సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ ఓవైపు ప్రపంచాన్ని వణికిస్తుండగానే... ఆ తరహా వేరియెంట్ మరోటి బయటపడింది. ఒమిక్రాన్ సంతతికే చెందిన మరో వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకర వేరియెంట్‌గా చెబుతున్న ఒమిక్రాన్... 50 మ్యుటేషన్స్‌తో వేగంగా వ్యాప్తి చెందుతూ కొన్ని దేశాలను భయపెడుతోంది. దీని తీవ్రత ఎంత? దీనిమీద వ్యాక్సిన్లు పనిచేస్తాయా? పిల్లలు, వృద్ధుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇలాంటి సమాచారం ఏమీ లేదు.
ఇలాంటి తరుణంలో దాని లాంటిదే మరో వైరస్ రావడం సైంటిస్టులకు సవాలుగా మారింది. ఈ కొత్త వైరస్‌లో ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఏడు కేసులు నమోదయ్యాయి. నవబంబర్ 24న దక్షిణాఫ్రికాలో బయటపడ్డ B.1.1.529 వేరియెంట్‌లో మొదటిది BA.1 ఒమిక్రాన్ కాగా... BA.2 రెండోది. ఈ ఆఅ.2లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, కెనడాల్లో కేసులు నమోదయ్యాయి. BA.1 వేరియెంట్ కంటే.. BA.2లో మరో 14 మ్యూటేషన్స్ అధికం.
దీనివల్ల ఈ రెండు వైరస్‌లు వేర్వేరుగా స్పందిస్తున్నాయని... యూని వర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ జెనెటిక్స్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ఫ్రాన్‌స్వాయిజ్ బాలౌక్స్ తెలిపారు. రెండో వైరస్‌లో ఉన్న ఓ ప్రత్యేక గుణం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. అది టెస్టులు సైతం గుర్తించలేని విధంగా వైరస్ ఉండటం. డెల్టా, ఒమిక్రాన్ సహా అన్ని వేరియెంట్స్‌ను ఆర్టీపీసీఆర్ ద్వారా గుర్తించగలిగారు. కానీ సులభంగా స్కాన్ చేయగలిగే ఎస్–జీన్ డ్రాపౌట్ BA.2 లో లేక టెస్టులకు చిక్కట్లేదని అమెరికన్ మైక్రోబయాలజీ సొసైటీ చెబుతోంది.
కాగా కరోనాలో మ్యుటేషన్స్ పెరుగుతున్నా కొద్దీ బలహీనపడుతున్నట్లు కొందరు నిపుణులు భావిస్తున్న తరుణంలో.. ఇలా టెస్టులకు దొరకని వేరియెంట్ బయటపడటంతో∙ఆందోళన వ్యక్తమవుతోంది. అదనపు మ్యుటేషన్స్‌తో తొందరగా వచ్చిన ఈ వైరస్.. ఇప్పటికే యూకేను చుట్టుముడుతోన్న ఒమిక్రాన్ కంటే ప్రమాదకరం కాకపోవచ్చని ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ డేవిడ్‌స్టార్ట్ చెబుతున్నారు.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment