
గ్లాస్గో: సకల జగత్తుకు సూర్యుడే మూలాధారమని... సౌర విద్యుత్తును మానవాళి విజయవంతంగా వాడుకొని మనుగడ సాధించాలంటే ప్రపంచ సౌర గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘ఒకే భానుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్’ అని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులపై కాప్–26 సదస్సులో ‘స్వచ్ఛ సాంకేతికల ఆవిష్కరణలను వేగవంతం చేయడం– వినియోగంలో పెట్టడం’ అనే అంశంపై మోదీ మంగళవారం గ్లాస్గోలో ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రపంచంలోని ఏమూలలోనైనా సౌర విద్యుత్తు ఉత్పత్తికి గల అవకాశాలను లెక్కించే కాలిక్యులేటర్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) త్వరలో ప్రపంచానికి అందించనుందని వెల్లడించారు. ఉపగ్రహాలు అందించే డాటా ఆధారంగా ఇది పనిచేస్తుందని తెలిపారు. పారిశ్రామిక విప్లవకాలంలో శిలాజ ఇంధనాల శక్తి మూలంగా పలు దేశాలు ఆర్థికంగా బలమైన దేశాలుగా అవతరించాయని... అయితే అదే సమయంలో పర్యావరణం బలహీనపడిందని పేర్కొన్నారు.
శిలాజ ఇంధనాలతో నెలకొన్న పోటీ మూలంగా ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని, కానీ ఈ రోజు సాంకేతిక మనకు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని చూపుతోందని అన్నారు. ‘సకల జగత్తుకు సూర్యుడే ఆధారమని సూర్యోపనిషత్తు చెబుతోంది. శక్తికి మూలం భానుడే. సౌరశక్తి ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. ప్రకృతి సమతౌల్యతను కాపాడినంత కాలం భూగోళం సురక్షితంగానే ఉందని, ఎప్పుడైతే ఆధునికయుగంలో ముందుకెళ్లాలనే పోటీ మొదలైందో... అప్పుడే విధ్వంసం ఆరంభమైందని అభిప్రాయపడ్డారు. సౌరవిద్యుత్తును అందుబాటులో ఉంచాలంటే ప్రపంచ సౌరగ్రిడ్‌ను ఏర్పాటు చేయడమే మార్గమన్నారు.
ద్వీపాలకు భారత్ అండ
ప్రకృతి విపత్తులతో అల్లాడిపోయే చిన్న దేశాలకు భారత్ అండగా నిలిచింది. వాతావరణ మార్పుల కారణంగా నష్టపోతున్న చిన్న చిన్న ద్వీపసమూహాల్లాంటి దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియెంట్ ఐలాండ్ స్టేట్స్ (ఐరిస్) అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. కాప్26 వాతావరణ సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ దేశాలు ఇప్పటికే తీసుకువచ్చిన కొయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెయింట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్‌ఐ)లో భాగంగానే తాము కూడా పని చేస్తామన్నారు.