
ఇజ్రాయెల్‌తో యుద్ధం వేళ.. పాలస్తీనాకు కొత్త ప్రధాని నియమితులయ్యారు. మొహమ్మద్ ముస్తఫాను కొత్త ప్రధానిగా నియమిస్తూ తాజాగా ఆ దేశ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ నిర్ణయం తీసుకున్నారు. ముస్తఫా చాలాకాలంగా అధ్యక్షుడు అబ్బాస్ వద్ద సలహాదారునిగా పని చేస్తుండడం గమనార్హం. అయితే..
ఈ ఎంపికపై పాలస్తీనాలో మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ఇజ్రాయెల్‌పై దాడి అనంతరం.. ప్రధానిగా ఉన్న మొహమ్మద్ శతాయే ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. అప్పటి నుంచి అధ్యక్షుడు అబ్బాసే ప్రధాని పేషీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు నమ్మకస్తుడు ముస్తఫాకు ప్రధాని బాధ్యతలు అప్పగించారు. పాలస్తీనా అథారిటీలో సంస్కరణలు చేపట్టాలని ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలోనే ఈ నియామకం చేపట్టినట్లు అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రకటించారు. అయితే.. అమెరికా ఒత్తిళ్లతోనే అధ్యక్షుడు ఈ నియామకం చేపట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
ముస్తఫా నేపథ్యానికి వస్తే.. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఆర్థికవేత్తగా.. ప్రపంచ బ్యాంకులో పలు హోదాల్లో పనిచేశారు. 2014లో గాజాపై ఇజ్రాయెల్ దాడి తర్వాత పునర్నిర్మాణ పనుల్లో ముస్తఫా భాగం కావడం గమనార్హం.
అయితే.. కొత్త ప్రధాని అధికారాలు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో చాలా పరిమితంగానే ఉండనున్నాయి. ధ్వంసమైన గాజా స్ట్రిప్ పునర్నిర్మాణం, పలు వ్యవస్థల సంస్కరణల బాధ్యతలను ప్రధానికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. 2007 నుంచి గాజా స్ట్రిప్ హమాస్ నియంత్రణలోకి వెళ్లగా, వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ అధికారంలో ఉంది.
గాజాలోని పరిస్థితుల్ని అమెరికా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నది తెలిసిందే. ఇక గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మారణకాండలో 1,200 మంది చనిపోయిన విషయం తెలిసిందే. సుమారు 250 మందిని మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ భీకర దాడుల్లో పాలస్తీనా భూభాగంలో 31,000పైగా ప్రజలు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment