ప్రతీకాత్మక చిత్రం
బీజింగ్: అగ్రరాజ్యం అమెరికా, చైనాల మధ్య నెలకొన్న దౌత్య యుద్ధం రోజురోజుకీ ముదురుతోంది. కాన్సులేట్ మూసివేత ఆదేశాలతో రాజుకున్న వేడి ‘పతాక’స్థాయికి చేరుకుంది. అమెరికాలోని హ్యూస్టన్‌లో గల చైనా కాన్సులేట్‌ను మూసివేయించడంతో ఇప్పటికే ప్రతీకార చర్యలు ప్రారంభించిన డ్రాగన్.. మరింత దూకుడుగా ముందు సాగుతోంది. అగ్రరాజ్యానికి ఎంతో వ్యూహాత్మకమైన చెంగ్డూలోని అమెరికా కాన్సులేట్ మూసివేతకు ఆదేశించిన చైనా.. సోమవారం ఆ కార్యాలయాన్ని ఖాళీ చేయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా జాతీయ జెండాను అవనతం చేస్తున్న దృశ్యాలు అధికార మీడియాలో ప్రసారమయ్యాయి. అదే విధంగా చెంగ్డూలోని కాన్సులేట్‌లో పనిచేసే సిబ్బందిని అక్కడి నుంచి ఈరోజు ఉదయం 6 గంటలకే ఖాళీ చేయించారని.. అలాగే కాన్సులేట్‌కు చేరుకునే రోడ్డు మార్గాన్ని కూడా పోలీసులు దిగ్బంధనం చేసినట్లు మీడియా వెల్లడించింది.(దెబ్బకు దెబ్బ.. )
21వ శతాబ్దం అంధకారంగా మారే అవకాశం
ఇక ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన యుద్ధానికి అమెరికా నిర్ణయాలే కారణమన్న డ్రాగన్.. యూఎస్ తన తప్పుడు నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని శనివారం ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా జాతీయ మీడియా గ్లోబల్ టైమ్స్ సోమవారం నాటి ఎడిటోరియల్‌లో.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే పర్యవసానాలు ఘోరంగా ఉంటాయని, ఊహించని ఉపద్రవం ముంచుకు వస్తుందని అభిప్రాయపడింది. ‘‘చైనా- అమెరికాల మధ్య ఉన్న సంబంధాలను మరింత దిగజార్చే ప్రయత్నాలు జరిగితే.. 21వ శతాబ్దం అంధకారంగా మారే అవకాశం ఉంది. ప్రచ్చన్న యుద్ధం నాటి పరిస్థితుల కంటే మరింత విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని తన కథనంలో హెచ్చరించింది. (‘చైనాను మార్చకుంటే అది మనల్ని మింగేస్తుంది’)
కాగా హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ గూఢచర్యానికి పాల్పడుతోందని అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. 72 గంటల్లోగా కాన్సులేట్‌ను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఇందుకు స్పందించిన చైనా అగ్రరాజ్యంపై అదే తరహా ఆరోపణలు గుప్పించింది. చెంగ్డూ అమెరికా కాన్సులేట్‌లో పనిచేసే సిబ్బంది చైనా అంతర్గత వ్యవహారాల్లో కలుగ జేసుకుంటూ దేశ భద్రతా ప్రయోజనాలకు హాని తలపెడుతున్న కారణంగా.. కాన్సులేట్‌ను మూసివేయాల్సిందిగా ఆదేశించింది. అయితే ఇందుకు ఎటువంటి గడువు విధించనప్పటికీ సోమవారం భవనాన్ని ఖాళీ చేయించినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment