Kim Yo Jong
-
అమెరికా, దక్షిణ కొరియాకు కిమ్ సోదరి మాస్ వార్నింగ్
ఉత్తర కొరియా ఈ పేరు వినగానే ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గుర్తుకు వస్తారు. కిమ్ అంటే నియంత పరిపాలన.. ఆయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనం. తాజాగా ఆయన సోదరి కూడా తన అన్నకు తక్కువేమీ కాదని నిరూపించుకున్నారు. తన అన్న బాటలోనే, తాజాగా అగ్రరాజ్యం అమెరికా, దక్షిణ కొరియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే.. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త యుద్ధ విన్యాసాలను ఉత్తర కొరియా తీవ్రంగా తప్పు పట్టింది. తమపై దాడికొస్తే గట్టి ప్రతిచర్యలుంటాయని దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి, దేశంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ కిమ్ యో జోంగ్ హెచ్చరించారు. అమెరికా, దక్షిణ కొరియా కొన్ని నెలలుగా చేస్తున్న విన్యాసాలను మాపై యుద్ధంగానే భావిస్తాం. వారి ప్రతీ అడుగునూ క్షణక్షణం గమనిస్తూనే ఉంటాం. మాకు న్యాయంగా అనిపించే ఏ చర్యనైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె వార్నింగ్ ఇచ్చారు. తమను తక్కువ అంచనా వేయొద్దని, పసిఫిక్ మహాసముద్రంలోకి పెద్ద సంఖ్యలో క్షిపణులను ప్రయోగించగలమని సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. ఇదిలా ఉండగా.. హ్వాసాంగ్ 17 పేరుతో ప్రయోగించిన ఐసీఎంబీ విజయవంతం కావడంతో కిమ్ జోంగ్ ఉన్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఏ దేశంపైన అయినా సైనిక చర్యకు దిగేలా ప్రేరేపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ దేశమైనా తమను ప్రశ్నించినా, బెదిరింపులకు దిగినా అణ్వాయుధాలతోనే సమాధానం ఇస్తామంటూ అప్పట్లోనే తేల్చి చెప్పారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కిమ్ హెచ్చరించారు. -
అదే జరిగితే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం
కొరియా దేశాల మధ్య ఆయుధ సంపత్తి-సత్తా విషయంలో మాటల తుటాలు పేలుతున్నాయి. వాస్తవానికి యుద్ధానికి తాము వ్యతిరేకమని, ఒకవేళ దక్షిణ కొరియా గనుక దాడులకు తెగపడితే మాత్రం అణ్వాయుధాలు ప్రయోగించడానికి సైతం వెనకాడబోమని హెచ్చరించారు కిమ్ యో జోంగ్. ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి అయిన కిమ్ యో జోంగ్.. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దక్షిణ కొరియా రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అత్యాధునిక క్షిపణులు, అణ్వాయుధాలు తమ వద్ద ఉన్నాయని, అవి నేరుగా లక్ష్యంగా భావిస్తున్న ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తాయంటూ దక్షిణ కొరియా రక్షణ మంత్రి షూ వుక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో కిమ్ యో తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను భారీ తప్పిదంగా పేర్కొన్న కిమ్ యో.. అలాంటి పరిస్థితి ఎదురైతే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే అణ్వాయుధాల్ని దక్షిణ కొరియాపై ప్రయోగిస్తామని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్యాంగ్యాంగ్(నార్త్ కొరియా రాజధాని) యుద్ధానికి వ్యతిరేకం. అలాగే దక్షిణ కొరియాను మేం ప్రధాన శత్రువుగా భావించడం లేదు. మమ్మల్ని కవ్వించనంత వరకు మేం మౌనంగానే ఉంటాం. ఒకవేళ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడితే మాత్రం.. సహించం. సౌత్‌కొరియా ఆర్మీ ఇంచు సరిహద్దులోకి వచ్చినా పెనువినాశనాన్ని దక్షిణ కొరియా చవిచూడాల్సి వస్తుంది’’ అని మంగళవారం నాటి ప్రకటనలో ఆమె వెల్లడించారు. ఇది మేం జారీ చేసే హెచ్చరిక కాదు. జరగబోయే పరిణామాలకు మా ముందస్తు వివరణ అని స్పష్టం చేశారామె. ఇదిలా ఉండగా.. ఆదివారం సైతం ఆమె ఈ వ్యాఖ్యలపై స్పందించారు కూడా. ప్రమాదకరమైన సైనిక చర్యలకు సైతం సిద్ధమంటూ కిమ్ యో జోంగ్ వ్యాఖ్యానించారు కూడా. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మొదటి నుంచి క్షిపణులను విజయవంతంగా ప్రయోగిస్తూ అగ్రరాజ్యం సహా పొరుగు దేశాలు దక్షిణ కొరియా, జపాన్‌లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది ఉత్తర కొరియా. -
ఉత్తర కొరియా: కిమ్ వర్సెస్ కిమ్!
దేశంలో ఓవైపు కరోనా, మరోవైపు ఆకలి కేకలు, ఇంకోవైపు వ్యక్తిగత అనారోగ్యం .. ఈ కారణాలు నార్త్ కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను బాధ్యతల నుంచి వైదొలిగేలా చేయబోతున్నాయా?. క్షిపణి పరీక్షలు, సామూహిక పరేడ్‌లతో దర్పం ప్రదర్శిస్తున్న కిమ్.. తన తర్వాతి నాయకత్వ బాధ్యతల విషయంలో మాత్రం కీలక సమాలోచనలు జరుపుతున్నాడా?.. ఉత్తర కొరియా, దాయాది దక్షిణ కొరియా ప్రధాన పత్రికల కథనాలు ‘అవుననే’ ఊహాగానాలకు తెరలేపుతున్నాయి ఇప్పుడు. గత కొంతకాలం కిమ్ జోంగ్ ఉన్(38).. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అయితే అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేస్తూ వస్తున్న నార్త్ కొరియా ప్రభుత్వం.. కిమ్ కీలక చర్చల్లో పాల్గొంటున్న ఫొటోలు, వీడియో ఫుటేజీలను స్థానిక మీడియా ఛానెళ్ల ద్వారా బయటి ప్రపంచానికి విడుదల చేస్తూ వస్తోంది. అయినప్పటికీ సన్నబడిన కిమ్ రూపం ఆధారంగా ఆయన అనారోగ్యం నిజమేనన్న అనుమానాలు వ్యక్తం చేస్తోంది దక్షిణ కొరియా. కిమ్ గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు చెబుతోంది. ఈ పరిణామాలతోనే నాయకత్వ మార్పు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడని, ఈ తరుణంలో నార్త్ కొరియాలో రాజకీయ కల్లోలం చెలరేగుతోందని ఇప్పుడు వరుస కథనాలు ప్రచురిస్తోంది. కిమ్ చెల్లికి కీలక పదవి! కిమ్ యో జోంగ్.. కిమ్ జోంగ్ ఉన్‌కు స్వయానా సోదరి. మొన్నటిదాకా కిమ్‌కు ప్రధాన సలహాదారుగా ఉందీమె. అయితే ఇప్పుడు ఆమెను నార్త్ కొరియా స్టేట్ ఎఫైర్స్ కమిషన్‌లో కీలక పదవి దక్కించుకుంది. కేసీఎన్ఏ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. కమిషన్‌లో ఇంతకు ముందున్న తొమ్మిది మంది సభ్యుల్ని అర్థాంతరంగా తొలగించింది నార్త్ కొరియా స్టేట్ అసెంబ్లీ. ఇందులో పాక్ పోంగ్ జు, అమెరికాతో గతంలో దౌత్యం కోసం ప్రయత్నించిన చోయి సన్ హుయి కూడా ఉన్నారు. ఇక గురువారం ఎనిమిది మందితో కూడిన లిస్ట్ ప్రకటించగా.. అందులో యంగ్ అండ్ ఓన్లీ ఉమెన్‌గా చోటు సంపాదించుకుంది కిమ్ యో జోంగ్. ఈమె నియామకానికి సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ సైతం ఆమోద ముద్ర వేసింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, దక్షిణ కొరియా మూన్ జాయ్ ఇన్‌తో కిమ్ జోంగ్ భేటీ అయినప్పుడు కిమ్ యో ఇంటర్నేషనల్ మీడియా ఛానెల్స్‌లో హైలెట్ అయ్యింది. ఆటైంలోనే ఆమె అన్న తర్వాతి వారసురాలంటూ కథనాలు వెలువడ్డాయి. ఆ వెంటనే పార్టీ సెంట్రల్ కమిటీకి వైస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్‌గా ఆమెను నియమించడంతో దాదాపుగా ఈ అనుమానాల్ని నిజమని భావించారంతా. అయితే అనూహ్యంగా ఆమెను ఆ పదవి నుంచి తొలగించిన కిమ్, ఆ పదవిని అలాగే ఖాళీగా ఉంచేశాడు. దీంతో ఆమె సైడ్ అయ్యిందని అంతా అనుకున్నారు. తాజాగా 34 ఏళ్ల కిమ్ యో జోంగ్కు స్టేట్ ఎఫైర్స్ లాంటి కీలక విభాగంలో.. అదీ సినియర్ పోస్ట్ కట్టబెట్టడంతో ప్రెసిడెంట్ రేసులో నిలిచినట్లయ్యింది. కిమ్ మాత్రం అతనికే.. అయితే కిమ్ జోంగ్ఉన్ మాత్రం నాయకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే దానిపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని దక్షిణ కొరియాకు చెందిన ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఒక ఎడిటోరియల్‌ను ప్రచురించింది. అంతేకాదు సోదరి కిమ్ యో జోంగ్కు బాధ్యతలు అప్పగించే విషయంలో సుముఖంగా లేడని పేర్కొంది. అందుకు కారణం లేకపోలేదు. ఈ జూన్‌లో ‘వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా’ పొలిట్‌బ్యూరో సభ్యుల ఎంపిక నిబంధనలను కఠినతరం చేసింది. ఇందులో వారసత్వ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అంతేకాదు పార్టీ వైస్ ప్రెసిడెంట్ థాయ్ హ్యోంగ్ చోల్‌ను తర్వాతి అధ్యక్షుడిగా పేర్కొంటూ ఓ కథనం సైతం ప్రచురించింది. కిమ్‌కు నమ్మినబంటుగా, రాజకీయ సలహాదారుడిగా ఉన్న హ్యోంగ్ చోల్‌ను.. తర్వాతి అధ్యక్షుడిగా ఎంపిక చేసే ప్రయత్నాలు కిమ్ చేస్తున్నాడని, ఈ మేరకు సెప్టెంబర్ మొదటివారంలో పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించినట్లు సౌత్ కొరియాకు చెందిన ది స్ఫై న్యూస్ ఏజెన్సీ కథనం ప్రచురించింది. మరోవైపు అడిటింగ్ కమిషనర్ యూ సంగ్ చోల్ పేరు తర్వాత ప్రెసిడెంట్ రేసులో ఉన్నట్లు మరో పత్రిక కథనం వెలువరించింది. కిమ్ యో జోంగ్ గ్రూప్ రాజకీయాలకు తెర లేపుతోందని.. అందుకు చెక్ పెట్టేందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్రయత్నిస్తున్నాడని, ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వైరం మొదలైందన్నది మరో కథన సారాంశం. అయితే దక్షిణ కొరియా కథనాల సంగతి పక్కనపెడితే.. వారసత్వ రాజకీయాల వ్యతిరేక నిబంధనను ఉల్లంఘిస్తూ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ కిమ్ సోదరికి కీలక పదవి కట్టబెట్టిందంటూ నార్త్ కొరియాకే చెందిన కేసీఎన్ఏ న్యూస్ ఏజెన్సీలో కథనం రావడం ఆసక్తికర చర్చకు దారితీసింది. చదవండి: కిమ్ సోదరి అనూహ్య ప్రకటన -
జో బైడెన్‌కు కిమ్ సోదరి స్ట్రాంగ్ వార్నింగ్
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరి, ఆయన కీలక సలహాదారు కిమ్ యో జాంగ్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వార్నింగ్ ఇస్తూ ఓ ప్రకటన వెలువరించింది. కాగా అగ్రరాజ్యం, ఉత్తర కొరియాలు బద్ద శత్రువులని తెలిసిన విషయమే. పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతా శత్రుత్వం ఈ రెండు దేశాలది. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలిచి అధ్యక్ష పదవిని చెప్పట్టి రెండు నెలలు గడిచాయి. ఈ క్రమంలో తొలిసారిగా కిమ్ యో జాంగ్ బైడెన్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ ఓ ప్రకటన జారీ చేసింది. ‘మీరు వచ్చే నాలుగేళ్లు ప్రశాంతంగా నిద్ర పోవాలనుకుంటే మళ్లీ మొదటి నుంచి పని మొదలు పెట్టకండి. దాని వల్ల మీరు నిద్రను కోల్పోతారు’ అంటూ పేర్కొంది. అయితే ఇటీవల నార్త్ కొరియా మిలిటరీ పరేడ్‌లో భాగంగా సబ్ మెరైన్నుతో బాలిస్టిక్ మిస్సైల్‌ను లాంచ్ చేసిన అనంతరం కిమ్ మాట్లాడుతూ.. అమెరికా తమకు ప్రధాన శత్రువు అని ప్రకటించిన సంగతి తెలిసిందే. బైడెన్ అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కిమ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా చైనాకు, అణ్వాయుధ సంపత్తి ఉన్న ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా కూటమి కట్టడం కోసం అమెరికా ఈ కీలక పర్యటనలు చేపడుతోంది. ఇందుకోసం అమెరికాకు చెందిన పెంటగాన్ చీఫ్ లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మిత్ర దేశాలైన జపాన్, దక్షిణ కొరియా దేశాల పర్యటనలను సోమవారం ప్రారంభించిన నేపథ్యంలో కిమ్ యో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే వారికి ఇదే తొలి విదేశీ పర్యటన. అయితే గత వారం సౌత్ కొరియాతో కలిసి అమెరికా సంయుక్త మిలిటరీ కసరత్తులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై నార్త్ కొరియా స్పందిస్తూ.. తమ భూభాగంలో గన్‌పౌడర్ వాసనను విస్తరింపజేయడానికి ప్రయత్నిస్తున్న అమెరికా కొత్త పాలకవర్గానికి ఒక సూచన అంటూ ఈ హెచ్చరికను జారీ చేసింది. చదవండి: అమెరికా మా ప్రధాన శత్రువు: కిమ్ జాంగ్ ఉన్ కిమ్ ఆంక్షలు: ‘బతికిపోయాను ఉత్తర కొరియాలో పుట్టలేదు’ -
నెల రోజులుగా కనిపించని కిమ్ సోదరి?!
ప్యాంగ్యాంగ్: గత కొన్ని నెలలుగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై అనేక రకాల సందేహాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఆయన కోమాలోకి వెళ్లారని, ఏ క్షణమైనా మరణించే అవకాశం ఉందంటూ పలుమార్లు వదంతులు వ్యాపించాయి. దాయాది దక్షిణ కొరియా సైతం కిమ్ అనారోగ్యంపై సందేహాలు వ్యక్తం చేసింది. అంతేగాకుండా కిమ్ వారసురాలి ఎంపిక జరిగిపోయిందని, సోదరి కిమ్ యో జాంగ్‌ను రెండో అధికార కేంద్రంగా ఎదిగేలా ఆయన కీలక చర్యలు తీసుకున్నారని వెల్లడించింది. అందుకు తగ్గట్టుగానే కిమ్ సలహాదారుల్లో ఒకరైన జాంగ్.. ఈ ఏడాది మార్చిలో దక్షిణ కొరియా విధానాలపై విరుచుకుపడుతూ అధికారిక ప్రకటన జారీ చేశారు. తన సోదరుడిని విమర్శించే వారిని సంకర జాతి కుక్కలు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. (చదవండి: కిమ్‌కి ఏమీ కాలేదు) అంతేగాకుండా కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదంటూ దాయాది దేశానికి హెచ్చరికలు జారీ చేసిన ఆమె.. ఉభయ కొరియాల మధ్య చర్చలకు వేదికగా నిలిచిన అనుసంధాన కార్యాలయాన్ని పేల్చివేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇక అగ్రరాజ్యం అమెరికాతోనూ దౌత్య పరమైన వ్యవహారాలకు సంబంధించి జూలైలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా ఉత్తర కొరియాకు కీలకమైన విదేశాంగ విధానాలలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తూ.. అన్నకు తగ్గ చెల్లెలు అనిపించుకున్నారు. కిమ్ తర్వాత నెంబర్ 2గా ఎదిగి తన ఉనికిని చాటుకున్నారు. ఒకానొక సమయంలో అంతర్జాతీయ మీడియాలో కిమ్ కంటే కూడా జాంగ్ పేరే ఎక్కువగా వినిపించే స్థాయికి చేరుకున్నారు. అయితే ఆ పాపులారీటియే ఇప్పుడు ఆమె పట్ల కిమ్ ఆగ్రహానికి కారణమైందని ఉత్తర కొరియా రాజకీయ విశ్లేషకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. (చదవండి: సోదరి ఆదేశాలు.. సైనిక చర్య వద్దన్న కిమ్!) గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తుంటే.. జూలై 27 తర్వాత జరిగిన ఏ ఒక్క బహిరంగ సమావేశానికి జాంగ్ హాజరుకాలేదు. అంతేగాక అధికార వర్కర్స్ పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యురాలైన ఆమె.. తాను పాల్గొనాల్సిన సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. తన కంటే సోదరి జాంగ్కే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుందని భావించిన కిమ్ ఆదేశాలు, ఆగ్రహం కారణంగానే ఆమె ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అభిప్రాయపడ్డారు. అంతేగాక దక్షిణ కొరియాపై సైనిక చర్యకు సిద్ధమంటూ జాంగ్ జారీ చేసిన ఆదేశాలను కిమ్ నిలిపివేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏదేమైనా కిమ్ అనంతరం ఉత్తర కొరియాలో కీలక నేతగా ఎదిగే అవకాశం జాంగ్కే ఉందని, అయితే అదే సమయంలో తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే ఆమెకు కట్టబెట్టిన అధికారాలను కత్తిరించేందుకు కిమ్ ఏమాత్రం వెనకాడబోరని అభిప్రాయపడ్డారు. కాగా 1988లో జన్మించిన జాంగ్ స్విట్జర్లాండ్‌లో విద్యనభ్యసించారు. 2011లో తండ్రి కిమ్ జాంగ్ ఇల్ మరణానంతరం, సోదరుడు కిమ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఆమె కూడా పార్టీలో చేరి అనతికాలంలోనే కీలక నేతగా ఎదిగారు. ఇకకిమ్ ఆరోగ్యంపై వదంతులు వ్యాపించిన ప్రతిసారీ జాంగ్ అన్నీ తానే అయి ముందుండి నడిచిన విషయం తెలిసిందే. అయితే అధికార మీడియా మాత్రం ఎప్పటికప్పుడు కిమ్ పార్టీ సమావేశాల్లో, అధికారిక చర్చల్లో పాల్గొన్నట్లుగా ఉన్న ఫొటోలను విడుదల చేస్తూ ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారన్న సంకేతాలు ఇస్తూ ఉంది. కానీ ఆ ఫొటోలు తాజా చర్చలకు సంబంధించినవా లేదా పాత ఫొటోలా అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
కిమ్ కోమాలో లేడు.. ఇవిగో ఆధారాలు!
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం గురించి సోషల్‌మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కిమ్ ఆరోగ్యం బాగా క్షీణించిందని కొందరు అంటుంటే, మరి కొందరు ఏకంగా కిమ్ మరణించారని ప్రచారం చేస్తున్నారు. ఆ మధ్య కాలంలో ఇలాంటి పుకారులు అధికం అవ్వగా కిమ్ ఒక ఫ్యాక్టరీ ఓపెనింగ్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మరోసారి కిమ్ ఆరోగ్యానికి సంబంధించి చర్చ నడుస్తోంది. కిమ్ కోమాలో ఉన్నారని దక్షిణ కొరియా దౌత్యవేత్త ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆయన ఇలా పేర్కొన కొద్ది రోజుల తరవాత కిమ్ సరికొత్త ఫోటోలను ఉత్తర కొరియా విడుదల చేసింది. దేశ నియంత్రణలో ఉన్న కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కిమ్ నూతన ఫోటోలను ప్రచురించింది. ఈ చిత్రాలలో కిమ్ వర్కర్స్ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశానికి హాజరయినట్లు ఉంది. ఈ సమావేశంలో కరోనా వైరస్, ఒక తుఫాన్‌కు వ్యతిరేకంగా నియంత్రణ చర్యలు చేపట్టాలని కిమ్ పిలుపునిచ్చినట్లు ఆ న్యూస్ ఏజెన్సీ కథనాలు ప్రచురించింది. కిమ్ కోమాలో ఉన్నారని, అతని సోదరి కిమ్ యో-జోంగ్ ఉత్తర కొరియాలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని దక్షిణ కొరియా దివంగత అధ్యక్షుడు కిమ్ డే-జంగ్ మాజీ సహాయకుడు చాంగ్ సాంగ్-మిన్ ఆదివారం ప్రకటించారు. కిమ్ మంచం పట్టారని, దేశాన్ని పాలించలేని స్థితిలో ఉన్నారని చాంగ్ నొక్కి చెప్పారు. తాజాగా ఉత్తర కొరియా విడుదల చేసిన ఫోటోలు నకిలివో, అసలైనవో తేలాల్సి ఉంది. చదవండి: కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్! -
కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్!
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లారంటూ దక్షిణ కొరియా అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ విషయాన్ని తమ దేశానికి చెందిన గూఢచర్య వర్గాలు వెల్లడించాయని గతంలో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే-జంగ్కు సహాయకుడిగా పని చేసిన చాంగ్ సాంగ్ మిన్ చెప్పారు. కిమ్ కోమాలో ఉండటంతో ఉత్తర కొరియాలో ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలను ఆయన సోదరి కిమ్ యో జోంగ్ చూస్తున్నారని ఆయన వెల్లడించారు. (చదవండి : సోదరికి సగం అధికారాలు? ) ఉత్తర కొరియా అధ్యక్షుడికి ఉన్న కొన్ని అధికారాలను కిమ్ తన సోదరి కిమ్ యో జోంగ్కు కట్టబెట్టారని మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. విదేశీ వ్యవహారాలతో పాటుగా ఆర్థిక, సైనిక రంగంలోనూ జోంగ్కు కొన్ని అధికారాలను కట్టబెట్టినట్టుగా దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో చాంగ్ సాంగ్ మిన్ మాట్లాడుతూ..‘కిమ్ కోమాలో ఉన్నట్టు నేను అంచనా వేస్తున్నాను. కానీ అతను మరణించలేదు’ అని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది కిమ్ బయట కనిపించింది చాలా తక్కువని.. ఆయన ఆరోగ్యం క్షిణించిందని చాంగ్ తెలిపారు. ప్రస్తుతం ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందకు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ సిద్దంగా ఉన్నారని చాంగ్ అన్నారు. కాగా, గతంలో కూడా కిమ్ ఆరోగ్యంపై ఎన్నో పుకార్లు చక్కర్లు కొట్టాయి. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించిందని, ప్రాణాలతో పోరాడుతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఆయనకు బ్రెయిన్ డెడ్ అయిందని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు అతడు కోమాలో ఉన్నాడని నేరుగా పక్క దేశానికి చెందిన అధికారి చెబుతున్నాడంటే, అతడికి నిజంగా ఏదైనా ఆపద పొంచి ఉందా లేకా ప్రపంచ దేశాలను మరోసారి ఉత్తర కొరియా అధ్యక్షుడు తప్పు దారిలో పయనించేలా చేస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. -
సోదరికి సగం అధికారాలు?
సియోల్: ఉత్తర కొరియా అ«ధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తన సోదరి కిమ్ యో జాంగ్‌ను రెండో అధికార కేంద్రంగా ఎదిగేలా కీలక చర్యలు తీసుకున్నారు. ఎన్నో అధికారాలను జాంగ్‌కు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారని దక్షిణ కొరియా నిఘా విభాగం వెల్లడించింది. అమెరికా, దక్షిణ కొరియాతో సంబంధాల వ్యవహారాలన్నీ ఇక పై జాంగ్ పర్యవేక్షిస్తారు. కిమ్ నిర్ణయంతో దేశంలోని రెండో శక్తిమంతమైన మహిళగా జాంగ్ ఎదిగారు. విదేశీ వ్యవహారాలతో పాటుగా ఆర్థిక, సైనిక రంగంలోనూ జాంగ్‌కు కొన్ని అధికారాలను కట్టబెట్టినట్టుగా దక్షిణ కొరియా మీడియాలో కథనాలు వస్తున్నాయి. కిమ్ తర్వాత దేశాన్ని నడిపించే రెండో కమాండర్‌గా ఆమె వ్యవహరిస్తున్నారని దక్షిణ కొరియా ఎంపీ హా తాయ్ క్యెంగ్ వెల్లడించారు. అంతర్జాతీయ సంబంధాలలో వైఫల్యాలు ఎదురైతే తన చేతికి మరక అంటకుండా అనారోగ్య కారణాలతో పని భారాన్ని తగ్గించుకోవడానికి కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో కిమ్ మరణించారన్న వదం తులు ప్రచారమైనప్పుడు కూడా జాంగ్కే దేశ పగ్గాలు అప్పగిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సోదరిపై కిమ్‌కు ఎనలేని విశ్వాసం తన నీడను కూడా నమ్మని కిమ్‌కు సోదరి జాంగ్ పట్ల ఎనలేని విశ్వాసం ఉంది. కిమ్ సలహాదారుల్లో ఒకరైన ఆమె ఈ మధ్య కాలంలో ఎక్కువగా కిమ్ పక్కనే కనిపిస్తున్నారు. తొలిసారిగా ఆమె పేరుతో అధికారిక ప్రకటన ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. దక్షిణ కొరియా విధానాలపై విరుచుకుపడుతూ ఆమె ప్రకటన ఇచ్చారు. అమెరికాతో దౌత్య వ్యవహారాలకు సంబంధించి జూలైలో తన వ్యక్తిగత అభిప్రాయాలంటూ ఆమె కొన్ని కామెంట్లు చేశారు. 1988లో జన్మించిన జాంగ్ స్విట్జర్లాండ్‌లో విద్యాభ్యాసం చేశారు. 2011లో తండ్రి కిమ్ జాంగ్ ఇల్ మరణానంతరం సోదరుడు కిమ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఆమె కూడా పార్టీలో చేరారు. నెమ్మది నెమ్మదిగా పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీలో ఎదుగుతూ కిమ్ విశ్వాసాన్ని పొందారు. -
దక్షిణ కొరియాకు కిమ్ సోదరి హెచ్చరిక
సియోల్: తమ దేశానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం సాగించడం ఇకనైనా ఆపకపోతే సైనిక చర్య తప్పదని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ దక్షిణ కొరియాను హెచ్చరించారు. దక్షిణ కొరియాకు చెందిన మానవ హక్కుల సంఘాల కార్యకర్తలు గాలిబుడగల్లో కరపత్రాలు నింపి, ఉ.కొరియా– ద.కొరియా సరిహద్దుల్లో వదులుతున్నారు. ఉత్తర కొరియాలో నియంతృత్వం రాజ్యమేలుతోందని, అక్కడ ప్రజలకు ఎలాంటి హక్కులు లేవని, బానిసల్లా బతుకుతున్నారని ఈ కరపత్రాల్లో రాస్తున్నారు. ఈ చర్యను ఉత్తర కొరియా తీవ్రంగా పరిగణిస్తోంది. ద.కొరియాపై తదుపరి ఎలాంటి చర్య తీసుకోవాలన్న అంశాన్ని తమ సైనికాధికారులకే వదిలేస్తామని చెప్పారు. -
20 రోజుల తర్వాత కనిపించిన కిమ్
ప్యాంగ్యాంగ్ : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ 20రోజుల తర్వాత కనిపించారు. కిమ్ ఆరోగ్యం విషమించిందంటూ గతకొంత కాలంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని సన్‌చిన్‌లో ఎరువుల కర్మాగార నిర్మాణం పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నట్టు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ కార్యక్రమంలో కిమ్‌తోపాటూ అతని సోదరి కిమ్ యో జోంగ్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ 15 నుంచి కిమ్ బయట ప్రపంచానికి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చజరిగింది. ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్ హాజరుకాకపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చింది. -
కిమ్ సోదరికి పార్టీ పదవి!
ఉత్తర కొరియా అగ్రనేత కిమ్ జాంగ్ ఉన్ తన సోదరి కిమ్ యో జాంగ్‌కు పాలక వర్కర్స్ పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించారు. పార్టీ 72వ వార్షికోత్సవం సందర్భంగా కిమ్ తన స్థానం పటిష్టం చేసుకోవడానికి తీసుకున్న చర్యగా ‘యో’ నియామకాన్ని పరిగణిస్తున్నారు. అన్న కిమ్ లాగాగానే 28 ఏళ్ల యో స్విట్జర్లండ్లో చదువుకున్నారు. మాజీ పాలకుడు కిమ్ జాంగ్ ఇల్ మూడో లేదా నాలుగో భార్య సంతానమైన కిమ్, యో తోబుట్టువులు. జుత్తు వెనక్కి దువ్వుకుని, నిత్యం నల్ల సూట్లు ధరించే యోకు నలుపు రంగు హైహీల్డ్ షూస్ అంటే ఇష్టం. ఒకే కుటుంబం నాయకత్వాన నడిచే ఉత్తర కొరియా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నత పదవి పొందిన రెండో మహిళ యో. ఇంతకు ముందు ఆమె మేనత్త అంటే తొలి పాలకుడు, దేశ స్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ కూతురు కిమ్ క్యోంగ్ హుయీ కూడా తన అన్న కిమ్ జాంగ్ ఇల్ హయాంలో కీలక పదవులు నిర్వహిస్తూ అధికారం చెలాయించారు. అయితే, రాజధాని ప్యోంగ్యాంగ్లో నంబర్ టూగా ఒకప్పుడు వెలుగొందిన ఆమె భర్త జాంగ్ సాంగ్ తాయిక్ను దేశద్రోహ నేరంపై ప్రస్తుత పాలకుడు కిమ్ 2013లో కాల్చి చంపించారు. భర్తకు మరణశిక్ష అమలు చేశాక ఆమె గుండెపోటుతో మరణించారనీ లేదు, ఆమె ఆత్మహత్య చేసుకున్నారని కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. మద్యానికి బానిసైన ఆమె బతికే ఉన్నారనీ, చికిత్స పొందుతున్నారని దక్షిణ కొరియా వార్తాసంస్థ యాన్హాప్ ఈ ఏడాదే ప్రకటించింది. ఓ పక్క సవతి అన్న హత్య మరో పక్క చెల్లెలికి పదవి! కిమ్ మారుటి సోదరుడు కిమ్ జాంగ్ నామ్ తమ్ముడికి దూరంగా చైనాలోని మకావ్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతుండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మలేసియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో ఆయనను విషవాయువు ప్రయోగంతో హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ హత్యకేసులో నిందితులైన ఇద్దరు మహిళలు(ఒకరు ఇండొనీసియన్, మరొకరు వియత్నాంకు చెందిన స్త్రీ) మలేసియా కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న సమయంలో కిమ్ తన సోదరిని అలంకారప్రాయంగా పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమించడం విశేషం. కిమ్ జాంగ్ నామ్ హత్యకు కిమ్ కారణమని అమెరికా భావిస్తోంది. స్విస్ చదువయ్యాక ప్యోంగ్యాంగ్లో కంప్యూటర్ సైన్స్ చదవింది! అన్న మాదిరిగా స్విట్జర్లండ్లో యో పాఠశాల విద్య పూర్తి చేసుకుంది. తర్వాత ఆమె రాజధానిలోని కిమ్ ఇల్ సంగ్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ చదివారని తెలుస్తోంది. ఇదే వర్సిటీలో చదివిని ఓ యువకుడిని ఆమె పెళ్లాడారని దక్షిణ కొరియా ఇంటెలిజన్స్ అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ విషయం అధికారికంగా ఎవరూ నిర్ధారించలేదు. ఆమె బయటి ప్రపంచానికి కనిపించడం చాలా అరుదు. అన్నతో కలిసి మాత్రమే ఆమె అనేక సంగీత కచ్చేరీలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొనడం అలవాటు. తెల్ల గుర్రంపై స్వారీచేస్తూ యో ఓ సందర్భంలో కనిపించారు. కిమ్, యోల సొంత అన్న కిమ్ జాంగ్ చోల్ రాజకీయాలకు దూరంగా ప్యోగ్యాంగ్లో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. ఓ మ్యూజిక్ బ్యాండ్‌లో గిటార్ వాయిస్తూ బతికేస్తున్నాడు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
హవ్వ! స్వయంవరం ఇలానా!!
లండన్: ఎప్పుడూ ప్రపంచదేశాలకు తన దూకుడుతో కంగారు పుట్టించే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్ తన చెల్లెలు కిమ్ యో జోంగ్ వివాహానికి స్వయంవరాన్ని ప్రకటించాడు. అయితే అందుకు ఓ విచిత్రమైన షరతు పెట్టాడు. జోంగ్ ని వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తి ఆమెను అతనితో డేటింగ్‌కు ఒప్పించాలి. మరి ఎంతమంది అబ్బాయిలకు ఈ పోటీలో చాన్స్ ఉంటుందని అనుకుంటున్నారా ? కేవలం 30 మంది.. అది కూడా ఉన్ ఎంపిక చేసిన తర్వాతే స్వయంవరానికి అర్హుడవుతాడు. వరుడి ఎంపిక కోసం ఉన్ ఏకంగా ఒక మార్గాన్ని కనిపెట్టేశాడు. వరుడు కచ్చితంగా బ్రహ్మచారి అయి ఉండాలి. దేశ రాజధాని ప్యూయాంగ్ లోని కిమ్-2 సంగ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీని పొంది ఉండాలి. 5 అడుగుల 10 అంగుళాల కనీస ఎత్తు, ఉత్తర కొరియా ఆర్మీలో పనిచేసి ఉండాలి. కానీ ఈ వార్తలు నిజం కావని ఓ కొరియా పత్రిక ప్రచురించిన కథనంలో పేర్కొంది. యో జోంగ్ కు కొరియా పార్టీకి చెందిన ప్రముఖ నేతతో వివాహం జరిపించారనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి.