ప్రధానిగా తొలిసారి పార్లమెంటులో ప్రైమ్ మినిస్టర్స్ క్వశ్చన్స్‌ను ఎదుర్కొంటున్న రిషి
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ బాధ్యతలు తీసుకున్న వెంటనే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. డేటా ఉల్లంఘన తప్పిదాలపై లిజ్ ట్రస్ హయాంలో హోంమంత్రిగా రాజీనామా చేసిన భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్‌ని తిరిగి నియమించడాన్ని ప్రతిపక్ష లేబర్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. రాజీనామా చేసిన వారం రోజుల్లోనే ఆమెను అదే పదవిలో నియమించడాన్ని తప్పు పట్టింది.
బ్రేవర్మన్ నియామకాన్ని రిషి సమర్థించారు. ఆమె తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. ఆర్థిక మంత్రిగా జెరెమి హంట్, విదేశాంగ మంత్రిగా జేమ్స్ క్లెవెర్లీలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కొత్త మంత్రులతో ఆయన బుధవారం మొట్టమొదటి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. తొలిసారి ప్రధాని హోదాలో ప్రైమ్ మినిస్టర్ క్వశ్చన్స్ (పీఎంక్యూస్) ఎదుర్కోవడానికి ముందు కేబినెట్ కొత్త మంత్రులతో కలిసి చర్చించారు.
యూకే రాజకీయాల్లో పీఎంక్యూస్ కార్యక్రమం అత్యంత కీలకమైనది. ప్రతీ బుధవారం సాయంత్రం జరిగే ఈ కార్యక్రమంలో విపక్ష పార్టీలు, ఎంపీలు ఏ అంశం మీద అడిగిన ప్రశ్నలకైనా ప్రధాని బదులివ్వాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలను రిషి నవంబర్ 17 దాకా వాయిదా వేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సన్నాహాలే ఇందుకు కారణమని హంట్ చెప్పారు.
కేబినెట్ సమావేశంలోనూ ప్రధానిగా పార్లమెంటు తొలి భేటీలోనూ రిషి చేతికి హిందువులకు పవిత్రమైన దీక్షా కంకణం (మంత్రించిన ఎర్ర తాడు) ధరించి పాల్గొన్నారు. దీనిపై చర్చ జరుగుతోంది. దుష్ప్రభావాలు పోయి మంచి జరగడానికి దీనిని ధరిస్తే దేవుడు రక్షగా ఉంటాడని హిందువులు నమ్ముతారు. హిందూ మత విశ్వాసాలకు చెందిన దీనిని ధరించడంతో రిషి తాను నమ్ముకున్న సంప్రదాయాలను ఎంతో గౌరవిస్తారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment