లండన్: బ్రిటన్‌ను సుదీర్ఘకాలం, 70 ఏళ్లకు పైగా పాలించి ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన రాణి ఎలిజబెత్–2(96) ఇకలేరు. వేసవి విరామం కోసం స్కాట్లాండ్‌లోని బల్మోరల్ కోటలో ఉన్న రాణి గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ ధ్రువీకరించింది. రాణి ఆరోగ్యం విషమించిందనే వార్తల నేపథ్యంలో సన్నిహిత రాజకుటుంబీకులంతా ఉదయమే బల్మోరల్‌కు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో లండన్ వాసులు, పర్యాటకులు బకింగ్‌హామ్ ప్యాలెస్ వద్దకు చేరుకుంటున్నారు. 1952లో 25 ఏళ్లకే బ్రిటన్ రాణి కిరీటం ధరించిన ఎలిజబెత్ అత్యధిక కాలం రాణిగా కొనసాగారు. ఆమె ఆరోగ్యం గత ఏడాది అక్టోబర్ నుంచి క్షీణిస్తూ వస్తోంది. వయో సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దైనందిన కార్యకలాపాలను సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. ప్రయాణాలను బాగా తగ్గించుకున్నారు. బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ నియామకాన్ని కూడా ఆమె ఇటీవల బల్మోరల్ నుంచే చేపట్టారు. ప్రభుత్వ సీనియర్ సలహాదారులతో బుధవారం వర్చువల్‌గా రాణి పాల్గొనాల్సిన ప్రీవీ కౌన్సిల్ సమావేశం ఆఖరు నిమిషంలో వాయిదా పడటంతో ఆమె ఆరోగ్య పరిస్థితులపై అనుమానాలు మొదలయ్యాయి. రాణి ఆరోగ్యాన్ని వైద్యుల బృందం దగ్గరుండి పరిశీలిస్తోందని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించడం ఇందుకు ఊతమిచ్చింది.
ఈ నేపథ్యంలో రాణి సన్నిహిత కుటుంబ సభ్యులు బల్మోరల్ కోటకు చేరుకున్నారు. కుమారుడు ప్రిన్స్ చార్లెస్, కెమిల్లా దంపతులు, కూతురు ప్రిన్సెస్ అన్నె, మనవడు ప్రిన్స్ విలియమ్, యూకేలోనే ఉన్న ప్రిన్స్ హ్యారీ దంపతులు కూడా బల్మోరల్ వెళ్లారు. బీబీసీ ఇతర కార్యక్రమాలను రద్దు చేసి, రాణి గురించిన అప్‌డేట్స్‌ను అందిస్తోంది. రాణి ఆరోగ్యం విషమంగా ఉందని తెలియగానే పార్లమెంట్‌లో ఇంధన బిల్లులపై జరుగుతున్న చర్చను హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ లిండ్సే హోలె నిలిపివేశారు. ఎలిజబెత్–2 మరణంతో ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా, 14 కామన్వెల్త్ దేశాల అధినేతగా సంతాప కార్యక్రమాలను నిర్వహిస్తారు.
తీవ్ర వేదన చెందుతున్నాం: చార్లెస్
రాజకుటుంబం తరఫున నూతన రాజు చార్లెస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నా ప్రియమైన తల్లి, హర్ మెజెస్టీ ది క్వీన్ మరణం నాకు, నా కుటుంబ సభ్యులందరికీ తీవ్ర వేదన కలిగిస్తోంది. ఆమె మరణంపై మేము ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం’ అని తెలిపారు.
దిగ్భ్రాంతికి గురయ్యాం: లిజ్ ట్రస్
రాణి ఎలిజబెత్ మృతితో యూకేతోపాటు యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైందని నూతన ప్రధాని లిజ్ ట్రస్ పేర్కొన్నారు. డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఆమె కృషి వల్లనే నేడు బ్రిటన్ గొప్పదేశంగా ఎదిగింది. ఆమె అంకితభావం మనందరికీ ఆదర్శం’ అని పేర్కొన్నారు.
10వ రోజున అంత్యక్రియలు
► ఎలిజబెత్–2 రాణి మరణంతో ‘ఆపరేషన్ లండన్ బ్రిడ్జి’ పేరిట తదనంతర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
► నూతన రాజుగా ప్రిన్స్ చార్లెస్ బాధ్యతలు స్వీకరిస్తారు.
► యూకేలో జాతీయ పతాకాలను అవనతం చేశారు.
► పార్లమెంట్ వ్యవహారాలను 10 రోజులపాటు రద్దు చేశారు. జాతీయ సంతాప దినాలను ప్రకటిస్తారు.
► రాణి భౌతికకాయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని థ్రోన్ రూమ్‌కు తరలిస్తారు. ఐదు రోజులపాటు అక్కడే ఉంచుతారు.
► ఆ తర్వాత వెస్ట్‌మినిస్టర్ హాల్‌కు చేరుస్తారు. అక్కడ 3 రోజులపాటు ఉంచుతారు.
► రాణికి నివాళులర్పించడానికి రోజుకు 23 గంటలపాటు సాధారణ ప్రజలను అనుమతిస్తారు.
► పదో రోజున లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబ్బే చర్చిలో క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ప్రధాని మోదీ సంతాపం..
క్వీన్ మరణం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాణి మృతి బాధాకరమని, మన కాలంలో ఆమె ఒక దృఢమైన నేతగా గుర్తుండిపోతారని చెప్పారు. మాతృదేశం బ్రిటన్‌కు స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని అందించారని కొనియాడారు. ప్రజా జీవితంలో గౌరవ, మర్యాదలతో మెలిగారని, తనపై ఆమె చూపిన ఆదరాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. 2015, 2018లో ఎలిజబెత్ రాణితో జరిగిన తన సమావేశాలను గుర్తుచేసుకున్నారు. మరణం పట్ల సంతాపం ప్రకటించారు.
I had memorable meetings with Her Majesty Queen Elizabeth II during my UK visits in 2015 and 2018. I will never forget her warmth and kindness. During one of the meetings she showed me the handkerchief Mahatma Gandhi gifted her on her wedding. I will always cherish that gesture. pic.twitter.com/3aACbxhLgC
— Narendra Modi (@narendramodi) September 8, 2022
Comments
Please login to add a commentAdd a comment