ వ్యవస్థ అనుకున్నది సైతం ఏడేళ్లపాటు అక్కరకు రాకుండా పోయిందంటే...ఏటా జరిగితీరాల్సిన అంతర్గత ఆడిటింగ్‌లో కూడా ఇది దొరకలేదంటే ఏమను కోవాలి? ఈ లావాదేవీలు ఎక్కడా నమోదు కాకుండా నీరవ్ చూడగలిగాడు. అందుకే మొదట్లో బ్యాంకుకు రూ. 11,300 కోట్ల మేర నష్టం జరిగిందని లెక్కేయగా...తవ్వినకొద్దీ అది పెరగటం మొదలెట్టింది. నీరవ్ మోసాన్ని యధేచ్ఛగా సాగనీయటమే కాదు...‘మోసం బట్టబయలైంద’ని ఆ బ్యాంకులో కీలక బాధ్యతల్లో వున్నవారు ఉప్పందించారు. ఇది జరిగాకైనా బ్యాంకులు అప్రమత్తంగా వున్నాయా అంటే లేదనే చెప్పాలి.
ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు 2019–20 సంవత్సరంలో విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే బ్యాంకింగ్ మోసాలు రెండున్నర రెట్లు పెరిగాయి. నీరవ్ మోసం వెల్లడైన 2018–19లో ఈ మాదిరి మోసాల పరిమాణం మొత్తంగా రూ. 71,500 కోట్లు కాగా...2019–20లో అది రూ. 1.85 లక్షల కోట్లకు చేరుకుంది. మరి నీరవ్ కేసు బ్యాంకుల్ని ఏం అప్రమత్తం చేసినట్టు? మోసాలను నివారించటం సంగతలా వుంచి...వాటిని వెనువెంటనే గుర్తించటంలో, మాయగాళ్లను చట్టానికి పట్టివ్వటంలో బ్యాంకులు బాగా వెనకబడి వున్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
నీరవ్ మోదీ ఇక్కడ కూడబెట్టిన ఆస్తుల్ని బ్యాంకులు స్వాధీనం చేసుకోగలిగాయి. కానీ ఈ కొట్టేసిన డబ్బంతా పెట్టి అంతకు అనేక రెట్లు విలువచేసే విలాసవంతమైన భవంతుల్ని, ఇతర ఆస్తుల్ని లండన్, న్యూయార్క్‌వంటి చోట్ల అతను కొనుగోలు చేశాడు. అతని ఆచూకీ రాబట్టడంలో మన నిఘా విభాగాలు విఫలమైనా, బ్రిటన్ దినపత్రిక ‘డైలీ టెలిగ్రాఫ్’ పాత్రికేయులు ముగ్గురు నీరవ్‌ను గుర్తించి బయటపెట్టారు. ఇప్పుడు బ్రిటన్ కోర్టులో నీరవ్ వాదన వీగిపోయేలా చూడ టంలో మన న్యాయవాదులు విజయం సాధించటం సంతోషించదగ్గదే.
అయితే ఇదింకా అయి పోలేదు. నీరవ్ వినతిపై బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ నిర్ణయం తీసుకోవాలి. అందుకామెకు గరిష్టంగా రెండు నెలల సమయం పట్టొచ్చు. ఆమె నిర్ణయం తనకు ఆమోదయోగ్యం కానట్టయితే ఆ తర్వాత మరో 14 రోజుల్లో నీరవ్ హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలి. అక్కడ విచారణ ఎన్నాళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇదంతా సాధ్యమైనంత త్వరగా పరిష్కారమై, నీరవ్‌ను ఇక్కడికి తీసుకొచ్చి విచారించి శిక్షించగలిగితే ఈ తరహా మోసగాళ్లకు అదొక గుణపాఠమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment