లండన్: దేశీ బ్యాంకులకు రుణాలు ఎగవేసిన వ్యాపారవేత్తలు సురక్షితంగా తలదాచుకునేందుకు లండన్‌ను ఎంచుకుంటున్నారు. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాభరణాల వ్యాపారవేత్త నీరవ్ మోదీ కూడా లండన్‌కి చేరినట్లు తెలియవచ్చింది. భారత్‌లో రాజకీయ వేధింపులుంటాయన్న కారణంగా అక్కడ ఆశ్రయం పొందేందుకు మోదీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
‘నీరవ్ మోదీ లండన్‌లో ఉన్నారని, భారత్‌లో రాజకీయపరమైన వేధింపులను కారణంగా చూపి ఆశ్రయం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని భారత్, బ్రిటన్‌లోని అధికారులు చెబుతున్నారు. లండన్‌లో ఆయనకు ఒక వజ్రాభరణాల స్టోర్ కూడా ఉంది‘ అని ఫైనాన్షియల్ టైమ్స్ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. మరోవైపు, వ్యక్తిగత కేసులపై తాము స్పందించబోమని బ్రిటన్ హోం శాఖ స్పష్టంచేసింది.
భారత్, బ్రిటన్ మధ్య ఈ తరహా సంక్లిష్టమైన కేసులు అనేకం ఉన్నప్పటికీ, వీటి పరిష్కారానికి చట్టపరమైన ప్రక్రియ పాటించక తప్పదని రెండు దేశాలకూ తెలుసని, రెండూ దీన్ని దృష్టిలో పెట్టుకునే వ్యవహరిస్తాయని బ్రిటన్ విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. దేశంలోని వివిధ బ్యాంకుల నుంచి రూ.9,000 కోట్ల రుణాలు తీసుకుని, ఎగవేసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటరు విజయ్ మాల్యా కూడా ప్రస్తుతం లండన్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. ఆయన్ను వెనక్కి రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆర్‌సీఎన్ కోసం సీబీఐ కసరత్తు: దేశం విడిచి పారిపోయిన మోదీపై రెడ్ కార్నర్ నోటీసు (ఆర్‌సీఎన్) జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను కోరినట్లు సీబీఐ వర్గాలు సోమవారం తెలియజేశాయి. కొందరు బ్యాంకు ఉద్యోగులతో కుమ్మక్కై నీరవ్ మోదీ, ఆయన మామ మెహుల్ చోక్సీలు.. పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు రూ.13,000 కోట్ల మేర మోసం చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కేసు నమోదవడానికి ముందే ఈ ఏడాది జనవరిలో మోదీ, చోక్సీ దేశం విడిచి పారిపోయారు.
నీరవ్ మోదీ చివరిసారిగా స్విట్జర్లాండ్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో కనిపించారు. ప్రధాని నరేంద్ర మోదీతో కార్పొరేట్ దిగ్గజాలు కలసి దిగిన ఫొటోలో ఆయన కూడా ఉన్నారు. ఆ తర్వాత వారం రోజులకు ఈ స్కామ్‌లో సీబీఐ కేసు నమోదు చేసింది. నీరవ్ మోదీ సోదరుడు నిషాల్, ఆయన భార్య అమీ పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. నిషాల్‌కు బెల్జియంలో, అమీకి అమెరికాలో పౌరసత్వం ఉంది. వీరిద్దరు కూడా జనవరి తొలి వారంలోనే దేశం విడిచి వెళ్లిపోయారు.
12 వేల పేజీల చార్జిషీటు..
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ముంబై కోర్టులో గత నెల రెండు చార్జి షీట్లు దాఖలు చేసింది. మోదీ, అతని అనుచరులతో పాటు కొందరు బ్యాంకు అధికారులపై అటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా చార్జి షీటు వేసింది. మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద ముంబైలోని స్పెషల్ కోర్టులో 12,000 పేజీలతో చార్జి షీటు దాఖలైంది.
మోదీ, మాల్యా అప్పగింతపై పూర్తి సహకారం: బ్రిటన్
నీరవ్ మోదీ తమ దేశంలోనే ఉన్నారని బ్రిటన్ అధికారులు ధృవీకరించినట్లు భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విజయ్ మాల్యా, మోదీతో పాటు మోసం, రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరులను కూడా భారత్‌కు అప్పగించే విషయంలో పూర్తి సహకారం అందిస్తామని బ్రిటన్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఆ వర్గాలు చెప్పాయి. భారత హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజుతో భేటీ అయిన సందర్భంగా బ్రిటన్ మంత్రి విలియమ్స్ ఈ మేరకు హామీ ఇచ్చారు.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌కి ఆశ్రయమివ్వడం ద్వారా అలాంటివారికి బ్రిటన్ స్వర్గధామమన్న అపప్రద రాకుండా చూసుకోవాలని భేటీలో కిరణ్ రిజిజు సూచించినట్లు కేంద్ర హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘బ్రిటన్ మంత్రి విలియమ్స్‌తో భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు కలిసికట్టుగా చేస్తున్న ప్రయత్నాల గురించి చర్చించాం.
నిందితుల అప్పగింత, సమాచార మార్పిడి వంటి విషయాల్లో పరస్పరం సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చాం‘ అని గంటపైగా సాగిన సమావేశం అనంతరం కిరణ్ రిజిజు తెలిపారు. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, జైళ్లలో పరిస్థితులు మొదలైన వాటి గురించి బ్రిటన్ వర్గాల్లో ఉన్న ఆందోళనను తొలగించేందుకు అధికార బృందం ప్రయత్నించినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి.
Comments
Please login to add a commentAdd a comment