మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న రష్యా సైనికుల తల్లులు, భార్యలు.. ఆయన్ని నిలదీసే పరిస్థితికి చేరుకున్నారు. తమ వాళ్ల పేరిట కుటుంబాలకు ఇచ్చిన భద్రత హామీల అమలు ఏమయ్యిందంటూ, తమకు సమాధానం చెప్పాలంటూ ఆయన్ని నిలదీస్తున్నారు.
ఉక్రెయిన్ యుద్ధం మొదలై తొమ్మిది నెలలు పూర్తైంది. కానీ, ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదని వాళ్లు సోషల్ మీడియా సాక్షిగా పుతిన్‌ను నిలదీస్తున్నారు. మరో విషయం ఏంటంటే.. రష్యా సైనికుల కుటుంబ సభ్యులతో పుతిన్ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ సమయంలోనే కొందరు కుటుంబ సభ్యులు వీడియో పోస్టులు అక్కడి సోషల్ మీడియాలో పెడుతుండడం గమనార్హం.
కొన్ని కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సంగతి ప్రభుత్వానికి ముందే తెలుసు. అది ఊహించే ఈ సమావేశానికి వాళ్లను దూరంగా ఉంచారు. కేవలం అధ్యక్షుడు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు కొన్ని కుటుంబాలను మాత్రమే ఆ సమావేశానికి ఆహ్వానించారు అని రష్యా ఉద్యమవేత్త ఓల్గా సుకనోవా అంటున్నారు. ఆమె తన 20 ఏళ్ల కొడుకు ఉక్రెయిన్ యుద్దంలో పాల్గొనడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే.. సమారా నగరం నుంచి వోల్గా నది వెంట 900 కిలోమీటర్లు ప్రయాణించి మరీ క్రెమ్లిన్‌కు చేరుకుంది.
అలాగే కొందరు మహిళలు.. పుతిన్ ముందర ఫిర్యాదులు చేస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడి ఫిర్యాదు చేయలేదని ఆమె అంటున్నారు. అత్యవసరంగా తమ వాళ్లను యుద్ధం రొంపిలోకి దింపిన అధ్యక్షుడు పుతిన్.. చేసిన వాగ్దానాలను నెరవేర్చాలంటూ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు రష్యా సైనికుల కుటుంబ సభ్యులు. యుద్ధ సమయంలో సైనికుల కుటుంబ సభ్యులకు ప్రత్యేక అలవెన్సులతో పాటు జీవిత బీమా, పిల్లలకు చదువులు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని హామీలు ఇచ్చింది క్రెమ్లిన్. అంతేకాదు యుద్ద కాలంలో వాళ్లతో మాట్లాడించేలా ఏర్పాట్లు కూడా చేయిస్తామని తెలిపింది. కానీ, వాటి విషయంలో ఎలాంటి పురోగతి లేదు.
మరోవైపు సెప్టెంబర్‌లో ఉక్రెయిన్ యుద్ధం కోసం లక్షల మంది కావాలంటూ ప్రకటన ఇచ్చి.. అన్ని వయస్కుల వాళ్లను బలవంతపు శిక్షణకు ఆదేశించింది. అయితే.. అందులో వృద్ధులు, పిల్లలు సైతం ఉండడంతో నాలుక కర్చుకున్న క్రెమ్లిన్ వర్గాలు.. ప్రకటనలో పొరపాటు దొర్లిందంటూ సవరణ ప్రకటన ఇచ్చాయి.
ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ఎలా పుట్టిందో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment