లండన్: బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ తన భార్య, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తి గురించి అనేక విషయాలు వెల్లడించారు. వారి తొలి పరిచయం, ఆమె వ్యవహార శైలి, కుటుంబ బాధ్యతలు, పెళ్లి నాటి విషయాలను రిషి సునాక్ మీడియాకు తెలిపారు.
‘వస్తువులను చక్కగా అమర్చే అలవాటు నాది. తానేమో చిందరవందరగా పడేస్తుంది. నేను చాలా క్రమశిక్షణతో ఉంటాను. తనకేమో సమయస్ఫూర్తి ఎక్కువ. ఈ విషయాలు చెప్పడం తనకు ఇష్టముండదు. కానీ, నేను మనస్సులో ఉన్న మాట చెబుతున్నా. ఆమెది పూర్తిగా చక్క బెట్టే తత్వం కాదు. ప్రతి చోటా దుస్తులు, ఎక్కడపడితే అక్కడ షూలు. ఓహ్..గాడ్..!’ అంటూ తన భార్య అక్షత గురించి సునాక్ వివరించారు.
ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో భారత సంతతికి చెందిన దంపతులుకు రిషి సునాక్ జన్మించారు. రిషి స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోన్న సమయంలో అక్షతతో పరిచయం ఏర్పడింది. అనంతరం 2006లో వారికి బెంగళూరులో వివాహమైంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. కృష్ణ(11), అనౌష్క(9). ‘ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే వాళ్లు పుట్టే సమయానికి నేను సొంత బిజినెస్ నడుపుతున్నా. అందుకే వాళ్లతో గడపటానికి సమ యం దొరికేది. అలా వాళ్లతో ప్రతిక్షణాన్ని ఆస్వాదించా’అని కుటుంబ విషయాలను సునాక్ పంచుకున్నారు.
అయితే, రిషి సునాక్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన భార్య అక్షతా మూర్తి పన్నుల చెల్లింపు వ్యవహారం వివాదాస్పదమైంది. దీంతో అధికార నివాసం డౌనింగ్ స్ట్రీట్‌లోని నంబర్–10 నుంచి ఖాళీ చేసి మరో చోటుకు వెళ్లిపోయారు. అనంతరం అక్షత వివాదం సద్దుమణిగింది. ఇదే సమయంలో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. అనంతరం కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునే ప్రక్రియ మొదలు కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. అంతిమ ఫలితం సెప్టెంబర్ 5న తేలనుంది.
చదవండి: అయోధ్యలో బీజేపీ నేతల భూ కుంభకోణం.. అఖిలేశ్ యాదవ్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment