శరీర బరువును తగ్గించడంలో రన్నింగ్ సహాయపడుతుందని ఫిట్‌నెస్ నిపుణులు చెప్పడాన్ని మీరు వినే ఉంటారు. అయితే ఒక వ్యక్తి కేవలం 21 కిలోమీటర్ల రన్నింగ్ ద్వారా తన శరీర బరువును 11 కిలోలు తగ్గించుకున్నాడనే సంగతి మీకు తెలుసా? ఇటీవల రష్యాలోని రిపబ్లిక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక వృద్ధుడు రన్నింగ్ ద్వారా 11 కిలోల బరువు తగ్గాడు. ఇందుకోసం ఆ వృద్ధుడు 2 గంటల 50 నిముషాలు పరిగెత్తాడు.
అయితే వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలేమిటో ధృవీకరణ కాలేదు. రష్యన్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లో ఉంటున్న 69 ఏళ్ల బహామా ఎగుబోవ్ పేరు 2019లో రష్యన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. అప్పుడు బహామా 5 గంటల పాటు పరిగెత్తి, 9 కిలోలకుపైగా బరువు తగ్గాడు. తాజాగా బహామా ఎగుబోవ్ 21 కిలోమీటర్ల రేసులో పరుగు తీసి, కేవలం రెండున్నర గంటల్లోనే 11 కిలోల బరువు తగ్గాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ ఫీట్‌లో బహామా ఎగుబోవ్ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు కాలేదు. ఎందుకంటే శరీరానికి హాని కలిగించే ఇలాంటి విజయాన్ని రికార్డ్‌గా పరిగణించరు. త్వరగా బరువు తగ్గేందుకు ప్రయోగాలు చేయడం ప్రాణాంతకం కావచ్చని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత వేగంగా బరువు తగ్గిన వ్యక్తి ని తానేనని బహామా ఎగుబోవ్ చెబుతున్నాడు. ఆడిటీ సెంట్రల్ న్యూస్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం బహామా.. జూడో, సాంబో, గ్రీకో-రోమన్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ప్రావీణ్యం సాధించాడు.
బహామా ఒకప్పుడు యుద్ధాల్లో పాల్గొన్న సమయంలో బరువు తగ్గించే కళను నేర్చుకున్నాడు. తాను తన చిన్నతనంలో యుద్ధాల కోసం 17 కిలోల బరువును తగ్గానని బహామా తెలిపాడు. అయితే వృద్ధాప్యంలో బరువు తగ్గడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అయినా తాను ఈ ఘనత సాధించానని పేర్కొన్నాడు. పోషకాహార నిపుణుడు ఒక్సానా లైసెంకో మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా రెండు గంటల్లో 11 కిలోల బరువు తగ్గాలంటే, శరీరం నుండి తగినంత ద్రవాన్ని తొలగించాలి. ఇది బహామా ఎగుబోవ్ విషయంలో నిస్సందేహంగా జరిగింది. అయితే సాధారణ వ్యక్తి ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని ఆయన హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: భారత్- కెనడాల మధ్య చిచ్చుపెడుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment