ఊహించని రీతిలో ఉక్రెయిన్ యుద్ధానికి విరామం ప్రకటించి.. పౌరుల తరలింపునకు సహకరిస్తోంది రష్యా సైన్యం. ఈ క్రమంలో భారత్ పౌరులను సురక్షితంగా పంపించేందుకు సహకరిస్తామని ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం. అయితే చావు ఎటు నుంచి ముంచుకొస్తుందో అనే భయంతో భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీనికి తోడు ఇబ్బందులు కొన్ని.. తరలింపు ప్రక్రియకు అడ్డం పడుతున్నాయి.
ఉక్రెయిన్ తూర్పు భాగంలో సుమీ స్టేట్ యూనివర్సిటీలో వందలమంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. గురువారం రాత్రి ఈ ప్రాంతంలో రష్యన్ బలగాల దాడులతో భీత వాతావరణం నెలకొంది. విద్యార్థులంతా చెల్లాచెదురై రెండో ప్రపంచ యుద్ధ బంకర్‌లో దాక్కుండిపోయారు. తిండి, తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. సాయం కోసం భారత ఎంబసీని ఆశ్రయిస్తున్నా.. ఫలితం లేకుండా పోతోంది అక్కడ!.
రష్యా సరిహద్దుకు కేవలం 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సుమీ ప్రాంతం. అందుకే యుద్ధం మొదలైన మొదటి రోజు నుంచే ఈ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. యుద్ధ సంకేతాలు ముందుగానే తెలియడంతో కొంతమంది నీళ్లు, ఆహారం ముందుగా తెచ్చి పెట్టుకున్నారు. కానీ, క్రమక్రమంగా కొరత మొదలైంది. దీనికి తోడు రష్యా దాడుల్లో వాటర్ పైప్ లైన్లు, పవర్ సిస్టమ్ దెబ్బతిని.. నీళ్లు, కరెంట్ లేక అసలు కష్టాలు మొదలయ్యాయి.
సుమీలో యుద్ధ భయానికి దాక్కున్న చాలామందికి తిండి, నీళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో శుక్రవారం ఉన్నట్లుండి మంచు కురియడంతో విద్యార్థుల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. మంచును కరిగించి ఆ నీటితోనే బాటిళ్లను నింపేసుకుంటున్నారు.
Students in Sumy, north east of Ukraine, have started filling bottles with snow to melt and drink. On Thursday night, water station was bombarded by Russian forces cutting all water supplies, said Anuj, student in Sumy State University, who shot the video @scroll_in pic.twitter.com/NYys6PBHVl
— Tabassum (@tabassum_b) March 4, 2022
దారుల్లేక..
యుద్ధం నిలిచిపోయి.. పౌరులను వెళ్లిపోవాలంటూ రష్యా బలగాలు ప్రకటించడం కొంత ఊరట ఇచ్చేదే. కానీ, సుమీలో చిక్కుకుపోయిన విద్యార్థులకు మాత్రం సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక్కడ రైలు మార్గం ఒక్కటే పెద్ద దారి. కానీ, రష్యా దాడులతో రైల్వే ట్రాక్స్ దారుణంగా దెబ్బ తిన్నాయి. గగన తలం ఆల్రెడీ మూసుకుపోయింది. మరోవైపు రోడ్ల మీద రష్యన్ చెక్‌పాయింట్లు ఎక్కడికక్కడే వెలిశాయి. ఒకదగ్గర కానున్నా.. మరో దగ్గర ముప్పు మీద పడిపోతుందేమోనని విద్యార్థులు హడలి పోతున్నారు.
సన్నగిల్లుతున్న ఆశలు!
ఖార్కీవ్, సుమీలో కలిపి మొత్తం వెయ్యి మంది భారతీయ విద్యార్థులు ఉన్నారనేది ఒక అంచనా. మార్చి 2వ తేదీ వరకు సుమీకి 180కి.మీ.ల దూరంలోని ఖార్కీవ్‌లో విద్యార్థుల పరిస్థితి భయానకంగానే ఉండింది. అయితే కర్ణాటక విద్యార్థి నవీన్ మరణంతో.. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. భారత ఎంబసీ జోక్యంతో భారతీయ విద్యార్థులు సురక్షిత మార్గాల్లో సరిహద్దులకు సురక్షితంగా చేరారు. దీంతో సురక్షితంగా తామూ బయటపడతామని సుమీ విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, దారులన్నీ మూసుకుపోవడంతో భయాందోళనకు లోనవుతున్నారు.
ఈ పదిరోజుల్లో కొందరు విద్యార్థులు రిస్క్ చేశారు. ఒకవైపు రష్యా సరిహద్దు, మరోవైపు బెలారస్ సరిహద్దు. అందుకే సుమీకి 170 కిలోమీటర్ల దూరంలోని పోల్తావా వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో తుపాకులతో బెదిరించి మరీ సైన్యాలు వాళ్లను వెనక్కి పంపించాయి. ఇంటి నుంచి ఫోన్‌కాల్ వచ్చినప్పుడల్లా.. ఇదే తమ ఆఖరి ఫోన్‌కాల్ అనుకుంటున్న విద్యార్థులు ఎందరో. వాళ్లందరినీ సురక్షితంగా ఇంటికి చేరుస్తామని భారత ఎంబసీ ధైర్యం చెబుతోంది. జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి తప్పటడుగు వేయకండని, ధైర్యంగా ఉండాలని చెప్తూ వాళ్లను తరలించే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. విద్యార్థులంతా సురక్షితంగా తిరిగి రావాలని తల్లిదండ్రులతో పాటు అంతా కోరుకుంటున్నారు.
Exploring all possible mechanisms to evacuate 🇮🇳n citizens in Sumy, safely & securely.
— India in Ukraine (@IndiainUkraine) March 4, 2022
Discussed evacuation & identification of exit routes with all interlocuters including Red Cross.
Control room will continue to be active until all our citizens are evacuated.
Be Safe Be Strong
Comments
Please login to add a commentAdd a comment