పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ని మే9న అరెస్టు కావడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ హింసాత్మకంగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ మీడియా విభాగం ఇంటర్ సర్వీస్ పబ్లిక రిలేషన్స్(ఐఎస్‌పీఆర్) ఆ రోజు జరిగిన విధ్వంసం గురించి ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఐఎస్‌పీఆర్ ఆ విధ్వంసాన్ని పాక్ దేశ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయంగా అభివర్ణించింది.
ఆ ప్రకటనలో ..ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుదారులు, పీటీఐ కార్యకర్తలు సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..ఎలా విధ్వంసానికి తెగబడ్డారో వెల్లడించింది. ఆ నిరసనల్లో ముఖ్యంగా ఆర్మీ ఆస్తులు, సంస్థాపనలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా నిరసనకారులను ఉద్దేశిస్తూ..ఎవరూ కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయొద్దని గట్టిగా హెచ్చరించింది. అలాగే నిరసకారుల్లో కొందరూ తమ సొంత ప్రయోజనాల కోసం దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా చర్యలకు దిగారని ఆరోపణలు చేసింది.
శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా చేశారని మండిపడింది. తమ దేశ పాకిస్తాన్ సంస్థలను గౌరవించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పింది. ఈ సమయంలో సైన్యం ఎంతో సహనంతో సంయమనాన్ని ప్రదర్శించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించిందని పేర్కొంది. ఐతే కొందరు సైన్యం ప్రతిస్పందనను నీచ రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకునేందుకు రెడీ అయ్యి దారుణాలకు ఒడిగట్టేందుకు యత్నించారని, వాటిని తాము గుర్తించామని వెల్లడించింది. ఇలాంటి ఘటనలకు తెగబడే వారిపై సైన్యం తప్పక కఠిన చర్యలు తీసుకుంటుందని ఐఎస్‌పీఆర్ హెచ్చరించింది.
అలాగే నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్‌ఏబీ) కూడా ఇమ్రాన్ ఖాన్ అరెస్టును సమర్థించిందని ఐఎస్‌పీఆర్ తెలిపింది. కాగా, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్, ఫైసలాబాద్, కరాచీ, క్వెట్టాతో సహా పాకిస్తాన్ అంతటా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకి వ్యతిరేకంగా నిరనలు చేస్తూ హింసాత్మక అల్లర్లకు తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ అగ్నిగుండంగా మారిపోయింది.
(చదవండి: ఇమ్రాన్ ఖాన్ ముమ్మాటికీ దోషే)
Comments
Please login to add a commentAdd a comment