వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదవీ ప్రమాణ స్వీకారం చేశాక గురువారం నిర్వహించిన తొలి మీడియా సమావేశం తీవ్ర విమర్శలకు దారి తీసింది. విలేకరుల అడిగిన ప్రశ్నలకు ఆయన నోట్స్ చూసుకుంటూ సమాధానాలు ఇవ్వడంతో అందరూ విస్తుపోయారు. 78 ఏళ్ల వయసున్న బైడెన్ ఎన్నో ప్రశ్నలకు రాసుకొని వచ్చిన సమాధానాల్ని చూసి చదివారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేస్తూ కామెంట్లతో హోరెత్తించారు.
బైడెన్ సమావేశంలోని ఒక ఫొటోలో ఆయన చేతిలో ఉన్న పేపర్‌లో కొందరి విలేకరుల ఫొటోలు రౌండ్ ఆఫ్ చేసి ఉండడంతో, కొంత మంది ఎంపిక చేసుకున్న జర్నలిస్టులకే ప్రశ్నలు వేయడానికి ఆయన అవకాశం ఇచ్చినట్టుగా ట్విట్టర్ వేదికగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ పేపర్‌లో మార్క్ చేసి ఉన్న విలేకరుల పేర్లనే ఆయన పిలిచారని, వారేం ప్రశ్నలు అడుగుతారో ఆయనకు ముందే తెలుసునని పలువురు నిందించారు. ‘‘ఇది మీడియా సమావేశం కాదు. సూడో ప్రజాస్వామ్యంలో జరిగిన ఒక నాటకం’’అని న్యూయార్క్ టైమ్స్ కాలమిస్టు కాండెస్ ఓన్స్ విరుచుకుపడ్డారు. బైడెన్ ఈ సమావేశంలో కరోనా వ్యాక్సినేషన్, సరిహద్దు సమస్యలు, వలస విధానంపై అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. బైడెన్ పదవీ ప్రమాణం చేసి రెండు నెలలు గడిచిపోయినా మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదన్న విమర్శలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment