కాన్‌బెరా: ఆస్ట్రేలియాలో రెండేళ్ల క్రితం ఏకంగా పార్లమెంట్ హౌజ్‌లో, స్వయంగా ఒక మహిళా మంత్రి కార్యాలయంలో ఒక ఉద్యోగినిపై అత్యాచారం జరిగిన సంచలన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం నాటి రక్షణ పరిశ్రమల మంత్రి లిండా రేనాల్డ్స్ కార్యాలయంలో సహోద్యోగి చేతిలో అత్యాచారానికి గురయ్యానని ప్రభుత్వ మాజీ ఉద్యోగిని బ్రిటనీ హిగిన్స్ సోమవారం ఆరోపించారు. 2019లో ఈ ఘటన జరిగిందని, ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్తినప్పటికీ తనకు బాస్ అయిన మంత్రి లిండా రేనాల్డ్స్ నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కానీ న్యాయం పొందేందుకు తగిన సహకారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లనే పోలీస్ కంప్లయింట్‌పై ముందుకు వెళ్లలేదని వివరించారు. లిండా రేనాల్డ్స్‌కు హిగిన్స్ మీడియా సలహాదారుగా పనిచేశారు. ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో ఆ అత్యాచారంపై అధికారికంగా పోలీసులకు కంప్లయింట్ ఇవ్వలేదని తాజా ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు.
ఈ ఆరోపణలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని స్కాట్ మోరిసన్ మంగళవారం ఆమెకు క్షమాపణలు తెలిపారు. హిగిన్స్ ఆరోపణలపై నాటి రక్షణ మంత్రి రేనాల్డ్స్ ఆమెనే తప్పుపట్టడం సరికాదని, ఈ విషయంలో హిగిన్స్‌కు తాను క్షమాపణలు చెబుతున్నానని ప్రధాని మోరిసన్ వ్యాఖ్యానించారు. పని ప్రదేశాల్లో మహిళలకు మరింత భద్రత కల్పించే దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మోరిసన్ మంత్రివర్గంలో ప్రస్తుతం లిండా రేనాల్డ్స్ రక్షణ మంత్రిగా ఉన్నారు. పార్లమెంట్ హౌజ్ పని సంస్కృతిలో తీసుకురావాల్సిన మార్పులపై, ఉద్యోగినుల భద్రతపై సూచనలు చేసేందుకు ప్రధాని కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన తరువాత కూడా రేనాల్డ్స్‌ను మంత్రిగా కొనసాగించడంపై విపక్షాలు మోరిసన్‌పై విమర్శలు గుప్పించాయి.
Comments
Please login to add a commentAdd a comment