ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కన్నీరు పెట్టుకున్నారు. అవును.. ఇది నిజం.. దేశంలో గత కొంతకాలంగా జననాల రేటు క్షీణిస్తున్న నేపధ్యంలో రాజధాని ప్యాంగ్యాంగ్‌లో తల్లుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ రోదించారు. వేదికపై కూర్చున్న ఆయన ప్రసంగం ప్రారంభించే సమయంలో దీర్ఘశ్వాస తీసుకున్నారు. ఆ సమయంలో అతని కళ్లు మరింత ఎర్రబారాయి. కన్నీటిని రుమాలుతో తుడుచుకున్నారు.
ఉత్తరకొరియా ప్రభుత్వ టెలివిజన్ ఆ క్షణాన్ని క్యాప్చర్ చేసి, ప్రసారం చేసింది. కిమ్ జోంగ్ ఉన్ ఏడుపుతో పాటు, సభకు హాజరైన తల్లుల రోదనను కలిపి చూపించారు. అత్యంత క్రూరమైన నియంతగా పేరొందిన కిమ్ జోంగ్ కన్నీరు కారుస్తున్న చిత్రాలు అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాయి. అయితే కిమ్ జోంగ్ ఏడుపు అక్కడి ప్రజలను తప్పుదారి పట్టించేందుకే అనే వాదన కూడా ఇప్పుడు వినిపిస్తోంది.
ఉత్తరకొరియా జాతీయ టెలివిజన్‌లో కిమ్ ఏడుపు చూపించడం ఇదేమీ మొదటిసారి కాదని నిపుణులు అంటున్నారు. ఇది నిజమైనదా లేదా మొసలి కన్నీరా అనే అంశంతో సంబంధం లేకుండా.. కిమ్ జోంగ్ మానవత్వం కలిగిన నేత అని చూపించేందుకే అతని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పన్నిన వ్యూహంలో భాగమని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.
ఉత్తరకొరియా సుప్రీం కమాండర్ బహిరంగంగా కన్నీరు పెట్టడమనేది తొలిసారిగా 2011డిసెంబర్‌లో కనిపించింది. కుమ్సుసన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్ సమాధి వద్ద తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్‌ను గుర్తు చేసుకుంటూ కిమ్ కంటనీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో అతని సోదరి కిమ్ యో జోంగ్ కూడా అతని వెనుక ఉన్నారు.
‘రోడాంగ్ సిన్మున్’లో ప్రచురితమైన ఫోటోలో.. తండ్రి అంత్యక్రియల్లో కిమ్ కన్నీటిని నియంత్రించుకున్న దృశ్యం కనిపించింది.
2020, అక్టోబర్‌లో వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 75వ వార్షికోత్సవ కార్యక్రమంలో కిమ్ జోంగ్.. కరోనా మహమ్మారి కష్టాల నుంచి ప్రజలను రక్షించేందుకు తన ప్రయత్నాలు సరిపోలేదని పేర్కొంటూ కిమ్ ప్రసంగ సమయంలో రోదించారు. కాగా సియోల్‌లోని కూక్మిన్ విశ్వవిద్యాలయం పరిశోధకుడు ఫ్యోడర్ టెర్టిస్కీ మీడియాతో మాట్లాడుతూ ఉత్తర కొరియా నేతలు ఏడవడం కొత్త విషయమేమీ కాదని, మాజీ నేతలు కిమ్ జోంగ్ ఇల్, కిమ్ ఇల్ సంగ్ ఇలా ఏడుస్తూ కనిపించారని అన్నారు.
కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు 2022, జూలై 2022లో జరిగిన విక్టరీ డే ఈవెంట్‌లో తన భర్త పక్కన నిలుచుని ఏడుస్తూ కనిపించారు. ఉత్తర కొరియా నేతల తీరును విశ్లేషించిన ఒక నిపుణుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ నేతల ఏడుపులను ఆయా సందర్భాలను అనుసరించి వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చని అన్నారు.
కిమ్ జోంగ్ 2020లో ఒలికించిన కన్నీరు ఉద్దేశపూర్వకంగా లేదా సెంటిమెంటల్ రాజకీయాల కోసం చేసిన చర్యగా లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సవాలుతో కూడిన దేశ పరిస్థితుల మధ్య కిమ్ జోంగ్ ఉన్ ఒంటరితనంతో కుమిలిపోతూ భావోద్వేగానికి లోనై ఉండవచ్చన్నారు. అలాగే తండ్రి మరణించినప్పుడు కిమ్ ఏడుపు.. తండ్రిని కోల్పోయిన బాధలోంచి వచ్చినదన్నారు.
కొరియా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ బాలాజ్ స్జాలోంటాయ్ మాట్లాడుతూ నియంతలు బహిరంగంగా రోదించడం అనేది చాలా అరుదు అని పేర్కొన్నారు. వియత్నాం మాజీ నియంత హో చి మిన్ కూడా దీనికి ఉదాహరణ అన్నారు. తాజాగా కిమ్ జోంగ్ ఏడుపు ప్రజలను తప్పుదారి పట్టించేందుకే అయి ఉండవచ్చన్నారు.
భావోద్వేగ సందర్భాల్లో ప్రజల మందు ఉదాసీనంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే కిమ్ జోంగ్ ఇలా భావోద్వేగంతో కనిపించి ఉండవచ్చని స్జాలోంటాయ్ పేర్కొన్నారు. కిమ్ జోంగ్ ఉన్ ఏడుపు నిజమైనదే అయితే, అతను నిజంగా ప్రజానాయకుడైతే ఉత్తరకొరియాలో నియంతృత్వ పాలన పోయి, ప్రజలు స్వేచ్ఛగా జీవించివుండేవారన్నారు. కిమ్ జోంగ్ ఉన్ కార్చిన కన్నీరు అతని అపరిపక్వతకు చిహ్నమని స్జాలోంటాయ్ విశ్లేషించారు.
ఇది కూడా చదవండి: దక్షిణ కొరియాకు కొత్త భయం
Comments
Please login to add a commentAdd a comment