వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్లో మాట్లాడుతూ ఈ దశాబ్దాన్ని సాంకేతిక దశాబ్దంగా మార్చాలన్న లక్ష్యంతోనే భారత దేశంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి "స్టార్టప్ ఇండియా" మిషన్ ప్రారంభించినట్లు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయన సతీమణి జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు మూడురోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న భారత నరేంద్ర మోదీ రెండో రోజు న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు. అమెరికా ప్రధమ మహిళ జిల్ బైడెన్ తో కలిసి వర్జీనియాలో నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ను సందర్శించారు.
ఇక్కడ అవకాశాలున్నాయి.. అక్కడ యువత ఉన్నారు..
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒకపక్క అమెరికాలో అధునాతన సాంకేతికతతో కూడిన ప్రపంచస్థాయి విద్యా సంస్థలున్నాయి. మరోపక్క భారతదేశంలో భారీసంఖ్యలో నైపుణ్యమున్న యువత ఉంది. స్కిల్ ఇండియా కాంపెయిన్ పేరిట సుమారు ఐదు కోట్ల మందికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, డ్రోన్ విభాగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పించినట్టు తెలిపారు. భారత్-అమెరికా భాగస్వామ్యం ప్రపంచ వృద్ధికి ఇంజిన్ లా వ్యవహరిస్తుందని, అమెరికాకు భారత దేశానికి ఒక పైపులైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నారు.
యువత పైన పెట్టుబడి పెట్టాలి
అమెరికా ప్రధమ మహిళ జిల్ బైడెన్ మాట్లాడుతూ.. భారత్ అమెరికా కలయిక ప్రపంచంలోనే అతి పాతవైన, పెద్దవైన ప్రజాస్వామ్యాల కలయికగా అభివర్ణించారు. ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రమే కాదు కుటుంబాలు కూడా స్నేహతత్వంతో మెలుగుతున్నాయని, మా ఐక్యత ప్రాపంచిక సవాళ్ళను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ రెండు దేశాలు ఆర్ధికంగా వృద్ధి చెందాలంటే యువత పైన పెట్టుబడి పెట్టాల్సిన అవసరముందని, వారికి తగినన్ని అవకాశాలు కల్పించాలని అన్నారు.
ఇది కూడా చదవండి: భారత ప్రధానిపై హాలీవుడ్ నటుడి ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment