మాస్కో: ప్రపంచ జనాభా తగ్గిపోతోంది.. ఇప్పుడు ఇది ఒక ఆందోళనకరమైన అంశంగా సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు.. జనాభాను పెంచే మార్గాలపై దృష్టిసారించాయి. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం రష్యా జనాభాను పెంచేందుకు ఓ పథకం తీసుకొచ్చి.. అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాడు. పదేసి మంది పిల్లలను కని.. వాళ్లను పెంచే తల్లులకు నగదు నజరానా ప్రకటించాడాయన.
మదర్ హీరోయిన్.. పుతిన్ నేతృత్వంలో ప్రభుత్వం రష్యాలో తీసుకొచ్చిన పథకం పేరు. ఈ పథకం ప్రకారం.. పది మంది పిల్లలను కని.. వాళ్లను సురక్షితంగా పెంచాల్సి ఉంటుంది తల్లులు. అలా చేస్తే.. వన్ మిలియన్ రూబుల్స్(మన కరెన్సీలో 12 లక్షల 92 వేల రూపాయల)తో పాటు మదర్ హీరోయిన్ గౌరవం ఇచ్చి గౌరవిస్తారు. ఈ విషయాన్ని రష్యా రాజకీయ, భద్రతా దళ నిపుణుడు డాక్టర్ జెన్నీ మాథర్స్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సోమవారం పుతిన్ సంతకాలు చేసినట్లు అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
తగ్గిపోతోంది..
గత రెండున్నర దశాబ్దాలుగా.. రష్యా జనాభా ఆందోళనకరంగా పడిపోతోంది. పైగా కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లాంటి తాజా పరిణామాలతో జనాభా సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలో ఈ సంక్షోభం బయటపడేందుకు పుతిన్ తాజా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు మాథర్స్ తెలిపారు. అయితే..
కొత్తదేం కాదు..
పుతిన్ సంతకం చేసిన ‘మదర్ హీరోయిన్’ ఆదేశాలు కొత్తవేం కాదు. గతంలోనూ ఉన్నాయి. ఇంతకు ముందు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ నేత జోసెఫ్ స్టాలిన్.. యుద్ధంలో మరణించిన వాళ్ల సంఖ్యతో జనాభా తగ్గిపోగా ‘మదర్ హీరోయిన్’ రివార్డును ప్రకటించాడు. ఆ స్కీమ్ అప్పట్లో బాగా వర్కవుట్ అయ్యింది. జనాభా క్రమేపీ పెరుగుతూ పోయింది. అయితే.. 1991 సోవియట్ యూనియన్ పతనంతో ఈ టైటిల్ ఇవ్వడం కూడా ఆగిపోయింది. ఇదిలా ఉంటే..
పుతిన్ ‘దేశభక్తి’ ప్రయత్నాలు వర్కవుట్ అయ్యేవి కావని డాక్టర్ మాథర్స్ అంటున్నారు. ఎందుకంటే.. పదవ బిడ్డ పుట్టిన తర్వాతే అదీ మిగతా తొమ్మిది మంది బిడ్డల ఆరోగ్య స్థితి బాగా ఉంటేనే ఈ ప్రైజ్ మనీని, మదర్ హీరోయిన్ ట్యాగ్‌ను సదరు తల్లికి అందిస్తారు. దీంతో ఆ ప్రైజ్ మనీ కోసం అంతమంది పిల్లలను పోషించడం.. కుటుంబాలకు భారం కావొచ్చనే చర్చ నడుస్తోంది అక్కడ. అప్పటి, ఇప్పటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు బేరీజు వేసుకుంటే.. మదర్ హీరోయిన్ ఇప్పుడు విఫలం కావొచ్చనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: కొలీగ్ కౌగిలించుకోవడంతో కోర్టుకెక్కింది!
Comments
Please login to add a commentAdd a comment