టోక్యో: జపాన్ సూషీ రెస్టారెంట్ లకు ప్రసిద్ధి. అదొక డిష్ ఐటమ్. ఉడికించిన బియ్యంలో గుబాళింపు కోసం వెనిగర్ చుక్కలు చల్లుతారు. చిన్న పిల్లల అరచేతిలో పెట్టే చిట్టి అన్నం ముద్దలా ఉంటుంది అది. దానిని ఒక రకమైన సముద్రపు కలుపులో చుడతారు. చేపలు లేదా మాంసం ముక్కలు జత చేస్తారు. శాకాహారుల కోసం అయితే వాటికి బదులుగా కాయగూరలు ఉంటాయి. సాధారణం గా అవి దోస ముక్కలు అయి ఉంటాయి. కొంచెం చక్కెర, ఉప్పు కలుపుతారు. సూషీ రెడీ అయిపోతుంది. ఇళ్లల్లో కూడా చేసుకోవచ్చు. కానీ హోటల్ నుంచి తెప్పించుకుంటే ఆ టేస్ట్ వేరు. కరోనా రాక ముందు వరకు జపాన్ లో సూషీ రెస్టారెంట్‌లు రద్దీగా ఉండేవి. డెలివరీ కౌంటర్ ల దగ్గరైతే తొక్కిసలాటే. డెలివరీ బాయ్స్ తో కళకళ లాడుతుండేది చిన్న సూషీ రెస్టారెంట్ కూడా. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. లాక్ డౌన్ ఎత్తేసినా ఫుడ్ డెలివరీ పిక్ అప్ కావడం లేదు. ఎలా మరి బిజినెస్ జరగడం! ఏదో కొత్తగా చేయాలి. సూషీ లో కొత్తగా చేయడానికేమీ ఉండదు. ఒక వేళ చేసినా ఆ కొత్తదనాన్ని కస్టమర్లు కచ్చితంగా ఇష్టపడరు. అందుకని అక్కడి ఓ రెస్టారెంట్ ఓ కొత్త ఆలోచన చేసింది. బాడీ బిల్డర్ లను డెలివరీ బాయ్స్ గా పెట్టుకుంది!! వీళ్లేం చేస్తారంటే సూటు వేసుకుని వెళ్లి సూషీ ని డెలివరీ చేశాక, డోర్ బయట నిలబడి కస్టమర్ ముందు సూట్ తీసి, చొక్కా విప్పి కండల ప్రదర్శన చేస్తారు. ఫ్రంట్ ఒకసారి, వెనక్కు తిరిగి బ్యాక్ ఒకసారి. తర్వాత చొక్కా, సూటు వేసుకుని ధన్యవాదాలు తెలిపి వెళ్లిపోతారు. ఇప్పుడిప్పుడు ఈ ‘డెలివరీ మాచో’ సర్వీసు (వాళ్లు పెట్టుకున్న పేరే) ఊపు అందుకుంటోందట. అయితే కనీసం 7000 ఎన్ లకు తక్కువ కాకుండా సూషీని ఆర్డర్ ఇచ్చిన వాళ్లకే ఈ మాచో సర్వీసు. మన రూపాయల్లో సుమారు ఐదు వేలు అనుకోండి. ఏమైనా ఈ పద్ధతి బాగున్నట్లు లేదని అప్పుడే ముఖాల చిట్లింపులు కూడా మొదలయ్యాయి.
చూడండి: పాక్ చెరలో 19మంది భారతీయులు
Comments
Please login to add a commentAdd a comment