Putin: ‘మాస్కోలో ఉగ్రదాడి.. ఉక్రెయిన్‌తో లింక్‌’ | Putin says Moscow concert attackers tried to flee to Ukraine | Sakshi
Sakshi News home page

Putin: ‘మాస్కోలో ఉగ్రదాడి.. ఉక్రెయిన్‌తో లింక్‌’

Published Sat, Mar 23 2024 9:51 PM | Last Updated on Sat, Mar 23 2024 10:15 PM

Putin says Moscow concert attackers tried to flee to Ukraine - Sakshi

రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భారీ ఉగ్రదాడిపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పందించారు. మాస్కోలో చోటు చేసుకున్న నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదలకు ఉక్రెయిన్‌తో సంబంధాలు ఉన్నాయని అన్నారు. ‘మాస్కోలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఉక్రెయిన్‌ వైపు పారిపోవడానికి యత్నించారు. తమకు ఉ‍న్న ప్రాథమిక సమాచారం మేరకు ఉక్రెయిన్‌-రష్యా సరిహద్దులను క్రాస్‌ చేసి ఉక్రెయిన్‌ వైపు వెళ్లడానికి ప్రయత్నించారు’ పుతిన్‌ స్థానిక టెలివిజన్‌తో మాట్లాడుతూ ఆరోపించారు.

‘ఈ ఉగ్రదాడి వల్ల వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు దేశ వ్యాప్తంగా బాధకరమైన రోజు. ఈ దారుణమైన దాడికి పాల్పన వ్యక్తులు, ఉగ్రసంస్థలను  శిక్షిస్తాం. వారు ఎవరైనా.. వారికి వెనక ఎవరున్నా కోరుకోం. ఉగ్రవాదుల వెనక ఎవరు ఉన్నారనే విషయాన్ని గుర్తిస్తాం. రష్యా ప్రజలకు వ్యతిరేకంగా దాడులకు  ప్రణాళిక వేసిన వారిని గుర్తించి శిక్షిస్తాం’ అని పుతిన్‌ హెచ్చరించారు. 

మాస్కో దాడి వెనకాల ఉక్రెయిన్‌కు లింక్‌ ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేసిన ఆరోపణలను ఉక్రెయిన్‌ తీవ్రంగా ఖండించింది. ‘మాస్కో ఉగ్రదాడిలో ఉక్రెయిన్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఆ ఉగ్రదాడికి మాకు లింక్‌ ఉందన్న ఆరోపణలు నిరాధారమైనవి’ అన ఉక్రెయిన్‌  మిలిటరీ స్పై ఏజెన్సీ స్పష్టం చేసింది.

రష్యాలోని మాస్కోలోని ఓ కాన్సర్ట్‌ హాల్లోకి చొచ్చుకుని వచ్చిన పలువురు సాయుధులు బాంబులు విసురుతూ.. తుపాకులతో అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 133 మంది మరణించారు. వంలాది మంది గాయపడినట్లు రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్విస్‌ వెల్లడించింది. 

మరోవైపు.. ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ మాస్కో దాడి తమ పనే అని ప్రకటించుకుంది. రష్యా రాజధాని మాస్కో శివార్లలో.. మా సంస్థ పెద్ద గుంపుపై దాడి చేసింది. అంతేకాదు మా బృందం సభ్యులు దాడి తర్వాత సురక్షితంగా తమ స్థావరాలకు చేరుకున్నారు అని టెలిగ్రామ్‌ ద్వారా ఒక సందేశం విడుదల చేసింది. మరోవైపు రష్యా నేషనల్‌ గార్డు మాత్రం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement