భూమ్మీద ప్రతి జీవికి ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. కొన్నింటికి ఎక్కువ, కొన్నింటికి తక్కువ. పెద్ద జంతువులు ఏమోగానీ కొన్నిరకాల సాధారణ జీవులు వాటి స్థాయికి మించి తెలివి చూపుతుంటాయి. ఇందులో ఆక్టోపస్‌లు ప్రత్యేకం. అవి కొన్నిసార్లు మనుషుల్లాంటి జ్ఞానాన్ని ప్రదర్శిస్తుంటాయి. మనుషులకు, ఆక్టోపస్‌లకు కామన్‌గా ఉన్న పాయింటే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ వివరాలేమిటో చూద్దామా..
– సాక్షి సెంట్రల్ డెస్క్
ఆ తెలివి ఎక్కడిదనే పరిశోధనతో...
సాధారణంగా జలచరాలతో పోలిస్తే జంతువులకు జ్ఞానం ఎక్కువ. వాటి మెదడు క్లిష్టమైన నిర్మాణంతో, ఎక్కువ సామర్థ్యంతో ఉండటమే దీనికి కారణం. కానీ జలచరాలే అయినా ఆక్టోపస్‌లు చిత్రంగా తెలివిని ప్రదర్శిస్తాయి. మనుషులు, జంతువులను గుర్తించగలడం, అందులో నచ్చినవారిని ఇష్టపడటం, డబ్బాల మూతలను తిప్పితీయడం, కర్రపుల్లలు, ఇతర వస్తువులను పరికరాల్లా వాడగలగడం, గుర్తు పెట్టుకోగలగడం వంటివి చేస్తాయి.
వాటికి ఉన్న ఎనిమిది టెంటకిల్స్‌ను మనం చేతులను వినియోగించినట్టుగా.. సున్నితంగా నత్తగుల్లలను తెరవడానికి, శత్రువులపై వేగంగా దాడి చేయడానికి వాడగలవు. పూర్తిస్థాయిలో ఎదిగిన మెదడు, విస్తృతమైన నాడీ వ్యవస్థనే దీనికి కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. మరి ఒక జలచరం ఇలా ఎదగడానికి కారణమేమిటన్న అన్వేషణలో ఒకనాటి మూలాన్ని గుర్తించారు.
51.8 కోట్ల ఏళ్ల కిందట..
భూమ్మీద జీవం ఆవిర్భవించిన తొలినాళ్లు అవి. సూక్ష్మజీవుల స్థాయిలో మొదలైన జీవం సుదీర్ఘకాలం ప్రాథమిక స్థాయిలోనే.. సముద్రాల్లో వివిధ రకాల పురుగులు, ఇతర రూపాల్లో ఉండేది. అలాంటి ఓ పురుగులాంటి జీవి పేరు ‘ఫసివెర్మిస్ యున్ననికస్’. సముద్రం అడుగున నేలకు అతుక్కుని జీవించేది. ఇది సుమారు 51.8 కోట్ల ఏళ్ల కింద పరిణామ క్రమంలో.. రెండు వేర్వేరు జీవులుగా మారిపోయింది. ఆ రెండింటిలో ఒకటి మనుషులకు ముత్తాత అయితే.. మరొకటి ఆక్టోపస్‌లకు మూలం అని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. నాడీ వ్యవస్థలోని మైక్రో ఆర్‌ఎన్‌ఏలను పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించారు.
‘ఫసివెర్మిస్ యున్ననికస్’ తెలివి నుంచే..
జీవుల జన్యువుల పనితీరును నియంత్రించే మూల పదార్థాలే మైక్రో ఆర్‌ఎన్‌ఏలు. ఇందులో కొన్ని మైక్రో ఆర్‌ఎన్‌ఏలు మెదడు నిర్మాణం తీరు, సామర్థ్యాన్ని నియంత్రిస్తాయి. ఈ మైక్రో ఆర్‌ఎన్‌ఏలు సాధారణంగా జలచరాల్లో తక్కువగా, నేలపై తిరుగాడే జంతువుల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే జలచరాల్లో చాలా వరకు వివిధ రకాల జీవుల నుంచి అభివృద్ధి చెందగా.. మనుషులు, ఆక్టోపస్‌లు రెండు జాతులు కూడా ‘ఫసివెర్మిస్ యున్ననికస్’ నుంచే రూపొందినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ‘ఫసివెర్మిస్ యున్ననికస్’ జీవులు అప్పట్లోనే కాస్త తెలివిని ప్రదర్శించేవని.. శరీరంలో అవసరం లేని భాగాలను స్వయంగా వదులుకుంటూ పరిణామం చెందాయని తేల్చారు. నాటి జీవుల్లో మైక్రో ఆర్‌ఎన్‌ఏలే ఈ సామర్థ్యానికి కారణమని అంటున్నారు.
మైక్రో ఆర్‌ఎన్‌ఏలను నిలుపుకొని..
ఈ అంశంపై పరిశోధన చేసిన జర్మనీలోని బెర్లిన్ మాక్స్ డెల్‌బ్రక్ సెంటర్ శాస్త్రవేత్త నికోలస్ రజేవ్‌స్కీ తాము గుర్తించిన వివరాలను వెల్లడించారు. ఆక్టోపస్‌ల మెదడు, నాడీ వ్యవస్థను పూర్తిస్థాయిలో పరిశీలించి.. వాటిలో కొత్తగా 42 మైక్రోఆర్‌ఎన్‌ఏ రకాలను గుర్తించినట్టు తెలిపారు. మొత్తంగా వీటిలో 90 మైక్రో ఆర్‌ఎన్‌ఏలు ఉన్నట్టు వివరించారు. అదే ఆక్టోపస్‌లకు సమీప జీవులైన ఆయ్‌స్టర్లు, స్క్విడ్‌లు వంటివాటిలో ఐదే మైక్రో ఆర్‌ఎన్‌ఏలు ఉన్నాయని తెలిపారు. ఒకనాటి ‘ఫసివెర్మిస్ యున్ననికస్’ నుంచి విడిపోతూ పరిణామం చెందినప్పుడు ఆక్టోపస్‌లు మైక్రో ఆర్‌ఎన్‌ఏలను నిలుపుకోగలిగాయని.. అందుకే మెదడు ఎదిగి, జ్ఞానాన్ని చూపగలుగుతున్నాయని వివరించారు.
కొసమెరుపు ఏమిటంటే.. ఆక్టోపస్‌లు మనుషుల్లా కలలు కూడా కంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవి నిద్రపోయినప్పుడు కలల వల్లే వాటి రంగు, చర్మంపై ఆకారాలు మారిపోతూ ఉంటాయని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment