Russian President Vladimir Putin: అతని కోసం ఎందాకైనా...! | Putin greets released prisoners arriving in Moscow | Sakshi
Sakshi News home page

Russian President Vladimir Putin: అతని కోసం ఎందాకైనా...!

Published Sat, Aug 3 2024 6:03 AM | Last Updated on Sat, Aug 3 2024 6:03 AM

Putin greets released prisoners arriving in Moscow

క్రషికోవ్‌... రష్యా టాప్‌ హిట్‌మాన్‌ 

జర్మనీ ఖైదు నుంచి విడిపించుకున్న పుతిన్‌ 

రష్యా చరిత్రలోనే అతి పెద్ద ఖైదీల మారి్పడి 

2024 ఆగస్టు 1. మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయం. అప్పుడే లాండైన విమానం నుంచి 8 మంది ప్రత్యేక భద్రత మధ్య బయటికి వచ్చారు. వారిలో ఒకరిని రిసీవ్‌ చేసుకునేందుకు ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతినే విమానాశ్రయం దాకా వచ్చారు. సదరు ‘వీఐపీ’కి షేక్‌హాండ్‌ ఇచ్చి మరీ సాదరంగా స్వాగతించారు. 

సరిగ్గా ఐదేళ్ల క్రితం. 2019 ఆగస్టు. జర్మనీ రాజధాని బెర్లిన్‌. చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ కార్యాలయానికి, పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న ఓ పార్కు. సైకిల్‌పై వస్తున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి తుపాకీ తీశాడు. తన ముందు నడుస్తున్న మాజీ చెచెన్‌ రెబెల్‌ జెలీంఖాన్‌ ఖాన్‌గోష్విలిని టపీమని కాల్చేశాడు. చుట్టుపక్కల వాళ్లు షాక్‌ నుంచి తేరుకునే లోపే క్షణాల్లో మాయమైపోయాడు. సైకిల్‌ను పక్కనే ఉన్న నదిలో పారేశాడు. విగ్గు తీసి, నీట్‌గా షేవ్‌ చేసుకుని ఎవరూ గుర్తించలేనంతగా రూపం మార్చుకున్నాడు. విధి వక్రించి ప్రత్యక్ష సాక్షులు గుర్తించడంతో కాసేపటికే పట్టుబడి జీవితఖైదు అనుభవిస్తున్నాడు. 

– నాడు జర్మనీలో జీవితఖైదుకు గురైందీ, నేడు మాస్కోలో పుతిన్‌ నుంచి ఘనస్వాగతం అందుకున్నదీ ఒక్కడే. అతనే... వదీం క్రషికోవ్‌. పేరుమోసిన రష్యా హిట్‌మ్యాన్‌. 

జెలీంఖాన్‌ ఒక్కడినే కాదు, రష్యాకు కంట్లో నలుసుగా మారిన వాళ్లెందరినో క్రషికోవ్‌ వెంటాడి వేటాడాడు. విదేశీ గడ్డపై ఇలాంటి అసైన్‌మెంట్లను సైలెంట్‌గా పూర్తి చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. రష్యా గూఢచర్య సంస్థ ఎఫ్‌ఎస్‌బీలో చేరిన కొన్నాళ్లకే టాప్‌ రేటెడ్‌ హిట్‌మ్యాన్‌గా పేరు సంపాదించాడు. ముఖ్యంగా పుతిన్‌కు అత్యంత ఇషు్టనిగా మారాడు. అందుకే అతన్ని విడిపించుకోవడాన్ని ఆయన సవాలుగా తీసుకున్నారు. జెలీంఖాన్‌ హత్యతో తనకు సంబంధమే లేదని విచారణ పొడవునా క్రషికోవ్‌ బుకాయించినా, అది అతని పనేనని పుతిన్‌ అధికారికంగానే అంగీకరించారు.

 క్రషికోవ్‌ను ‘గొప్ప దేశభక్తుని’గా అభివరి్ణంచారు. అతని కోసం సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత అమెరికాతో చరిత్రలోనే అతి పెద్ద ఖైదీల మారి్పడికి కూడా అంగీకరించారు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్టర్‌ ఇవాన్‌ గెర్షకోవిచ్, మాజీ మెరైన్‌ పౌల్‌ వీలన్, రష్యా అసమ్మతివాది వ్లాదిమిర్‌ కారా ముర్జా సహా 16 మందిని వదిలేశారు. బదులుగా అమెరికా, జర్మనీ, పశ్చిమ దేశాల నుంచి క్రషికోవ్‌తో పాటు 8 మంది రష్యన్లను విడిపించుకున్నారు. వారిలో మరో ఇద్దరు అండర్‌ కవర్‌ ఏజెంట్లున్నారు. తద్వారా, విదేశాల్లో ఇలాంటి ఆపరేషన్లు చేసే క్రమంలో దొరికిపోయినా అధ్యక్షుడు తమను కాపాడి తీరతారని నిఘా విభాగం ఏజెంట్లకు ధీమా ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పుతిన్‌ ఆశించింది కూడా అదేనని వారంటున్నారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement