ఉక్రెయిన్ దురాక్రమణ నేపథ్యంలో.. రష్యా సంచలన ఆరోపణలకు దిగింది. రష్యా ఆక్రమిత ‘ఖేర్‌సన్’లో ఉక్రెయిన్ సైన్యం డర్టీ బాంబు ప్రయోగించబోతోందని ఆరోపించింది. ఈ మేరకు ఇప్పటికే ఖేర్‌సన్‌ను ఖాళీ చేయించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది కూడా. అయితే పాశ్చాత్య దేశాలు రష్యా ఆరోపణలను ఖండించగా.. కౌంటర్‌కు మాస్కో సిద్ధమైంది. ఈ పంచాయితీని ఏకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తేల్చుకుంటామని తేల్చేసింది.
ఈ మేరకు.. ఐరాసలో రష్యా రాయబారి వస్సెయిలీ నెబెంజియా.. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్‌కు ఓ లేఖ రాశారు. కీవ్(ఉక్రెయిన్ రాజధాని) బలగాలు డర్టీ బాంబు ప్రయోగానికి సిద్ధమయ్యాయని, డర్టీ బాంబు ప్రయోగం అనేది అణు ఉగ్రవాదం కిందకు వస్తుందని, బలప్రయోగాన్ని నిలువరించాల్సిన బాధ్యత ఐరాస మీద ఉందని పేర్కొంటూ లేఖలో నెబెంజియా ఆరోపించారు. సోమవారం రాత్రి ఈ లేఖ సెక్రటరీ జనరల్‌కు అందినట్లు తెలుస్తంఓది. ఇక మంగళవారం ఈ వ్యవహారంపై భద్రతా మండలిలో తేల్చుకుంటామని రష్యా అంటోంది.
ఇక ఉక్రెయిన్ దళాలు.. రష్యా ఆక్రమిత ఖేర్‌సన్ వైపు వేగంగా కదులుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాన్ని రష్యా ఖాళీ చేయిస్తోంది. ఆదివారం ఖేర్‌సన్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని మైకోలాయివ్(ఉక్రెయిన్ పరిధిలోనే ఇంకా ఉంది)పై రష్యా మిస్సైల్స్ ప్రయోగించింది. ఈ దాడిలో ఓ అపార్ట్‌మెంట్‌ను సర్వనాశనం అయ్యింది. అదే సమయంలో ఖేర్‌సన్ సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని, స్థానికులపై దోపిడీలు జరుగుతున్నాయని ఉక్రెయిన్ సైన్యం ఆరోపిస్తోంది.
ఒకవైపు ఉక్రెయిన్ దళాలు వేగంగా రష్యా ఆక్రమిత ప్రాంతాల వైపు దూసుకొస్తుంటే.. మరోవైపు సుమారు ఆరు లక్షల మందిని సైన్యం కోసం రష్యా సిద్ధం చేస్తోంది. ఈ పరిణామాలతో యుద్ధ వాతావరణం మరోసారి వేడెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment