రష్యా వైమానిక దాడిలో ధ్వంసమైన ఆర్ట్ స్కూల్ ఉపగ్రహ చిత్రం
మాస్కో: ఉక్రెయిన్‌లో విధ్వంసమే లక్ష్యంగా పెట్టుకున్న రష్యా నానాటికీ విచక్షణారహితంగా వ్యవహరిస్తోంది. రేవు పట్టణం మారియుపోల్‌లో కనీసం 400 మంది తలదాచుకున్న ఓ ఆర్ట్ స్కూల్‌పై ఆదివారం బాంబుల వర్షం కురిపించింది. దాడిలో స్కూలు నేలమట్టమైంది. అందులోంచి 150 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. మిగతా వారంతా శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం.
మారియుపోల్‌లో 1,300 మందికి పైగా తలదాచుకున్న ఓ థియేటర్ మీద బుధవారం రష్యా బాంబులు వేయడం తెలిసిందే. మరోవైపు రష్యా సైన్యం వరుసగా రెండో రోజూ ఉక్రెయిన్‌పైకి కింజల్ హైపర్‌సోనిక్ క్షిపణులు ప్రయోగించింది. రేవు పట్టణం మైకోలేవ్ సమీపంలో ఇంధన డిపోను కింజల్ మిసైల్ ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ చెప్పారు. యుద్ధ నౌకల పై నుంచి కాలిబర్ క్రూయిజ్ మిసైళ్ల ప్రయోగం ద్వారా చెహిర్నివ్ సమీపంలోని నిజిన్ వద్ద ఆయుధ మరమ్మతు ప్లాంటును కూడా నేలమట్టం చేసినట్టు చెప్పారు.
ఉత్తరాన ఓవ్రుచ్‌లోని ఉక్రెయిన్ ప్రత్యేక దళాలు, విదేశీ కిరాయి సైనికుల స్థావరంపైనా భారీగా మిసైళ్ల వర్షం కురిపించామన్నారు. మారియుపోల్‌లోకి రష్యా సైన్యాలు మరింతగా చొచ్చుకెళ్లి అన్నివైపుల నుంచీ చుట్టుముట్టాయి. ఆహారం, తాగునీరు తదితర సరఫరాలు పూర్తిగా ఆగిపోయి పౌరులు నరకయాతన పడుతున్నారు. నగరంలో ఇప్పటికే కనీసం 3000 మందికి పైగా అమాయకులు కాల్పులకు బలయ్యారని సమాచారం. దాడిలో నగరం సర్వనాశనమైందని, రూపురేఖలు సైతం కోల్పోయిందని సమాచారం. ఖర్కీవ్‌లోనూ భారీ దాడుల్లో కనీసం ఐదుగురు మరణించారని సమాచారం. 10 మానవీయ కారిడార్ల గుండా వేలాది మంది వలస బాటపట్టారు.
యుద్ధంలో ఇప్పటిదాకా 15 వేలకు పైగా సైనికులను, 1,500కు పైగా యుద్ధ ట్యాంకులతో పాటు ట్రక్కులు, భారీ సాయుధ వాహనాలను రష్యా నష్టపోయిందని అంచనా. మరోవైపు, రష్యాతో లింకులున్నాయంటూ 11 పార్టీలపై జెలెన్‌స్కీ నిషేధం విధించారు. ఉక్రెయిన్ తన గగన తలాన్ని సమర్థంగా రక్షించుకుంటోందని ఇంగ్లండ్ అభిప్రాయపడింది. గగనతలంపై రష్యా ఇప్పటిదాకా ఆధిక్యం సాధించలేకపోయిందని చెప్పింది. తమవారి చేతుల్లో మరణించిన సైనికుల మృతదేహాలను తీసుకెళ్లే ప్రయత్నం కూడా రష్యా చేయడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. పలుచోట్ల రష్యా దాడిని ఆరేడుసార్లు తిప్పికొట్టామన్నారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా వశపరచుకుని నియంత్రించాలంటే రష్యాకు కనీసం 8 లక్షల సైన్యం కావాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంటే రష్యా తన సైన్యమంతటినీ ఉక్రెయిన్లోనే నియోగించాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment