న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్–రష్యా విషయంలో ఇండియా వైఖరిని మరోసారి గుర్తుచేశారు. శాంతి చర్చలతోపాటు దౌత్య మార్గాల్లో ఇరు దేశాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని మోదీ పేర్కొన్నారు. మోదీ, పుతిన్ ఇంటర్నేషనల్ ఎనర్జీ, ఫుడ్ మార్కెట్లతోపాటు పలు కీలక అంశాలపై చర్చించుకున్నారని భారత ప్రధానమంత్రి కార్యాలయ(పీఎంఓ) వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి.
2021 డిసెంబర్‌లో పుతిన్ భారత పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు తీరును ఇరువురూ సమీక్షించారని పేర్కొన్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, ఔషధ ఉత్పత్తుల వాణిజ్యంలో భారత్–రష్యా పరస్పరం ఎలా సహకరించుకోవాలన్న దానిపై మోదీ, పుతిన్ సంప్రదింపులు జరిపారు. అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై తరచూ చర్చలు కొనసాగిస్తూ ఉండాలని నిర్ణయానికొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment