ఇస్లామాబాద్: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కొత్తగా మరో రుణం అందకపోతే ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి చేరుకుంది. దేశంలో ఆర్థిక వ్యయాలను తగ్గించేందుకు 1.5 లక్షల ఉద్యోగాలను తగ్గించింది. అలాగే ఆరు మంత్రిత్వ శాఖలను కూడా రద్దు చేసింది. దీంతో పాటు మరో రెండు మంత్రిత్వ శాఖల విలీనాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది.
పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుండి రుణం తీసుకున్న అనంతరం దేశంలో ఆర్థిక నియంత్రణ చర్యలు చేపట్టింది. ప్రపంచానికి దేశ పరిస్థితిని చూపించేందుకు పాకిస్తాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి ఏడు బిలియన్ యూఎస్ డాలర్ల రుణం తీసుకుంది.
అమెరికా నుంచి తిరిగి వచ్చిన పాక్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ మీడియాతో మాట్లాడుతూ ఐఎంఎఫ్‌తో రుణ ఒప్పందం ఖరారయ్యిదని, ఇందుకోసం తాము కొన్ని విధానాలు అమలు చేయాల్సివుంటుందన్నారు. అలాగే జీ 20లో చేరాలంటే దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు చేయాల్సివస్తుందన్నారు. మంత్రిత్వ శాఖల పరిధిలో రైట్ సైజింగ్ పనులు జరుగుతున్నాయని, ఆరు మంత్రిత్వ శాఖలను రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం త్వరలో అమలులోకి వస్తుందని, రెండు మంత్రిత్వ శాఖలను విలీనం చేస్తామని మంత్రి తెలిపారు. వివిధ మంత్రిత్వ శాఖలలో 1,50,000 పోస్టులు రద్దు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
పెరుగుతున్న పన్నుల రాబడి గురించి ఆయన మాట్లాడుతూ గత ఏడాది మూడు లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు జత చేరరని, ఈ ఏడాది ఇప్పటివరకు 7,32,000 మంది కొత్త పన్ను చెల్లింపుదారులు నమోదు చేసుకున్నారని ముహమ్మద్ ఔరంగజేబ్ పేర్కొన్నారు. దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 1.6 మిలియన్ల నుండి 3.2 మిలియన్లకు చేరుకుందన్నారు.
ఇది కూడా చదవండి: రేపటి నుంచే కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతాయి
Comments
Please login to add a commentAdd a comment