ప్యాంగ్‌యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరి, ఆయన కీలక సలహాదారు కిమ్ యో జాంగ్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వార్నింగ్ ఇస్తూ ఓ ప్రకటన వెలువరించింది. కాగా అగ్రరాజ్యం, ఉత్తర కొరియాలు బద్ద శత్రువులని తెలిసిన విషయమే. పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతా శత్రుత్వం ఈ రెండు దేశాలది. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలిచి అధ్యక్ష పదవిని చెప్పట్టి రెండు నెలలు గడిచాయి. ఈ క్రమంలో తొలిసారిగా కిమ్ యో జాంగ్ బైడెన్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ ఓ ప్రకటన జారీ చేసింది.
‘మీరు వచ్చే నాలుగేళ్లు ప్రశాంతంగా నిద్ర పోవాలనుకుంటే మళ్లీ మొదటి నుంచి పని మొదలు పెట్టకండి. దాని వల్ల మీరు నిద్రను కోల్పోతారు’ అంటూ పేర్కొంది. అయితే ఇటీవల నార్త్ కొరియా మిలిటరీ పరేడ్‌లో భాగంగా సబ్ మెరైన్‌నుతో బాలిస్టిక్ మిస్సైల్‌ను లాంచ్ చేసిన అనంతరం కిమ్ మాట్లాడుతూ.. అమెరికా తమకు ప్రధాన శత్రువు అని ప్రకటించిన సంగతి తెలిసిందే. బైడెన్ అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కిమ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా చైనాకు, అణ్వాయుధ సంపత్తి ఉన్న ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా కూటమి కట్టడం కోసం అమెరికా ఈ కీలక పర్యటనలు చేపడుతోంది.
ఇందుకోసం అమెరికాకు చెందిన పెంటగాన్ చీఫ్ లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మిత్ర దేశాలైన జపాన్, దక్షిణ కొరియా దేశాల పర్యటనలను సోమవారం ప్రారంభించిన నేపథ్యంలో కిమ్ యో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే వారికి ఇదే తొలి విదేశీ పర్యటన. అయితే గత వారం సౌత్ కొరియాతో కలిసి అమెరికా సంయుక్త మిలిటరీ కసరత్తులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై నార్త్ కొరియా స్పందిస్తూ.. తమ భూభాగంలో గన్‌పౌడర్ వాసనను విస్తరింపజేయడానికి ప్రయత్నిస్తున్న అమెరికా కొత్త పాలకవర్గానికి ఒక సూచన అంటూ ఈ హెచ్చరికను జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment