ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఆ దేశ ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ఆయనపై ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసింది. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశాల నుంచి పొందిన ఖరీదైన బహుమతులను చట్టవిరుద్ధంగా సొంతం చేసుకుని భారీ ధరకు అమ్ముకున్నారనే ఆరోపణలపై విచారణ జరిపింది. అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం ఈ మేరకు వెలువరించింది.
ఎన్నికల సంఘం తీర్పుతో ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో తన పదవిని కోల్పోనున్నారు. అంతేకాదు మరో ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసి ఏ పదవి చేపట్టడానికి వీల్లేదు. అయితే ఈ తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేస్తామని ఇమ్రాన్ సన్నిహితులు తెలిపారు.
ఏంటీ వివాదం..?
2018లో పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ దుబాయ్ వంటి అరబ్ దేశాల్లో పర్యటించారు. ఈ సమయంలో ఖరీదైన వస్తువులు బాహుమతులుగా అందుకున్నారు. చట్ట ప్రకారం వీటిని కేబినెట్ నేతృత్వంలోని ప్రభుత్వ శాఖ అయిన తోషఖానాలో భద్రపరిచారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులకు కానుకలుగా వచ్చే విలువైన వస్తువులను ఈ శాఖ భద్రపరుస్తుంది. వాటిని వాళ్లు సొంతం చేసుకోవాలనుకుంటే డిస్కౌంట్‌తో విక్రయిస్తుంది.
అయితే సాధారణంగా 20శాతం ఉండే డిస్కౌంట్‌ను ఇమ్రాన్ ఖాన్ 50 శాతానికి పెంచారు. ఆ తర్వాత తనకు వచ్చిన ఖరీదైన కానుకలను తక్కువ ధరకే సొంతం చేసుకున్నారు. అనంతరం వాటిని భారీ ధరకు ఇతరులకు విక్రయించారు. ఈ ఆరోపణలపైనే విచారణ జరిపిన ఎన్నికల సంఘం ఇమ్రాన్‌పై అనర్హత వేటు వేసింది.
చదవండి: అతితక్కువ కాలం పదవుల్లో కొనసాగింది వీళ్లే!
Comments
Please login to add a commentAdd a comment