న్యూఢిల్లీ: భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతినేందుకు అక్కడ అధికారంలో ఉన్న ఇస్లామిక్ కన్జర్వేటివ్ పార్టీయే కారణం అని మాల్దీవుల్లో గతంలో భారత హై కమిషనర్‌గా పనిచేసిన మనోహర్ మూలే తెలిపారు. ‘మాల్దీవుల ప్రజల మనసును కలుషితం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. దీని వెనుక చైనా పాత్ర కీలకంగా ఉంది. పర్యాటక దేశంలోని కన్జర్వేటివ్ ఇస్లామిస్టులకు చైనా తన పూర్తి అండదండలందిస్తోంది.
అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ ఇస్లామిస్టులు అభివృద్ధి వైపు ఎక్కువ మొగ్గు చూపుతారనే పేరుంది. అదే సమయంలో ఇస్లామిక్ భావజాలాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. మహ్మద్ మొయిజ్జు మాల్దీవుల్లో అధికారం చేపట్టినప్పటి నుంచి పాలనలో కొంత ఇస్లామిక్ రంగు కనిపిస్తోంది.
మొయిజ్జు ప్రధాని అయిన తర్వాత తొలుత టర్కీలో పర్యటించారు. రెండవ పర్యటన కోసం చైనాకు వెళ్లారు. నిజానికి మహ్మద్ మొయిజ్జు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ను అనుసరించే వ్యక్తి అబ్దుల్లా యమీన్ కరుడు గట్టిన భారత్ వ్యతిరేకి అని తెలిసిందే.ప్రస్తుతం మహ్మద్ మొయిజ్జు చేపట్టినట్లుగానే 2015లో అబ్దుల్లా యమీన్ ఇండియా అవుట్ క్యాంపెయిన్‌ను చేపట్టారు’ అని మనోహర్ మూలే వివరించారు.
ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర వివాదం రేగింది. వేల సంఖ్యలో భారత పర్యాటకులు తమ మాల్దీవుల పర్యటనలను రద్దు చేసుకున్నారు. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవులు పిలుపును కూడా ఇచ్చారు. ఈ పిలుపుతో దిగి వచ్చిన మాల్దీవుల ప్రభుత్వం ఆ మంత్రుల వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని పేర్కొంది. మోదీపై వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment