సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లారంటూ దక్షిణ కొరియా అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ విషయాన్ని తమ దేశానికి చెందిన గూఢచర్య వర్గాలు వెల్లడించాయని గతంలో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే-జంగ్‌కు సహాయకుడిగా పని చేసిన చాంగ్ సాంగ్ మిన్ చెప్పారు. కిమ్ కోమాలో ఉండటంతో ఉత్తర కొరియాలో ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలను ఆయన సోదరి కిమ్ యో జోంగ్ చూస్తున్నారని ఆయన వెల్లడించారు. (చదవండి : సోదరికి సగం అధికారాలు? )
ఉత్తర కొరియా అధ్యక్షుడికి ఉన్న కొన్ని అధికారాలను కిమ్ తన సోదరి కిమ్ యో జోంగ్కు కట్టబెట్టారని మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. విదేశీ వ్యవహారాలతో పాటుగా ఆర్థిక, సైనిక రంగంలోనూ జోంగ్‌కు కొన్ని అధికారాలను కట్టబెట్టినట్టుగా దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో చాంగ్ సాంగ్ మిన్ మాట్లాడుతూ..‘కిమ్ కోమాలో ఉన్నట్టు నేను అంచనా వేస్తున్నాను. కానీ అతను మరణించలేదు’ అని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది కిమ్ బయట కనిపించింది చాలా తక్కువని.. ఆయన ఆరోగ్యం క్షిణించిందని చాంగ్ తెలిపారు. ప్రస్తుతం ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందకు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ సిద్దంగా ఉన్నారని చాంగ్ అన్నారు.
కాగా, గతంలో కూడా కిమ్ ఆరోగ్యంపై ఎన్నో పుకార్లు చక్కర్లు కొట్టాయి. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించిందని, ప్రాణాలతో పోరాడుతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఆయనకు బ్రెయిన్ డెడ్ అయిందని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు అతడు కోమాలో ఉన్నాడని నేరుగా పక్క దేశానికి చెందిన అధికారి చెబుతున్నాడంటే, అతడికి నిజంగా ఏదైనా ఆపద పొంచి ఉందా లేకా ప్రపంచ దేశాలను మరోసారి ఉత్తర కొరియా అధ్యక్షుడు తప్పు దారిలో పయనించేలా చేస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment