శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ భర్తపై దాడికి పాల్పడిన పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించాడు. శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న పాల్ (82)పై అతను సుత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఇది రాజకీయ ప్రేరేపిత, ఉద్దేశపూర్వక దాడి అని శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రూక్ జెంకిన్స్ వెల్లడించారు.
‘‘నాన్సీ ఎక్కడున్నారంటూ ఆరా తీశాడు. ఆమె కొన్ని రోజుల వరకు రాదని తెలుసుకుని పాల్ చేతులు కట్టేశాడు. కిందికి వెళ్లాలని ప్రయత్నించిన పాల్‌ను అడ్డుకున్నాడు. చివరికి రెస్ట్‌రూంకు వెళ్లేందుకు అంగీకరించాడు. రెస్ట్ రూం నుంచే పోలీసులకు పాల్ సమాచారమిచ్చారు. తర్వాత డేవిడ్ సుత్తితో పాల్ తలపై మోదాడు. పెనుగులాట జరుగుతుండగా పోలీసులు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు’’ అని చెప్పారు.
‘డెమోక్రాటిక్ పార్టీలోని అబద్ధాలాడే వారికి నాయకురాలు నాన్సీ. నిజం చెబితే వదిలేయాలని, లేదంటూ సుత్తితో మోకాళ్లు విరగ్గొట్టి, వీల్ చైర్‌లో కాంగ్రెస్‌కు తీసుకెళ్లాలనుకున్నా. అబద్ధాలు మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో మిగతా సభ్యులకు చూపాలనుకున్నా అని డేవిడ్ విచారణలో తెలిపాడు’అని జెంకిన్స్ వెల్లడించారు. నాన్సీ తర్వాత మరో కాంగ్రెస్ సభ్యుడిపైనా దాడి చేయాలనుకున్నట్లు చెప్పిన డేవిడ్ ఆ వివరాలు మాత్రం వెల్లడించలేదన్నారు.
అంతేకాదు, పాల్, డేవిడ్‌లకు మధ్య ఇంతకు ముందు ఎటువంటి పరిచయం కూడా లేదని జెంకిన్స్ చెప్పారు. పెలోసీ ఇంట్లోకి దొంగతనంగా చొరబడిన డేవిడ్ డిపపే(42) వెంట సుత్తితోపాటు చేతులను కట్టేసేందుకు జిప్ టేప్, తాడు వెంట తీసుకెళ్లాడు. కెనడా పౌరుడైన డేవిడ్ 2000వ సంవత్సరం నుంచి అమెరికాలో ఉంటున్నాడు.అతడి వీసా గడువు కూడా ఎప్పుడో ముగిసిపోయిందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment