మాస్కో: తమను బెదిరించాలనుకునేవాళ్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ శత్రుదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. సర్మాత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను రష్యా విజయవంతంగా పరీక్షించిందని బుధవారం ఆయన ప్రకటించారు. ఈ క్షిపణులకు ఎదురులేదని చెప్పారు. ప్రస్తుతం రష్యా అమ్ములపొదిలో ఉన్న కింజల్, అవాంగార్డ్ క్షిపణులకు సర్మాత్ తోడవనుంది. గతనెల తొలిసారి రష్యా కింజల్ క్షిపణులను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. సర్మాత్ విజయవంతంపై సైంటిస్టులను పుతిన్ అభినందించారు. ఉత్తరరష్యాలో వీటిని ప్రయోగించామని, విజయవంతంగా ఈ క్షిపణి లక్ష్యాన్ని ఛేదించిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది.
ప్రపంచంలోని సుదూర తీరాలు కూడా ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయని వెల్లడించింది. వీటిని నిఘా వ్యవస్థలు కనిపెట్టడం కూడా కష్టమని నిపుణులు తెలిపారు. 200 టన్నులుండే ఈ మిసైల్ భూమి మీద ఏ లక్ష్యాన్నైనా చేరగలదని పుతిన్ ధీమా వ్యక్తం చేశారు. డోన్బాస్‌లో సాధారణ జనజీవనం నెలకొనేవరకు తమ ప్రయత్నాలు ఆపమని చెప్పారు. మరోవైపు తమ డిమాండ్ల ముసాయిదా ప్రతిపాదనను చర్చల్లో భాగంగా ఉక్రెయిన్‌కు అందించామని రష్యా అధికారులు తెలిపారు. ఇకపై చర్చలు కొనసాగలంటే ఉక్రెయిన్ స్పందించాల్సిఉందన్నారు. చర్చల జాప్యానికి ఉక్రెయినే కారణమని విమర్శించారు.
మారియుపోల్‌పై ఫోకస్
కొద్దిమంది ఉక్రెయిన్ సేనలు ప్రతిఘటిస్తున్న మారియుపోల్‌పై రష్యా మరింత ఒత్తిడి పెంచింది. దీంతో పాటు డోన్బాస్‌లో పలు ప్రాంతాల్లో యుద్ధ తీవ్రతను పెంచింది. మారియుపోల్‌లో ఉక్రెయిన్ సైనికులు తలదాచుకున్న స్టీల్‌ప్లాంట్‌పై రష్యా తీవ్రమైన బాంబింగ్ జరిపినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. స్టీల్‌మిల్‌ను తదనంతరం నగరాన్ని స్వాధీనం చేసుకోవడంపైనే రష్యా దృష్టి పెట్టిందన్నారు. నగరం నుంచి పౌరుల తరలింపునకు ప్రాథమిక అంగీకారానికి వచ్చామని ఉక్రెయిన్ ఉప ప్రధాని చెప్పారు. అయితే దీనిపై రష్యా స్పందించలేదు.
స్టీల్‌ప్లాంట్‌లో సైనికులు సరెండర్ అవ్వాలని మాత్రం మరోమారు అల్టిమేటం జారీచేసింది. ఈ నేపథ్యంలో నగరవాసులు వీలైనంత త్వరగా నగరం వీడాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. తమపై రష్యా అన్ని రకాలుగా పోరు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. తమను లొంగదీçసుకునేందుకు పౌర ఆవాసాలపై కూడా దాడులు చేస్తోందన్నారు. మారియుపోల్, డోన్బాస్ స్వాధీనానికి రష్యా వేలమందిని రంగంలోకి దించిందని పాశ్చాత్య దేశాలు తెలిపాయి. ఉక్రెయిన్‌కు సహాయాన్ని మరింత పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌కు నార్వే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పంపింది. హెవీ ఆర్టిలరీని పంపుతామని కెనెడా ప్రకటించింది.
► డోన్బాస్ రక్షణకు సైనికులను తరలించకుండా అడ్డుకునేందుకు ఉక్రెయిన్ నగరాలన్నింటిపై దాడులు ముమ్మరం చేసిందని బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది.
► ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన చర్చలపై చర్చించేదుకు ఉక్రెయిన్, రష్యాల్లో పర్యటిస్తానంటూ ఆయా దేశాధినేతలకు ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ లేఖలు రాశారు.
► ఉక్రెయిన్‌కు మరో ప్యాకేజీ ప్రకటిస్తామని అమెరికా తెలిపింది. పలువురు ప్రపంచ నాయకులతో అధ్యక్షుడు బైడెన్ మాట్లాడారు.
► చెర్నోబిల్‌లో రష్యా సైనికులు ఇష్టారీతిన ప్రవర్తించడంతో అణులీకేజి ముప్పు పెరిగిందని ఉక్రెయిన్ ఆరోపించింది. రేడియేషన్ స్థాయిలను కొలిచే పరికరాలను రష్యా సైనికులు దొంగిలించారని తెలిపింది.
► ఉక్రెయిన్ సంక్షోభంతో 50 లక్షలకు పైగా శరణార్థులయ్యారని ఐరాస అంచనా వేసింది.
► రష్యా, బెలారస్ క్రీడాకారులను వింబుల్డన్‌లో నిషేధిస్తున్నట్లు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రకటించింది.
► రష్యాకు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేస్తున్నట్లు జపాన్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment